
మ్యూచువల్ ఫండ్స్ ట్రస్టీలకు సెబీ చీఫ్ ఆదేశాలు
ముంబై: ముందుగా హెచ్చరించే వ్యవస్థలను మరింత పటిష్టపరచవలసిందిగా మ్యూచువల్ ఫండ్స్ ట్రస్టీలను తుహిన్ కాంతా పాండే ఆదేశించారు. వీటిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా అవకతవకలను ముందుగానే గుర్తించడం, సమయానుగుణ చర్యలు, ఇన్వెస్టర్ల పరిరక్షణకు వీలుంటుందని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ పాండే పేర్కొన్నారు. సెబీ సంస్కరణల అమలులో నిర్లిప్తతను ప్రదర్శించకుండా ఇన్వెస్టర్ల పరిరక్షణకు క్రియాశీలంగా వ్యవహరించాలని కోరారు.
అవసరమైతే ట్రస్టీలు ప్రశ్నించడం, కలుగజేసుకోవడంవంటివి చేపట్టాలని సూచించారు. ఇన్వెస్టర్ల విశ్వాసానికి ట్రస్టీలు వెన్నెముకలాంటి వారు అని వ్యాఖ్యానించారు. డెరివేటివ్స్, ఈఎస్‌జీ ఇన్వెస్టింగ్, ప్రత్యామ్నాయ ఆస్తులు, రిస్క్ అనలిటిక్స్ తదితర వర్ధమాన అంశాలలో ట్రస్టీలు అప్‌డేటెడ్‌గా ఉండాలని సలహా ఇచ్చారు. ఇందుకు ప్రత్యేక శిక్షణ, నిరంతర కృషి అవసరముంటుందని, దీంతో ప్రభావవంతంగా పనిచేసేందుకు వీలుంటుందని వివరించారు. గత దశాబ్ద కాలంలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ వేగవంత వృద్దిని అందుకోగా.. నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) ఆరురెట్లు జంప్‌చేసిందని తెలియజేశారు.
దీంతో ఏయూఎం రూ. 12 లక్షల కోట్ల నుంచి 2025 సెప్టెంబర్‌కల్లా రూ. 75.6 లక్షల కోట్లకు ఎగసినట్లు వెల్లడించారు. ఫండ్స్ ఇన్వెస్టర్ల సంఖ్య సైతం కోటి నుంచి 5.6 కోట్లకు బలపడినట్లు తెలియజేశారు. క్రమానుగత పెట్టుబడి పథకాలు(సిప్)కు నెలవారీగా పెట్టుబడులు సగటున రూ. 28,000 కోట్లు చొప్పున లభిస్తున్నట్లు పేర్కొన్నారు. 2016 ఏప్రిల్‌లో నెలవారీ సిప్ పెట్టుబడులు రూ. 3,000 కోట్లు మాత్రమేనని ప్రస్తావించారు. ఇది రిటైల్ ఇన్వెస్టర్లకు ఫండ్ పరిశ్రమపై పెరుగుతున్న నమ్మకానికితోడు.. పెట్టుబడులతో మరింతమంది ముందుకు వస్తున్నట్లు తెలియజేశారు.