కిలో వెండి రూ. 2,14,500
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా దేశీయంగా పుత్తడి, వెండి రేట్లు కొత్త రికార్డు స్థాయిలకు దూసుకెళ్తున్నాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం సోమవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,685 మేర పెరిగింది. రూ. 1,38,200కి ఎగిసింది. అటు వెండి ధర కూడా కిలోకి రూ. 10,400 మేర పెరిగి మరో కొత్త ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ. 2,14,500కి చేరింది.
అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతుండటం, అక్కడి ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు మరింతగా పసిడి, వెండివైపు మళ్లుతున్నారని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) సౌమిల్ గాంధీ తెలిపారు.
భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు కూడా ఇందుకు కారణమని పేర్కొన్నారు. ఇటు పరిశ్రమల నుంచి అటు ఇన్వెస్ట్‌మెంట్ కోణం నుంచి డిమాండ్ నెలకొనడంతో వెండి రేట్లు పరుగులు తీస్తున్నట్లు కోటక్ మ్యూచువల్ ఫండ్‌కి చెందిన ఫండ్ మేనేజర్ సతీష్ దొండపాటి చెప్పారు. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో పుత్తడి ధర ఔన్సుకి (31.1 గ్రాములు) ఒక దశలో 80.85 డాలర్లు పెరిగి 4,420.35 డాలర్లకు ఎగిసింది. వెండి సైతం 2.31 డాలర్లు పెరిగి ఔన్సుకి 69.45 డాలర్లు తాకింది.


