స్టాక్ ఎక్స్‌చేంజీలనిర్వహణ సామర్థ్యాలను, ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణను, మార్కెట్ పర్యవేక్షణనను మెరుగుపర్చేందుకు ఉపయోగపడే కొత్త సాంకేతికతలను పరిశీలించేందుకు వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. వచ్చే 5–10 ఏళ్లలో ఎక్స్‌చేంజ్ టెక్నాలజీ ఏ విధంగా రూపాంతరం చెందాలి, అంతర్జాతీయ ఉత్తమ ప్రమాణాలను అందుకోవాలి, మార్కెట్ మౌలిక సదుపాయాలను పటిష్టం చేసేందుకు కొత్త విధానాలను రూపొందించాలి తదితర అంశాలపై ఈ కమిటీ దృష్టి పెడుతుందని ఆయన చెప్పారు.
కమోడిటీ, క్యాపిటల్ పార్టిసిపెంట్స్ అసోసియేషన్ 11వ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న సందర్భంగా పాండే ఈ విషయాలు వివరించారు తుహిన్ కాంత పాండే. టెక్నాలజీపరంగా పటిష్టంగా ఉండటం ఎంతో ముఖ్యమని, ఎక్స్‌చేంజీల్లో చోటు చేసుకునే ప్రతి సాంకేతిక లోపాన్ని సెబీ చాలా సీరియస్‌గా తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. అటు నాన్–అగ్రి కమోడిటీ డెరివేటివ్స్‌ను సమీక్షించేందుకు కూడా వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పాండే చెప్పారు. త్వరలోనే దీన్ని నోటిఫై చేస్తామని తెలిపారు.


