
బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అక్టోబర్ 17న తారాస్థాయికి పెరిగాయి. స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4,379 డాలర్లని తాకి, తరువాత 4,336 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, డిసెంబర్ యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1% పెరిగి 4,349 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి. ఈ పెరుగుదల గత ఐదేళ్లలో బంగారం సాధించిన అతిపెద్ద వారపు లాభంగా నమోదైంది. కేవలం ఈ ఒక్క వారంలోనే 8% పెరుగుదల నమోదైంది. ఇది 2020 మార్చి తర్వాత అతి పెద్ద వృద్ధి.
భారతదేశంలో కూడా బంగారం (gold price) ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,21700కి చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,32,770గా ఉంది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారాన్ని “సురక్షిత స్వర్గధామం”గా చూస్తున్నారు. బంగారం ఎక్కువగా కొనేస్తూ దాని మీదే ఎక్కువ పెట్టుబడి పెట్టేస్తున్నారు.
దిద్దుబాటు వస్తే..
అయితే, అందరూ ఈ పెరుగుదలపై సంబరాలు చేసుకుంటున్నారనే గమనించాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్ నిపుణుడు అక్షత్ శ్రీవాస్తవ కొన్ని కీలక హెచ్చరికలు జారీ చేశారు. "మీరు 100% బంగారంలో పెట్టుబడి పెట్టినవారైతే, ఇప్పుడు పరిస్థితి బాగున్నట్లే అనిపించొచ్చు. కానీ తిరిగి పెట్టుబడి పెట్టే సమయం వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది?" అంటూ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఓ పోస్ట్ పెట్టారు.
ఆయన పునఃపెట్టుబడి ప్రమాదం (Reinvestment Risk)పై దృష్టి సారిస్తున్నారు. బంగారంలో లాభాల ఆశతో చాలామంది దీన్ని కలవరిస్తూ ఉండొచ్చు కానీ మార్కెట్ దిద్దుబాటు (correction) వచ్చినప్పుడు, దీని ప్రభావం ఈక్విటీల కన్నా తీవ్రమై ఉండే అవకాశం ఉంది అంటున్నారు.
ఆస్తుల వైవిధ్యం అవసరం
శ్రీవాస్తవ సూచన ఏమిటంటే.. పెట్టుబడులు ఒకే ఆస్తిలో కాకుండా ఈక్విటీలు, క్రిప్టో, రియల్ ఎస్టేట్, బంగారం వంటి వివిధ ఆస్తుల్లో విభజించాలి. మరో ముఖ్యమైన అంశం.. బంగారంలో తిరుగులేని పెరుగుదల వల్ల, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ SIPల నుండి పెట్టుబడిదారులు నిధులను తీసివేయొచ్చు. ఇది దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. దీని ఫలితంగా ఉత్పాదక ఆర్థిక కార్యకలాపాలు మందగించవచ్చు.
బంగారంపై పెట్టుబడుల విషయంలో ప్రభుత్వ జోక్యం అవసరమని శ్రీవాస్తవ సూచిస్తున్నారు. బంగారంపై అధిక పన్నులు, లేదా ఈక్విటీ పెట్టుబడులకు పన్ను రాయితీలు వంటి మార్గాల ద్వారా సమతుల్యతను ఉంచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు.