శ్రీకాకుళం క్రైమ్/ఎచ్చెర్ల: ట్రిపుల్ ఐటీ విద్యార్థి మరణంతో ఎచ్చెర్ల మండలంలోని ఎస్‌ఎంపురంలో ఉన్న ట్రిపుల్ ఐటీ కళాశాల ప్రాంగణంలో గురువారం తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సుమారు మూడు వేల మంది విద్యార్థుల ధర్నాలు, నినాదాలతో హోరెత్తింది. తోటి విద్యార్థి సృజన్ బుధవారం ఆత్మహత్య చేసుకోవడంతో ఇన్నాళ్లు వారిలో దాగి ఉన్న ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఓ మంచి విద్యార్థిని అన్యాయంగా చంపేశారనే భావన వారిని తీవ్రంగా కలచివేసింది. దీంతో కొన్నేళ్లుగా కళాశాలలో జూనియర్ విద్యార్థులపై సీనియర్లు చేస్తున్న ఆగడాలు బట్టబయలవ్వడమే కాక కళాశాలలో ఇన్నాళ్లు గుట్టుగా జరుగుతున్న అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఏమీ తెలియదట..
విద్యార్థి సృజన్‌ను రాత్రంగా సీనియర్లు కొట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నా.. మరుసటి రోజు ఉదయం సృజన్ ఆత్మహత్య చేసుకున్నా అంబులెన్సు వస్తే గానీ తనకు తెలియదని క్యాంపస్ డైరెక్టర్ చెప్పడం అక్కడి యాజమాన్య నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. గతంలోనూ ఆత్మహత్య ఘటనలు జరగడంతో పోలీసుల సాయంతో ఈ సారి కూడా గొడవను సద్దుమణిగేలా చేద్దామని యాజమాన్యం తీవ్రంగా ప్రయతి్నంచింది. కానీ విద్యార్థుల ఆగ్రహం, ఆందోళనల ముందు ఇటు పోలీసులు, అటు కళాశాల యాజమాన్యం తలొగ్గక తప్పలేదు. కుటుంబసభ్యులు, విద్యార్థులు ఆ రాత్రి కొట్టింది తొమ్మిది మంది అని చెప్పినప్పటికీ పోలీసులు ఎట్టకేలకు 8 మందిని అదుపులోకి తీసుకోవడంతో కాస్త శాంతించి వెనుదిరిగారు. బుధవారం రాత్రే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లాకేంద్రంలోని రిమ్స్ ప్రభుత్వాసుపత్రికి తరలించినా.. శుక్రవారం విద్యార్థులు, సృజన్ కుటుంబీకుల ఆందోళనలు సద్దుమణిగాకే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఉత్తర్వుల మేరకు ఘటనకు బాధ్యులైన ఎనిమిది మంది విద్యార్థులు వై.అమిత్, ఎస్‌కే అనీష్ అహ్మద్, బి.అభిష్క్, జె.చిన్నబాబు, షేక్ అజీల్, ఎస్‌కే మస్తాన్, ఎస్‌కే సమీర్, ఎ.భానుప్రకాష్‌లను సస్పెండ్ చేశారు.
తప్పుడు ప్రచారంపై మండిపాటు..
యాజమాన్యం పూర్తి నిర్లక్ష్య ధోరణి కనిపించడం.. మీడియా ముందు వాస్తవాలు చెప్పేందుకు కూడా ఆంక్షలు పెట్టడంతో విద్యార్థులు తట్టుకోలేకపోయారు. దీనికితోడు ‘సృజన్ బ్యాక్‌లాగ్స్ ఉంచేశాడు.. కళాశాలలో ఉన్న అమ్మాయితో చెడుగా ప్రవర్తించాడు.. అమ్మాయి సోదరుడు ఒక్కరే రెండు చెంపదెబ్బలు కొట్టాడు..’ వంటి తప్పుడు వదంతులు సృష్టించారంటూ మండిపడ్డారు.
ఉదయం నుంచే ధర్నా..
సృజన్ తల్లిదండ్రులు, కుటుంబీకులు గురువారం ఉదయం 6 గంటలకు వచ్చారు. పరిస్థితి అదుపు తప్పక ముందే డీఎస్పీ సీహెచ్ వివేకానంద, సీఐ ఎం.అవతారం, ఎస్‌ఐ వి.సందీప్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో విద్యార్థులు రెండు బృందాలుగా విడిపోయి ధర్నాకు దిగారు.
తమ బిడ్డను అన్యాయంగా చంపేశారని సృజన్ తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ లోగా కళాశాల యాజమాన్యం సమక్షంలో సృజన్ తల్లిదండ్రులతో డీస్పీ వివేకానంద, సీఐ అవతారంలు చర్చించారు. విద్యార్థుల ఆందోళనను విరమించేలా చొరవ తీసుకోవాలని కోరారు. అనంతరం పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకోవడం, సృజన్ తల్లిదండ్రులు సైతం విజ్ఞప్తి చేయడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
అవన్నీ అబద్ధాలే..
సృజన్ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. బ్యాక్‌లాగ్స్ ఉంచేశాడని, మంచివాడు కాడని, చదువు వల్ల చనిపోయాడన్నది నిజం కాదు. సీనియర్స్ దాడి చేశారన్నది నిజం. ముందు రోజు సృజన్‌పై దాడి ఎవరికీ తెలియదు. ఆత్మహత్య చేసుకున్నాక తప్పుగా పోలీసులకు వెళ్లింది. 11వ తేదీ రాత్రి 11 నుంచి 3 గంటల వరకు సీనియర్లు 9 మంది కొట్టి వేధించారు. తెల్లవారేసరికి అంతా పరీక్షలకు వెళ్లాం. సృజన్ రాలేదు. వచ్చేసరికి ఆత్మహత్య చేసుకున్నాడు. సృజన్ జూనియర్ విద్యారి్థనిని చెల్లి అని పిలుస్తాడు. అదే భావంతో ఉంటాడు. నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యారి్థని కజిన్‌కు ఈ విషయం నచ్చేది కాది. సృజన్‌ను హెచ్చరించాడు కూడా. అయినప్పటికీ సృజన్ చనిపోయే ముందు అమ్మాయి పిలిచి మాట్లాడటం వేరే వాళ్ల ద్వారా వారికి తెలిసింది. అందుకే ఇలా జరిగింది.
– సృజన్ క్లాస్‌మేట్స్
ఏం ప్రయోజనం..
ఎంతమంది ధర్నాలు చేస్తే ఏంటి.? ఎంతమంది పోలీసులు వస్తే ఏంటి..? చెట్టంత కొడుకుపోయాడు.
– జ్యోతి, సృజన్ తల్లి
చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారు..
మా మేనల్లుడు సృజన్ కుర్చీ వేసుకుని ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడన్నారు. అది నిజం కాదు. వాడి ఎత్తు 5.9 అడుగులు. ఫ్యాన్ కూడా అందేస్తుంది. రాత్రి 11 నుంచి 3 వరకు హింసించి, కొట్టి చంపేశారు. అలా తెచ్చి ఫ్యాన్‌కు ఉరేసినట్లు కట్టారు.
– చుక్కా శంకరరావు, మేనమామ
కొట్టి చంపేశారు...
నేను ఆటోడ్రైవర్‌ను. ఇంటర్ నుంచి ఇదే కళాశాలలో సృజన్‌ను చదివిస్తున్నాను. కుమారుడిని అన్యాయంగా కొట్టి చంపేశారు. కొట్టినవారిలో ఐదారుసార్లు డిబార్ అయినవారు కూడా ఉన్నారు. మీ సృజన్ అటువంటి వాడు కాదని, కావాలనే చెడు వ్యక్తిగా చిత్రీకరించారని 2వేల మందికి పైగా విద్యార్థులు అంటున్నారంటే మావాడు ఏమీ తప్పు చేయలేదని గ్రహించాలి. పోలీసులు న్యాయం చేయాలి.
– శివకృష్ణ ప్రసాద్, సృజన్ తండ్రి


