
ధనత్రయోదశి, దీపావళి ఒకదాని తరువాత ఒకటి వస్తున్నాయి. చాలామంది ఈ సందర్భంగా బంగారం కొనుగోలు చేయడానికి ఎగబడతారు. గోల్డ్, సిల్వర్ రేట్లు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ప్రతి రోజూ కొత్త గరిష్టాలను చేరుకుంటున్న.. బంగారం, వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణాలేమిటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
శుక్రవారం బంగారం రేటు ఔన్సుకు 4,300 డాలర్ల కంటే ఎక్కువకు చేరి.. కొత్త గరిష్టాన్ని తాకింది. ఐదేళ్లల్లో ఈ ధరలు ఆల్‌టైమ్ రికార్డ్ అని తెలుస్తోంది. వెండి ధర ఔన్సుకు 54 డాలర్లు దాటి.. 1980 తరువాత జీవితకాల గరిష్టాలను చేరుకుంది. భారతదేశంలో.. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.31 లక్షలు దాటేసింది. వెండి రేటు ఏకంగా రూ. 2 లక్షలు దాటేసింది.
ధరలు పెరగడానికి కారణాలు
ప్రపంచ ఉద్రిక్తతల మధ్య సురక్షిత ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ చుట్టూ ఉన్న భయాలు, అమెరికా & చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య వివాదాలు.. ఆర్థిక వ్యవస్థలో ఒత్తిడి సంకేతాలు పెట్టుబడిదారులను బంగారం, వెండి వైపు నెట్టాయని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.
'బంగారం 4,300 డాలర్లు దాటడం మనం చూడటం ఇదే మొదటిసారి' అని ఒక వస్తువు వ్యాపారి పేర్కొన్నారు. ఆగస్టు నుంచి ఈ ర్యాలీ కొనసాగుతోందని అన్నారు. ఈ వారం వెండి పెరుగుదల కూడా భారీగానే ఉంది. ఔన్సు 54 డాలర్లు దాటేసింది. నాలుగు దశాబ్దాల తరువాత ధరలు కొత్త రికార్డులను చేరుకున్నాయని అన్నారు.
ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ యష్ సెడాని, పెరుగుతున్న ధరల గురించి స్పందిస్తూ.. బంగారంతో పోలిస్తే వెండి ధరలు మరింత వేగంగా పెరుగుతున్నాయని అన్నారు. దీనికి కారణం పారిశ్రామిక డిమాండ్ అని తెలుస్తోంది. బంగారంతో పోలిస్తే.. పారిశ్రామిక రంగంలో వెండి వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల డిమాండ్ మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య వివాదాలు, కొనసాగుతున్న సైనిక సంఘర్షణలు అనిశ్చితిని గణనీయంగా పెంచాయి. దీనివల్ల బ్యాంకులు & పెట్టుబడిదారులు బంగారం.. వెండిని సురక్షితమైన ఆస్తులుగా మార్చడానికి ప్రేరేపించబడ్డాయి. వడ్డీ రేటులో కదలికలు.. కేంద్ర బ్యాంకు చర్యలు కూడా ధరలను పెంచడంలో ప్రధాన పాత్ర పోషించాయి.

ఇదీ చదవండి: బంగారం కొనగలమా!.. రాకెట్‌లా దూసుకెళ్లిన రేటు
ధన్‌తేరాస్ & దీపావళి పండుగల సమయంలో బంగారం కొనుగోలును సంప్రదాయంగా భావించి.. ఎక్కువమంది గోల్డ్ కొంటారు. ఇది డిమాండును అమాంతం పెంచేస్తోంది. అయితే పండుగల తరువాత.. ధరలు కొంత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చూచిస్తున్నారు. అయితే దీపావళి నాటికి మరింత రేటు పెరిగే అవకాశం ఉందని కేడియా అడ్వైజరీ ఎండీ & డైరెక్టర్ అజయ్ కేడియా అన్నారు.