
బంగారం ధరలు పెరగడానికి లేదా తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇందులో ద్రవ్యోల్బణం, జీడీపీ, అంతర్జాతీయ పరిణామాలు (భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు) ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాలో జరిగే అనేక అంశాలు గోల్డ్ రేట్లను ప్రభావితం చేస్తాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు, డాలర్ విలువ, డొనాల్డ్ ట్రంప్ సుంకాల కారణంగా పసిడి ధరలు మారుతూ ఉంటాయి. కాగా ఇప్పుడు బంగారం ధరలలో కీలక మార్పుకు కారణమయ్యే ఒక ప్రకటన వచ్చింది.
నిజానికి ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే.. యూఎస్ డాలర్ డిమాండ్ పెరుగుతుంది. డాలర్ వాల్యూ పెరిగితే.. బంగారం కొనుగోలు చేసేవారి సంఖ్య కొంత తగ్గుతుంది. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గితే.. డాలర్ విలువ తగ్గి, బంగారానికి డిమాండ్ పెరుగుతుంది.
కొంత కాలంగా.. ఫెడ్ వడ్డీ రేట్లను స్థిరంగానే ఉంచుతున్నారు. దీంతో బంగారం ధరల్లో ఊహించని మార్పు కనిపించలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించాలని సూచించారు. కానీ ట్రంప్ విధిస్తున్న సుంకాలు.. భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తాయో తెలియడం లేదు. ఈ కారణంగానే ఫెడ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే సెప్టెంబర్‌లో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని చెబుతున్నారు.
వచ్చే నెలలో జరగనున్న అమెరికా సెంట్రల్ బ్యాంక్ సమావేశంలో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ 'జెరోమ్ పావెల్' వడ్డీ రేటు తగ్గింపుకు అవకాశం ఉందని సంకేతాలిచ్చారు. ఇది ఉద్యోగ మార్కెట్‌కు నష్టాలు తెస్తుందని, ద్రవ్యోల్బణం ముప్పు కూడా ఉండదని పేర్కొన్నారు. అయినప్పటికీ వడ్డీ రేట్లను తగ్గించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. దీంతో డాలర్ విలువ ఒక్కసారిగా పతనమైంది. దీంతో బంగారం ధరలు ఊహించినట్లుగానే పెరిగాయి. ఫెడ్ సమావేశం సెప్టెంబర్ 16, 17న జరగనుంది.
ఇదీ చదవండి: పండుగ సీజన్.. అమెజాన్‌లో 1.5 లక్షల ఉద్యోగాలు
ఇక భారతదేశంలో కూడా బంగారం ధరలు ఊహకందని రీతిలో శనివారం (ఆగస్టు 23) గరిష్టంగా రూ. 1090 పెరిగింది. దీంతో 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 1,01,620 (10 గ్రా)కు చేరింది. 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 1000 పెరిగి రూ. 93150 (10 గ్రా)కు చేరింది. కేజీ వెండి ధర రూ. 1,30,000లకు చేరింది.