రాష్ట్ర రహదారులపై 787 ప్రమాదకర ప్రదేశాలు
పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం
బ్లాక్ స్పాట్ల వల్లే వాహనదారుల ప్రాణాలు పోతున్నాయి
పోలీసు శాఖ నివేదిక
రోడ్డెక్కితే సురక్షితంగా గమ్యం చేరతామా? లేదా? అనేది ఇప్పుడు రాష్ట్రంలో మిలియన్ డాలర్ల ప్రశ్న. కారణం.. రహదారుల అస్తవ్యస్త నిర్మాణం, పొంచి ఉన్న ప్రమాద ప్రాంతాలే. దీంతో రాష్ట్రంలోని రహదారులు నిత్యం రక్తమోడుతున్నాయి. వాటిల్లో ఎక్కువ ప్రమాదాలు కొన్ని ప్రాంతాల్లోనే జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వంలో ఎలాంటి కదలికా లేదు.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్డు ఎక్కాలంటేనే వాహనదారులు బెంబేలెత్తాల్సి వస్తోంది. గుంతలమయంగా, ప్రమాదకర మలుపులతో ఉన్న రోడ్లపై వాహనం నడపడమంటే సర్కస్ ఫీట్లు చేసినట్లే. గమ్యం చేరేవరకూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని డ్రైవింగ్ చేయాల్సి వస్తోంది.
రాష్ట్రంలో పెరుగుతున్న రహదారి ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అయినా సరే ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్న బ్లాక్ స్పాట్లపై మాత్రం చంద్రబాబు ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదు. బ్లాక్ స్పాట్లే వాహనదారుల ప్రాణాలకు స్పాట్‌పెడుతున్నాయని పోలీసు శాఖ ఇటీవల సమర్పించిన నివేదిక స్పష్టం చేసింది. ఆ నివేదికలోని ప్రధాన అంశాలు..
787 బ్లాక్ స్పాట్లు
రాష్ట్రంలో రహదారులపై అత్యధికంగా ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్లు 787 ఉన్నాయి. రోడ్ల నిర్మాణంలో డిజైన్ లోపం, ప్రమాదకర మలుపులు, రోడ్లు నిర్వహణ లోపం, గుంతలమయంగా ఉండటంతో ఆ ప్రదేశాల్లో తరచూ రోడ్లు ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
అత్యధికంగా బ్లాక్ స్పాట్లు ఉన్న జిల్లాల్లో తిరుపతి (100), ఎన్టీఆర్ (76), కృష్ణా (56), కాకినాడ (43), విశాఖ(40) జిల్లాలు తొలి 5 స్థానాల్లో ఉన్నాయి. మొత్తం 787 బ్లాక్ స్పాట్లు రాష్ట్రంలో 76 పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉన్నాయి. వాటిలో 44 పోలీస్‌స్టేషన్లు ఏలూరు, విశాఖ, అన్నమయ్య, కాకినాడ, కృష్ణా, ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనే ఉండటం గమనార్హం.
ఏమిటీ బ్లాక్ స్పాట్?
భారతీయ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఏదైనా రహదారి 5 కి.మీ. పరిధిలో గడిచిన మూడేళ్లలో అత్యంత దారుణ ప్రమాదాలు 5 జరిగి దానిలో 10 మందికిపైగా మరణించినా లేదా తీవ్రంగా గాయపడినా దానిని ‘బ్లాక్‌స్పాట్’గా గుర్తిస్తారు.
వామ్మో! రోడ్డు ప్రమాదాలు
బ్లాక్ స్పాట్లపై ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ ఏడాది రాష్ట్రంలో రోడ్లు ప్రమాదాలు పెరిగాయి. ఈ ఏడాది నవంబర్ 30నాటికే ఏకంగా 18,837 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. వాటిలో ప్రాణాలను బలిగొన్న తీవ్రమైన ప్రమాదాలు 8,237 ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో 8,466 మంది దుర్మరణం చెందారు.
10,600 మంది తీవ్రంగా గాయపడ్డారు. గతేడాది కంటే మొత్తం రోడ్డు ప్రమాదాలు 2.2% పెరగగా... వాటిలో ప్రాణాలను బలిగొన్న తీవ్రమైన ప్రమాదాలు 4.6% పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో మృతులు 4.6% పెరగ్గా తీవ్రంగా గాయపడినవారి సంఖ్య 0.4% పెరిగింది.
» అత్యధికంగా 45% ద్విచక్ర వాహనాలే ప్రమాదానికి గురయ్యాయి.
» 44% ప్రమాదాలు జాతీయ రహదారులపై, 22% రాష్ట్ర రహదారులపై సంభవించాయి.
» జాతీయ, రాష్ట్ర రహదారులుకాని రోడ్లపై 34% ప్రమాదాలకు కేంద్రమయ్యాయి.
» మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యలోనే అత్యధికంగా 39% ప్రమాదాలు సంభవించాయి.
» తిరుపతి, విశాఖ, ఎన్టీఆర్, ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో కలిపి 29% రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగిన టాప్ 5 పోలీస్ స్టేషన్ల పరిధి
» నల్లపాడు (గుంటూరు జిల్లా)
» చంద్రగిరి (తిరుపతి జిల్లా)
» ఒంగోలు తాలుకా (ప్రకాశం జిల్లా)
» దేవరాపల్లి (తూర్పు గోదావరి జిల్లా)
» రాజానగరం (తూర్పు గోదావరి జిల్లా)


