
నేడు ధనత్రయోదశి. సాధారణంగా ధన త్రయోదశి అనగానే బంగారం, వెండి, ఇతర గృహోపకరణాలు కొనడం అందరూ చేసేదే. అయితే ధనత్రయోదశి ప్రాశస్త్యాన్ని తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. ఆ కథ తెలుసుకుందాం.
దేవతలు, దానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలుకుతున్న సమయంలో ఆ క్షీరసాగరం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది. అంతే కాదు సంపదలను ప్రసాదించే కల్పవృక్షం, కామధేనువు, దేవవైద్యుడు ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు. ఆ రోజు ఆశ్వయుజ బహుళ త్రయోదశి. శ్రీమహాలక్ష్మి ధనానికి ప్రతిరూపం. అందుకే, ఆమె జన్మదినమైన ఈ ఆశ్వయుజ కృష్ణ త్రయోదశిని.. ‘ధన త్రయోదశి’ అన్నారు.
ఎంత చదువు చదివినా.,, ఎన్ని తెలివితేటలు ఉన్నా., శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేక΄ోతే జీవితం గడపడం కష్టం. అందుకే.. సర్వ సంపత్‌ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వ మానవాళి ఈ రోజున శ్రీమహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి, ఆమె ఆశీస్సులు అందుకుంటారు. ధనానికి అధిదేవత ‘శ్రీమహాలక్ష్మి. ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన ‘కుబేరుడు’. అందుకే ఈ ధనత్రయోదశి నాడు శ్రీమహాలక్ష్మితో΄ాటు కుబేరుని కూడా ఆరాధిస్తారు. సాధారణంగా ఈ లక్ష్మీ పూజను సాయం సమయంలో ప్రదోష వేళలో చేసుకుంటే చాలా మంచిది.
లక్ష్మీ కుబేర వ్రతం
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు, వ్యాపార అభివృద్ధి అదే విధంగా నూతన వ్యాపారం ప్రారంభించబోయే వారు, ఉద్యోగ అభివృద్ధి కోరుకుంటున్నవారు, అప్పుల బాధలు ఉన్నవారు లక్ష్మీ కుబేర వ్రతాన్ని చేసుకోవడం వల్ల ఆయా బాధల నుంచి విముక్తి పొంది, అన్నింటా అభివృద్ధి జరుగుతుందని పెద్దలు చెబుతారు కాబట్టి ఈ వ్రతాన్ని చేయాలనుకుంటున్న వారు అక్షయ తృతీయ రోజు, ధన త్రయోదశి రోజు, కార్తీక శుక్ల పంచమి రోజు లేదా తొమ్మిది గురువారాలు లేక శుక్రవారాలు చేసుకోవచ్చు.
చదవండి : Diwali 2025 : ఈవస్తువులను ఇంటికి తెచ్చుకుంటే కనక వర్షం
ధన్వంతరి జయంతి
దేవవైద్యుడు, సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అంశావతారమైన ధన్వంతరి పాలసముద్రం నుంచి ఆవిర్భవించింది కూడా ధనత్రయోదశి నాడే. అందుకే ఈ పర్వదినాన చాలామంది ధన్వంతరిని కూడా పూజిస్తారు. ముఖ్యంగా ఆరోగ్యం బాగలేనివారు, ఆయుర్వేద వైద్య విధానం మీద నమ్మకం ఉన్న వారు శ్రీమహావిష్ణువు ప్రతిరూపమైన ధన్వంతరిని పూజించడం వల్ల ఆరోగ్యవంతు లవుతారని చెబుతారు. ధన్వంతరి చేతిలో శంఖు చక్రాలతోపాటు ఔషధ భాండం లేదా అమృత కలశం, జలగ ఉంటాయి. జలగ శరీరంలో చేరిన చెడు రక్తాన్ని పీల్చివేసి ఆరోగ్యాన్నిస్తుందని ప్రతీతి. అందుకే ధన్వంతరి చేతిలో జలూకం అంటే జలగ ఉంటుంది.
నేడు శని త్రయోదశి కూడా. ధనత్రయోదశి నాడే శని త్రయోదశి కూడా రావడం చాలా విశేషం. అందువల్ల ఈ వేళపాత వస్తువులు, పాత ఆలోచనలు, పాతదనాన్ని వదిలించుకుని, కొత్త వస్తువులు కొనుగోలు చేయటం, కొత్త ఆలోచనలు చేయటం, కొత్త పనులకు శ్రీకారం చుట్టడం చాలా మంచిది.
ఇదీ చదవండి: వెయిట్ లాస్‌లో ఈ మూడింటిని నమ్మకండి : రణబీర్ ఫిట్నెస్ కోచ్ వార్నింగ్
పితృదేవతాపూజకు కూడా ధనత్రయోదశి చాలా ప్రశస్తమైనది. ధనత్రయోదశి నాడు ఇంటిలో దీపాలు వెలిగించి, మన పెద్దవారిని తలచుకోవడం వల్ల వారి ఆశీర్వాదంతో శుభం చేకూరుతుందని పండితులు చెబుతారు. ఈ శుభవేళ అందరికీ కీడు తొలగి మేలు చేకూరాలని కాంక్షిద్దాం.
– డీవీఆర్