సోషల్ మీడియా, కన్సల్టెంట్ల పేరుతో టీడీపీ వారికి పోస్టులు
ఖజానా నుంచి వేతనాల రూపంలో కోట్లాది రూపాయలు
తాజాగా ఏపీ డిజిటల్ మీడియా పేరుతో ఇద్దరు ప్రచార కన్సల్టెంట్లు
నెలకు ఒక్కొక్కరికి రూ.75 వేలు వేతనం
ఇప్పటికే మంత్రుల పేషీల్లో 44 మంది సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్
ఇప్పటికే బాబు ప్రచారానికి 85 మంది రెండేళ్లపాటు నియామకం
పీ–4 పేరుతో యువ నిపుణులంటూ 175 మంది టీడీపీ వారికి ఉపాధి
వారికి ఖజానా నుంచి నాలుగేళ్లలో రూ.50.40 కోట్లు చెల్లింపు
ఏపీ స్టేట్ ప్లానింగ్ సొసైటీలో 71 మంది కన్సల్టెంట్లు
సాక్షి, అమరావతి: ఓ నిరుపేద వృద్ధురాలికి పింఛను ఇవ్వడానికి చేతులు రావు.. ఓ వికలాంగుడికి పింఛను మంజూరు చేయడానికి మనసొప్పదు.. పేద విద్యార్థికి ఫీజు కట్టడానికి డబ్బులుండవు.. రైతుకు మేలు చేసే ఆలోచనే ఉండదు.. కానీ, తన ప్రచారం కోసం.. తన కుమారుడి రాజకీయ లబ్ధి కోసం ఉన్నవీ లేనివీ కల్పించి పొగడ్తలతో ముంచెత్తడం, ప్రత్యర్థులపై గోబెల్స్ ప్రచారం చేయడం కోసం నెలనెలా వేలాది రూపాయలు చెల్లిస్తూ పార్టీ వారికి రకరకాల పోస్టులు కట్టబెడుతున్నారు సీఎం చంద్రబాబు. సోషల్, డిజిటల్ మీడియా పేరుతో వందల మందిని నియమించారు. చేసే పని చంద్రబాబును, ఆయన కుమారుడిని కీర్తించి, ప్రత్యర్థులపై రాళ్లేయడమే అయినా, వారికి చెల్లించేదంతా ఖజానా నుంచే. అంటే ప్రజాధనమే.
ఇక కన్సల్టెంట్ల పేరుతో తన వారిని ఇబ్బడిముబ్బడిగా నియమించేస్తూ వారికీ ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు. సోషల్ మీడియా, యువ నిపుణులు, కన్సల్టెంట్ల పేరుతో చంద్రబాబు తన పార్టీకి చెందిన వారికి ఖజానా నుంచి భారీ వేతనాలతో పోస్టులు కట్టబెడుతున్నారు. నెల నెలా రూ.కోట్లలో చెల్లింపులు చేస్తున్నారు. గత ఏడాది కాలంలో ఇలా వందల మందిని నియమించారు. తాజాగా సోషల్ మీడియా పేరుతో ఇద్దరు ప్రచార కన్సల్టెంట్ల నియామకానికి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ దరఖాస్తులను ఆహ్వానించింది. కాంట్రాక్టు విధానంలో నియామకానికి ఈ నెల 29వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. నెలకు రూ.75 వేల చొప్పున వేతనాలు చెల్లించనున్నట్లు ప్రకటించారు.
ఇప్పటికే మంత్రుల పేషీల్లో 24 సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్, 24 సోషల్ మీడియా అసిస్టెంట్లు.. మొత్తం 48 పోస్టులను సృష్టించి, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేశారు. తొలుత ఏడాది పాటు అంటూ ఆదేశాలు జారీ చేసి, ఇటీవల మంత్రులు ఎంతవరకు ఉంటే అంతవరకు వీరు కొనసాగుతారని చంద్రబాబు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు ప్రచారం కోసం ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌లో భారీ వేతనాలతో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో 85 మందిని నియమించారు. తాజాగా వారిని మరో రెండేళ్ల పాటు కొనసాగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీరిలో 58 మందిని ఔట్‌సోర్సింగ్ విధానంలో నియమించారు.
వీరిలో సోషల్ మీడియా ప్రత్యేక ఆఫీసర్‌కు నెలకు రూ.1.20 లక్షలు, 12 మంది కంటెంట్ డెవలపర్స్‌కు నెలకు రూ.75 వేల చొప్పున, 30 మంది సోషల్ మీడియా ఎనలిస్ట్‌లకు నెలకు రూ.30 వేల చొప్పున, 15 మంది డిజిటల్ ప్రచారకులకు నెలకు రూ, 25 వేల చొప్పున వేతనాలు చెల్లిస్తున్నారు. కాంట్రాక్టు విధానంలో నియమితులైన మరో 27 మందిలో డిజిటల్ డైరెక్టర్‌కు నెలకు రూ.1.75 లక్షల వేతనం చెల్లిస్తారు. క్రియేటివ్ కన్సల్టెంట్‌కు నెలకు రూ.1 లక్ష చొప్పున, మిగతా వారికి నెలకు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. ప్రచార కార్యక్రమానికి ఇప్పటికే డిజిటల్ కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు కేటాయించారు. ఇందులో ఇప్పటికే రూ. 74 కోట్లు ఖర్చు చేసేశారు.
మరోపక్క పీ–4 పేరుతో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున యువ నిపుణులంటూ 175 మంది టీడీపీ వారికి ఖజానా నుంచి భారీగా డబ్బు ముట్టజెపుతున్నారు. వీరికి ఏడాదికి రూ.12.60 కోట్లు చొప్పున నాలుగేళ్ల పాటు రూ.50.40 కోట్లు ప్రజాధనం చెల్లిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం జీవోలు కూడా జారీ చేసింది. ఏపీ స్టేట్ ప్లానింగ్ సొసైటీలో 71 మంది కన్సల్టెంట్లకు లక్షల్లో వేతనాలు ఇస్తూ నియమించారు. అలాగే రాష్ట్ర ఆదాయం పెంచే పేరుతో 11 మంది కన్సల్టెంట్లను నియమించి, రూ.3.28 కోట్లు చెల్లిస్తున్నారు. ఆర్థిక అభివృద్ధి బోర్డులో ఆరుగురు కన్సల్టెంట్లను రూ.3.66 కోట్లతో నియమించారు. మంత్రుల పేషీల్లో, డిజిటల్ కార్పొరేషన్‌లో, మిగతా చోట్ల నియమితులైన వారంతా టీడీపీకి చెందిన వారే. టీడీపీ ప్రచార దళమే.


