దేశంలో 1 శాతం మంది దగ్గరే 40 శాతం సంపద
దిగువనున్న 50 శాతం మంది ఆదాయం 15 శాతమే
ప్రపంచంలో 0.001 శాతం మంది దగ్గర భారీ సంపద
ఆర్థిక అసమానతలపై ‘వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్–2026’
భారతీయులలో 1 శాతం మంది దగ్గరే.. దేశంలోని మొత్తం సంపదలో దాదాపు 40 శాతం పోగుపడి ఉందని ‘వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్’ తాజాగా వెల్లడించింది. భారతదేశంలో ఆదాయ అసమానత.. ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని పేర్కొంది. – సాక్షి, స్పెషల్ డెస్క్
దిగువ సగం అంతంత మాత్రమే
దేశంలో అత్యధిక సంపన్నులైన 10 శాతం మంది.. మొత్తం దేశ సంపదలో 65 శాతం కలిగి ఉన్నారని నివేదిక తెలిపింది. అదే 10 శాతం మంది దగ్గర 58 శాతం జాతీయ ఆదాయం ఉందని, దిగువ 50 శాతం మంది 15 శాతం ఆదాయాన్ని మాత్రమే పొందుతున్నారని నివేదిక వివరించింది.
మహిళల కష్టానికి విలువే లేదు
నివేదిక ప్రకారం, దేశంలో మహిళా కార్మిక భాగస్వామ్యం చాలా తక్కువగా 15.7 మాత్రమే ఉంది. గత దశాబ్దకాలంగా ఇందులో ఎటువంటి మెరుగుదలా కనిపించలేదు. మొత్తం మీద భారతదేశంలో ఆదాయం, సంపద; స్త్రీ, పురుష కార్మిక భాగస్వామ్యాలలోని అసమానత లోతుగా వేళ్లూనుకుని పోయిందని నివేదిక వ్యాఖ్యానించింది.
పురుషులతో పోలిస్తే 32 శాతమే
ప్రపంచంలో మహిళలు.. పురుషులు ఒక గంటకు సంపాదిస్తున్న మొత్తంలో 32 శాతం వేతనాలు మాత్రమే (ఆర్థిక ప్రతిఫలం లేని ఇంటిపని, ఇతర సేవలకు కూడా లెక్కించి కలుపుకొంటే) పొందగలుగుతున్నారని నివేదిక లెక్కించింది. ఉద్యోగాలలో పురుషులతో సమానంగా పనిచేస్తున్న మహిళలకు.. పురుషులతో పోలిస్తే 62 శాతం మాత్రమే వేతనం లభిస్తోందని తెలిపింది.
అసమానతల్లో ‘ప్రపంచ ఐక్యత’
అసమానతల్లో ప్రపంచ దేశాలన్నీ ‘ఐక్యం’గా ఉన్నట్లు కనిపిస్తోందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచంలోని ఉన్నత ఆర్థిక వర్గాలలో ఒక చిన్న భాగం... ప్రపంచ జనాభాలో దిగువన ఉన్న సగం మంది కంటే మూడు రెట్లు ఎక్కువ సంపదను కలిగి ఉండటం అసమానతలకు స్ప ష్టమైన నిదర్శనం అని నివేదిక అభిప్రాయపడింది.

ప్రపంచంలో 0.001 శాతంగా ఉన్న ఇంచుమించు 60,000 మల్టీ మిలియనీర్లు సగటున దాదాపు 1.2 బిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉన్నారని నివేదిక తెలిపింది. 1995లో 4 శాతంగా ఉన్న వారి వాటా, నేడు 6 శాతాని కంటే ఎక్కువగా పెరి గిందని, ఇది ప్రపంచ అసమానతల విస్ఫోటం వంటిదని పేర్కొంది. ఈ ఆర్థిక అసమానతను తగ్గించడానికి ప్రభుత్వాలు ధనికులపై అత్యధికంగా ఆదాయ పన్నులను విధించి, తక్కువ ఆదాయం ఉన్నవారికి ప్రభుత్వ ప్రయోజనాలను చేకూర్చాలని నివేదిక సిఫారసు చేసింది.


