
నయా వంచనడిజిటల్ మోసాలు
స్టే స్మార్ట్
స్టే సేఫ్
పండగ కదా.... ఆన్‌లైన్ షాపింగ్ ప్రయత్నాలలో ఉన్నప్పుడు ‘ఫ్రీ దీ పావళి గిఫ్ట్’ అంటూ పాపప్ కనిపించవచ్చు. ‘ఈ ప్రశ్నలకు జవాబు చెప్పి దీపావళి బహుమతులు గెలుచుకోవచ్చు’ అనే ప్రకటన మెరుపులా మెరియవచ్చు.
దీపావళిని పురస్కరించుకొని దుస్తుల నుంచి వస్తువుల వరకు ఆన్‌లైన్ షాపింగ్ ఊపందుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ మోసగాళ్లకు చేతినిండా పనే!
పండగ రోజుల్లో ఆన్‌లైన్ స్కామ్‌లు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. నకిలీ ఈ–మెయిల్స్, టెక్ట్స్, కాల్స్ ద్వారా స్కామ్‌లు జరుగుతుంటాయి. ఈ పండగ సీజన్‌లో మోస్ట్ కామన్ స్కామ్... నకిలీ ఆర్డర్ లేదా అకౌంట్. మీ అకౌంట్ తాత్కాలికంగా నిలిపివేయబడిందని, ఆర్డర్‌కు పేమెంట్ వెరిఫికేషన్ అవసరమని పేర్కొంటూ హానికరమైన లింక్‌లను క్లిక్ చేసేలా, వ్యక్తిగత వివరాలు షేర్ చేసే విధంగా కస్టమర్‌లను ప్రేరేపిస్తారు.
‘గత సంవత్సరం 55,000 ఫిషింగ్ వెబ్‌సైట్‌లను, 12,000 స్కామ్ ఫోన్ నంబర్లను బ్లాక్ చేశాం. పండగ సీజన్ ముందు ఆన్‌లైన్ స్కామ్‌లపై వినియోగదారులకు అవగాహన కలిగించడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్‌తో కలి పనిచేశాం’ అన్నారు అమెజాన్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ (లీగల్) రాకేష్ బక్షీ.
‘స్కామర్‌లు నకిలీ షాపింగ్ వెబ్‌సైట్‌లను లేదా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లాంటి ప్రసిద్ధ బ్రాండ్‌లను అనుసరించి ఆన్‌లైన్ ప్రకటనలను సృష్టిస్తారు. నమ్మశక్యం కాని డిస్కౌంట్‌లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. పరిమిత కాల ఆఫర్‌లతో కస్టమర్‌లను ఆకర్షిస్తారు. ఒక కస్టమర్ ఆర్డర్ చేసి చెల్లింపు చేసిన తర్వాత నకీలి ప్రాడక్ట్స్ అందుతాయి. అసలు ఏమీ అందకపోవచ్చు కూడా. నకిలీ వెబ్‌సైట్‌లు తరచుగా అధికారిక బ్రాండ్ లోగోలు, ప్రాడక్ట్ ఇమేజ్‌లను, చట్టబద్దమైన సైట్‌లను తలపించేలా
పాలిష్ చేసిన డిజైన్‌లను ఉపయోగిస్తాయి. కొందరు నిజమైన వెబ్‌సైట్‌ల లే అవుట్, డొమైన్ పేరును కూడా క్లోన్ చేస్తారు. తేడాను గుర్తించడం కష్టంగా ఉంటుంది’ అంటున్నారు సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ శుభంసింగ్.
చాలామంది స్కామర్‌లు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఫేక్ ‘గివ్ అవే’ పోటీలు లేదా లక్కీ డ్రాల గురించి పోస్ట్ చేస్తారు. మీ బ్యాంక్ వివరాలను షేర్ చేయమని లేదా క్లెయిమ్ యువర్ ప్రైజ్ లింక్‌పై క్లిక్ చేయమని అడగవచ్చు. వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని ఎప్పుడూ షేర్ చేయవద్దు.
అనుమానాస్పద ఎకౌంట్‌ల గురించి వెంటనే రిపోర్ట్ చేయండి. బ్లాక్ చేయండి. బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోండి.