
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సాంప్రదాయ 60/40 పెట్టుబడి వ్యూహాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యూహం ప్రకారం 60 శాతం డబ్బును ఈక్విటీల్లో (స్టాక్స్), 40 శాతం డబ్బును బాండ్లలో (స్థిర ఆదాయ పెట్టుబడులు) పెట్టాలి. దీర్ఘకాలిక, స్థిరమైన ఆదాయాన్ని కల్పించగలదని భావించి, ఈ వ్యూహాన్ని ఎన్నో దశాబ్దాలుగా ఆర్థిక ప్రణాళికదారులు ఒక "మ్యాజిక్ ఫార్ములా"గా వర్ణిస్తూ వచ్చారు.
అయితే, కియోసాకి అభిప్రాయం (Rich Dad Poor Dad author Robert Kiyosaki) ప్రకారం, ఈ 60/40 విధానం 1971లోనే పనికిరానిది అయిపోయింది. అంటే, అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ బంగార ప్రమాణం నుంచి డాలర్‌ను వదిలించాక ఇది అసంబద్ధం అయింది.
రాబర్ట్ కియోసాకి తన ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. "మొత్తానికి, ఫైనాన్షియల్ ప్లానర్ల మ్యాజిక్ మంత్రదండం – 60/40 చనిపోయింది" అంటూ పోస్ట్‌ను మొదలు పెట్టిన కియోసాకి "ఆ బీఎస్ నిష్పత్తి నిక్సన్ బంగారు ప్రమాణం నుంచి డాలర్‌ను తీసేసిన 1971లోనే చనిపోయింది. దాన్నుంచి ఇప్పటివరకు, ఆర్థిక ప్రణాళికదారులు దీన్ని పదవీ విరమణ భద్రత కోసం మేజిక్ కార్పెట్ రైడ్ లా ప్రచారం చేస్తూ వచ్చారు" అని రాసుకొచ్చారు.
అమెరికా ప్రభుత్వం ప్రపంచంలో అతిపెద్ద రుణగ్రహీత అని, అమెరికన్ డాలర్ ఒక “నకిలీ” కరెన్సీగా మారిందని కియోసాకి పేర్కొన్నారు. "యూఎస్ డాలర్ నకిలీ. ఇది మార్క్సిస్ట్ ఫెడ్ నియంత్రణలో ఉన్న, దివాలా తీసిన అమెరికన్ ప్రభుత్వ ఐఓయూ మాత్రమే. అలాంటి దేశం నుంచి బాండ్లు కొంటారా? ఆర్థిక భద్రత ఎక్కడుంది?" అంటూ ప్రశ్నించారు.
కొత్త ఫార్ములా..
మొత్తానికి వాస్తవం తెలిసొచ్చిందని, మోర్గాన్ స్టాన్లీ లాంటి సంస్థలు ఇప్పుడు మరో ప్రత్యామ్నాయ వ్యూహం 60/20/20 పోర్ట్‌ఫోలియోను ప్రోత్సహిస్తున్నాయని వివరించారు. ఈ వ్యూహం ప్రకారం.. 60 శాతం స్టాక్స్ లేదా ఇతర పెట్టుబడులు, 20 శాతం బాండ్లు, 20 శాతం బంగారం (లేదా ఇతర భద్రతా ఆస్తులు)పై పెట్టుబడి పెడతారు. ఇది పెట్టుబడిదారులకు పదవీ విరమణలో మరింత భద్రత కలిగిస్తుందని ఆయా సంస్థలు చెబుతున్నాయన్నారు.
నేను వీటికే ప్రాధాన్యమిస్తా..
ఎవరెన్ని చెప్పినప్పటికీ తాను ఎప్పటికీ నిజమైన ఆస్తులు అంటే, బంగారం, వెండి నాణేలు, బిట్‌కాయిన్, ఎథెరియం వంటి క్రిప్టో కరెన్సీలు, రుణంతో కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ నుంచి అద్దె ఆదాయం, చమురు బావులు, పశువులపై వచ్చే రాబడికే ప్రధాన్యత ఇస్తానన్నారు. ఇవన్నీ ఆదాయం అందించే "రియల్ అసెట్స్" అని చెబుతూ, వాటిలో పెట్టుబడి పెట్టాలని సూచించారు.
ఇదీ చదవండి: నా బంగారం.. ఇంకా పెరుగుతుందోచ్: ‘రిచ్ డాడ్’ రాబర్ట్
"నేను ఇప్పటికీ వీటినే ఇష్టపడతాను. నాకు ఇవే 30 సంవత్సరాల క్రితం ఆర్థిక స్వాతంత్ర్యం ఇచ్చాయి" అన్నారు. ఇంకో ముఖ్యమైన జీవన పాఠం కూడా ఆయన పంచుకున్నారు. "ఫైనాన్షియల్ ప్లానర్ల మ్యాజిక్ వాండ్ అయిన 60/40 ఫార్ములాని నేను ఎప్పుడూ ఉపయోగించలేదు. మీకు ఉత్తమంగా పనికొచ్చే పెట్టుబడి వ్యూహం ఏదో దాన్ని కనుక్కోండి" అంటూ సూచించారు.
FINALLY the BS “magic wand” of Financial Planner’s….the BS of 60/40 is dead.
FYI: 60/40 meant investors invest 60% in stocks and 40 % in bonds.
That BS ratio died in 1971 the year Nixon took the dollar off the gold standard.
For years, financial planners have touted the…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 9, 2025