హైదరాబాద్: ఎయిడ్స్ అనేది చాపకింద నీరులా విస్తరిస్తున్న ప్రమాదకరమన వ్యాధి. అయితే, తగిన అవగాహన ఉంటే దాన్ని నియంత్రించడం సాధ్యమవుతుందని డా. అనురాధ జాయింట్ డైరెక్టర్ తెలంగాణ సార్క్ (సైంటిఫిక్ అండ్ అప్లైడ్ రీసెర్చ్ సెంటర్) తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా సోమవారం కామినేని ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహనా నడక కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. పలువురు వైద్యులు, వైద్యవిద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది, సామాన్య ప్రజలు.. మొత్తం 300 మందితో అవగాహన నడక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో అందరూ ప్లకార్డులు పట్టుకుని, హెచ్ఐవీ/ఎయిడ్స్ గురించి అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
ఈ సందర్బంగా ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీకృష్ణ రాఘవేంద్ర మాట్లాడుతూ, ‘‘దేశంలో 24 లక్షల మందికి హెచ్ఐవీ ఉంది. తెలంగాణలో 1.4 లక్షల మందికి హెచ్ఐవీ ఉంది. వీరిలో సగం మంది పురుషులు, సగం మంది మహిళలు ఉన్నారు. చాలామంది పరీక్షలు చేయించుకోవడంతో పిల్లల్లో కూడా పాజిటివ్ కనపడుతోంది. ఇలాంటి కేసులు చాలావరకు తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తాయి.
ఏమాత్రం లక్షణాలు కనిపించినా, తరచు జ్వరం వస్తున్నా, ఆహారం తీసుకున్నా సరే నీరసంగా ఉంటున్నా వైద్యుల వద్దకు వెళ్లి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. హెచ్ఐవీ సోకిందన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. గుర్తించిన కేసులను ముందుగా ఐసీటీసీ సెంటర్లో రిజిస్టర్ చేయించుకోవాలి. ఎల్బీనగర్ పరిసర ప్రాంత వాసులకు సమీపంలో వనస్థలిపురంలో ఒక ఐసీటీసీ సెంటర్ ఉంది. పీపీపీ పద్ధతిలో ఏఆర్టీ సెంటర్ కామినేనిలో ఉంది. ఇది 2022లో స్థాపించారు. ఇది ఫంక్షనల్ ఐసీటీసీ సెంటర్. ఇందులో యాంటీ రెట్రోవైరల్ మందులను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేస్తారు. ఇక్కడ కాకుండా ఇంకా నగర పరిధిలో గాంధీ, ఉస్మానియా, చెస్ట్ ఆస్పత్రిలో కూడా ఉన్నాయి.
కామినేని ఎఫ్ఐసీటీసీలో ఇప్పటివరకు 1200 మంది రిజిస్టర్ అయి ఉన్నారు. దాదాపు రోజుకు 35-40 మంది వరకు వచ్చి ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న మందులు తీసుకుంటారు. నిజానికి రాష్ట్రంలోని ప్రతి వైద్య కళాశాలలో ఒక ఏఆర్టీ సెంటర్ ఉండాలి. అప్పుడు అందరికీ చికిత్స అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికి హైదరాబాద్లో పెద్దసంఖ్యలో రోగులను చూస్తూ, ఎప్పటికప్పుడు తగిన పరీక్షలు చేస్తూ, ప్రతినెలా ఫాలో అప్ చేసుకుంటూ, వారికి మందులు ఇస్తున్నది కామినేని పీపీపీ ఏఆర్టీ సెంటర్ మాత్రమే. ఇక్కడ కేవలం మందులు ఇవ్వడమే కాక.. మహిళలు, ట్రాన్స్జెండర్లు, ఇతరులకు అవగాహన తెప్పించి హెచ్ఐవీ రాకుండా జాగ్రత్తలు చెబుతున్నాం. నిపుణుల కన్సల్టేషన్ కావాలి’’ అని తెలిపారు.
సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ ఎం.స్వామి మాట్లాడుతూ, ‘‘హెచ్ఐవీ రోగుల విషయంలో ఇప్పటికీ మన సమాజంలో వివక్ష కొనసాగుతోంది. దీన్ని అరికట్టాలంటే విస్తృత ప్రచారం అవసరం. ఇంకా చెప్పాలంటే అసలు హెచ్ఐవీ రోగులను తాము చూడబోమని, చికిత్స అందించేది లేదనే వైద్యులూ కొంతమంది ఉన్నారు. అలా కాకుండా అందరూ అందరినీ చూడాలనే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది’’ అని చెప్పారు.
మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అంజయ్య కనుసాలి మాట్లాడుతూ, ‘‘హెచ్ఐవీ రకరకాలుగా వ్యాపిస్తుంది. అరక్షిత శృంగారం ద్వారాను, రక్తమార్పిడి చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోయినా.. ఇలా ఎలాగైనా సోకే అవకాశం ఉంటుంది. మనకు తెలిసినంత మేర జాగ్రత్తలు తీసుకుంటే దాని బారిన పడకుండా ఉండచ్చు. ఒకవేళ హెచ్ఐవీ సోకినట్లు పరీక్షల్లో తేలినా భయపడాల్సిన అవసరం లేదు. యాంటీ రెట్రోవైరల్ మందులను ప్రభుత్వం అందిస్తోంది. మా ఏఆర్టీ సెంటర్లో నమోదుచేసుకుని, ఎప్పటికప్పుడు ఆ మందులు తీసుకుంటే సరిపోతుంది’’ అని వివరించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో ఆర్గనైజింగ్ ఛైర్పర్సన్, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి, ప్రొఫెసర్ డాక్టర్ శ్యాంసుందర్, ప్రిన్సిపాల్ డా. సుధీర్ బాబు పడుగుల్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ జె.హరికృష్ణ, కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ ప్రదీప్ కుమార్ పటేల్, ఏఆర్టీ సెంటర్ సీఎంఓ డాక్టర్ పెద్ది రామకృష్ణ, ప్రొఫెసర్ డాక్టర్ పి. రత్నాచారి, డాక్టర్ ఐ. సురేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దాక్షాయని తదితరులు పాల్గొన్నారు.


