
ఆర్ట్ అండ్ కల్చర్
బొమ్మలు మాట్లాడవు.తమ గురించి మాట్లాడేలా చేస్తాయి.అలా మాట్లాడాలంటే ఆర్టిస్ట్‌లో అద్భుత సృజన ఉండాలి. అలాంటి ఒక ఆర్టిస్ట్ ఆమదాలవలసకు చెందిన ప్రియాంక.శుభకార్యాలకు తగ్గట్టు రకరకాల థీమ్స్‌తో బొమ్మల సిరీస్ రూపొందిస్తూ పాతకళకు కొత్త కళ తీసుకువస్తోంది ప్రియాంక...
‘చిన్నప్పుడు ఆడుకున్న ఆటల్లో బొమ్మలే నా బతుకు బండిని నడిపిస్తాయని నేను అసలు ఊహించనే లేదు’ అంటుంది ప్రియాంక. బొమ్మల ద్వారా నేటి తరానికి సంప్రదాయ విలువలను వివరించడంలో ఆనందం ఉందంటారు ఆమె. తన మనసులో మెదిలిన ఊహకు సృజనాత్మకంగా ప్రాణం పోస్తూ, బొమ్మలను థీమ్‌కు తగ్గట్టు రూపొందిస్తూ వినియోగదారుల మనసు గెలుచుకుంటుంది ప్రియాంక. ఆ బొమ్మలు సనాతన సంప్రదాయాలకు ప్రతీకలుగా కనిపిస్తాయి. కనుమరుగ వుతున్న కళలు కళ్లముందు కనబడతాయి.
అనుబంధాల రైలుబండి
కాంక్రీట్ జంగిల్‌లో న్యూక్లియిర్ ఫ్యామిలీల నడుమ దూరమవుతున్న అనుబంధాలు ప్రియాంక తయారుచేసే బొమ్మలతో గుర్తుకు వస్తాయి. ఆమదాలవలసకు చెందిన ఒక పెద్దాయన 60వ పుట్టిన రోజు వేడుకను భిన్నంగా చేయాలని కుటుంబ సభ్యులు ఆలోచించారు. ప్రియాంకకు విషయాన్ని వివరించారు. అరవై ఏళ్లలో జరిగిన ఘట్టాలను అద్భుతమైన రీతిలో బొమ్మల రూపంలో కళ్లకు కట్టేలా తీర్చిదిద్దింది ప్రియాంక. అన్నప్రాసన వేడుక నుంచి పదవీ విరమణ వేడుక వరకు... ఆ పెద్దాయన జీవితంలోని వివిద దశలను చిన్న రైలుబండి మాదిరిగా బొమ్మల్లో తయారు చేసి శభాష్ అనిపించుకుందిజ
చదవండి: మొరింగా సాగుతో.. రూ. 40 లక్షల టర్నోవర్
తాళికట్టు శుభవేళ
పలాసకు చెందిన ఒక వ్యాపారి నూతన గృహ ప్రవేశ వేడుకను భిన్నంగా చేయాలనుకున్నాడు. కాన్సెప్ట్‌ను వివరించాడు. బిల్డింగ్ నమూనా నుంచి సత్యనారాయణ వ్రతం, గో మాత ప్రవేశంతో సహా అన్నింటిని చక్కని బొమ్మలతో కళ్లకు కట్టింది ప్రియాంక. శుభకార్యానికి వచ్చిన అతిథులంతా ఈ థీమ్‌ను చూసి భలే ముచ్చట పడ్డారు. శ్రీకాకుళం నగరంలోని ఒక కార్పొరేట్ బ్యాంక్‌లో నవరాత్రి పూజలు నిర్వహించాలని బ్యాంక్ సిబ్బంది భావించారు. రెండు రోజులు కష్టపడి నవరాత్రి వేడుకల థీమ్‌ను తయారు చేసి బ్యాంక్‌ను లక్ష్మీనిలయంగా మార్చింది ప్రియాంక. వివాహ వేడుకకు ప్రారంభ ఘట్టమైన గోధుమరాయి కార్యక్రమం నుంచి తాళికట్టు శుభవేళ వరకు తయారు చేసిన వెడ్డింగ్ సెట్ ప్రియాంక స్పెషల్. ఆ సెట్ చూస్తే మన కళ్లముందే పెళ్లి జరిగినంత సంబరం మన సొంతం అవుతుంది.
చదవండి: అంబానీ వంటింట్లో పెత్తనం పెద్ద కోడలిదా? చిన్నకోడలిదా?
ఇదే నా ప్రపంచం
చిన్నప్పుడే కాదు పెద్దయ్యాక కూడా బొమ్మలను వదల్లేదు. అమ్మ సాయంతో వాటిని చక్కగా అలంకరించడం చిన్నప్పటి నుంచి నా అలవాటు. డిగ్రీ పూర్తయింది. ఉపాధి కోసం ఏదో ఒకటి చేయాలి అనుకున్నాను. బొమ్మలతోనే కొత్తగా ఏదైనా చేయాలనుకున్నాను. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. నా ఆలోచనలను నాన్నతో పంచుకున్నాను. ఆయన ప్రోత్సహించారు. వర్క్‌షాపులో కొంత భాగం నన్ను వినియోగించుకోమన్నారు. ఆర్టిస్టిక్‌గా షోరూమ్‌ను సిద్ధం చేశారు. విభిన్న రకాల థీమ్‌లను సిద్ధం చేశాను. సోషల్ మీడియా వేదికగా నేను తయారుచేసిన బొమ్మలను, ఫొటోలను షేర్ చేయడం మొదలుపెట్టాను. ఆర్డర్లు పెరిగాయి. బొమ్మల ద్వారా సంప్రదాయాల్ని వివరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. – ప్రియాంక
– దువ్వూరి గోపాలరావు,సాక్షి, శ్రీకాకుళం
ఫొటోలు: జయశంకర్ కుప్పిల