
భారతీయులకు బంగారంపై మక్కువ కొంత ఎక్కువే. ఈ కారణంగానే పెళ్లిళ్లకు, పండుగలకు గోల్డ్ కొనేస్తూ ఉంటారు. దీంతో ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగదారులలో ఒకటిగా అవతరించింది. భారతీయ కుటుంబాలు సుమారు 24,000 టన్నుల బంగారాన్ని కలిగి ఉన్నట్లు అంచనా. ఇది ప్రపంచ కేంద్ర బ్యాంకుల మొత్తం బంగారం నిల్వల కంటే ఎక్కువ. అయితే ప్రస్తుతం ధరలు భారీగా పెరిగాయి?. రాబోయి దసరా, దీపావళి సమయంలో పసిడి కొనుగోళ్లు ఎలా ఉండబోతున్నాయనే విషయాన్ని నిపుణులు అంచనా వేశారు.
భారతదేశంలో పండుగ సీజన్ మొదలైంది. బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఒక గ్రామ్ 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 11,000 దాటింది. కాగా గత సంవత్సరం ఇదే సమయంలో.. బంగారం ధర రూ.7,500 మాత్రమే!. దీన్ని బట్టి చూస్తే 12 నెలల్లో పసిడి ధర ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
ధరలు పెరిగినా.. డిమాండ్ తగ్గదు!
మనదేశంలో మొదటిసారి 10 గ్రాముల బంగారం ధరలు లక్ష రూపాయలు దాటేసింది. ధర ఎంత పెరిగినా.. పండుగ సీజన్లో బంగారానికి డిమాండ్ పెరిగే సంకేతం ఉందని 'వరల్డ్ గోల్డ్ కౌన్సిల్' వెల్లడించింది. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలులోకి రానున్నాయి. ఇది ప్రజల బడ్జెట్‌లో కొంత మిగులును మిగిల్చే అవకాశం ఉంది. ఈ మిగులు బడ్జెట్ బంగారం కొనుగోలుకు దారితీసే అవకాశం ఉంది.
బంగారం ధరలు పెరగడానికి కారణాలు
బంగారం ధరలకు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్-ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, భౌగోళిక రాజకీయాలు కొంత అస్తవ్యస్తంగా మారడం వల్ల.. ప్రపంచ దేశాల్లో భయం, అనిశ్చితి ఏర్పడింది. దీంతో కేంద్ర బ్యాంకులు మరింత బంగారం కొనుగోలు చేయడం ఆరంభించాయి.
ఇదీ చదవండి: నేను ముందే ఊహించాను!.. బంగారం ధరలపై క్రిస్టోఫర్ వుడ్
ట్రంప్ సుంకాలు ప్రకటించిన తరువాత బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు బంగారంపై ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో గోల్డ్ కొనుగోలుచేసేవారి సంఖ్య కూడా పెరిగింది. ఓ వైపు శ్రావణమాసం.. మరోవైపు వస్తున్న పండుగ సీజన్. ఇవన్నీ కూడా బంగారం ధరలను మరింత పెంచేసాయి.