
అనంతపురం జిల్లా: తాడిపత్రి టీడీపీ నేత, మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై జేసీ నోరు పారేసుకున్నారు. ‘‘తుపాకులు నీ వద్దే కాదు.. నా వద్ద కూడా ఉన్నాయి. రేయ్ ఏఎస్పీ.. నీ అంతు చూస్తా.. నీకు బుద్ధి, జ్ఞానం లేవు. ఏఎస్పీ రంజిత్ ఓ పనికిమాలిన వాడు.. వేస్ట్ ఫేలో.. గొడవలు జరిగితే ఇంట్లో దాక్కుంటాడు’’ అంటూ పోలీసుల అమరవీరుల సంస్మరణ సభలో జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయారు.
కాగా, అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి రెండు రోజుల క్రితం కూడా వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. పట్టపగలు అందరూ చూస్తుండగా.. వైఎస్సార్‌సీపీ నాయకుడిపై తన అనుచరులతో దాడి చేయించి తీవ్రంగా గాయపరిచారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు యర్రగుంటపల్లి నాగేశ్వరరెడ్డి ఆదివారం తాడిపత్రిలోని ఆనంద్ భవన్ హోటల్ వద్ద టీ తాగుతుండగా.. వాహనంలో అటుగా వెళ్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి చూశారు.
ఆ వెంటనే ‘వీణ్ని ఎందుకురా ఇంత వరకు వదిలేశారు’ అంటూ అనుచరులను రెచ్చగొట్టారు. దీంతో రవీంద్రారెడ్డి, యాసిన్, బద్రీ, విష్ణు, శేఖర్‌తో పాటు సుమారు పది మంది జేసీ అనుచరులు ఇనుప రాడ్లతో నాగేశ్వరరెడ్డిపైకి దూసుకెళ్లారు. వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన నాగేశ్వరరెడ్డిని.. రోడ్డుపై వెంబడిస్తూ దాడి చేశారు. సమీపంలో వైఎస్సార్‌సీపీ నాయకురాలు పేరం స్వర్ణలత ఇల్లు కనిపించడంతో.. నాగేశ్వరరెడ్డి అందులోకి పరుగెత్తుకెళ్లి తలదాచుకున్నాడు. జేసీ అనుచరులు అక్కడి నుంచి వెళ్లిపోగానే.. పేరం అమరనాథ్‌రెడ్డి స్థానికులతో కలిసి బాధితుడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.
