
బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. భారతదేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2024 సెప్టెంబర్‌లో దాదాపు రూ.73,200 వద్ద ఉండేది. అదే ఇప్పుడు (2025 సెప్టెంబర్) రూ.1,11,000కు చేరింది. అంటే రేటు సుమారు 54 శాతం పెరిగిందన్నమాట. గోల్డ్ ధరలు మాత్రమే కాకుండా.. గోల్డ్ ఈటిఎఫ్‌లు కూడా 50% వరకు రాబడిని అందించాయి. ఇది ఈటిఎఫ్‌లలో పెట్టుబడులను పెంచడానికి దోహదపడింది.
2025 ఆగస్టులో గోల్డ్ ఈటిఎఫ్‌లలో పెట్టుబడులు రూ.2,189.5 కోట్లు అని తెలుస్తోంది. ఏఎంఎఫ్ఐ ప్రకారం.. గోల్డ్ ఈటిఎఫ్‌లలో నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు రూ.72,495 కోట్లకు చేరుకున్నాయి. దీన్నిబట్టి చూస్తే గోల్డ్ ఈటిఎఫ్‌లలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని స్పష్టమవుతోంది.
గోల్డ్ ఈటీఎఫ్‌లు అంటే ఏమిటి?
గోల్డ్ ఈటీఎఫ్‌లు అనేవి.. గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. పెట్టుబడిదారులకు బంగారంపై పెట్టుబడి పెట్టడానికి అవకాశం కల్పించే మ్యూచువల్ ఫండ్ వంటిది అన్నమాట. పెట్టుబడిదారులు షేర్ల మాదిరిగానే డీమ్యాట్ ఖాతాల ద్వారా ఈటీఎఫ్ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు, తద్వారా వాటిని సులభంగా యాక్సెస్ చేయవచ్చు. వీటి విలువ బంగారం ధరలకు అనుగుణంగా మారుతూ ఉంటాయి.
పెట్టుబడిదారులు గోల్డ్ ఈటిఎఫ్‌లను ఎందుకు ఇష్టపడతారు
●గోల్డ్ ఈటీఎఫ్‌లను స్టాక్ మార్కెట్‌లో కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు.
●సాధారణ బంగారం మాదిరిగా.. గోల్డ్ ఈటిఎఫ్‌లనుప్రత్యేకంగా భద్రపరచాల్సిన అవసరం లేదు.
●గోల్డ్ ఈటీఎఫ్‌లను చిన్న మొత్తంలో.. అంటే రూ. 500 లేదా రూ. 1000 కి కూడా కొనుగోలు చేయవచ్చు. ఫిజికల్ గోల్డ్ కొనేందుకు పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.
●గోల్డ్ ఈటీఎఫ్‌లకు మంచి లిక్విడిటీ ఉంటుంది. వీటిని తొందరగా అమ్మవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు.
బంగారంపై పెట్టుబడికి మార్గాలు
●గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్: ప్రధానంగా గోల్డ్ ఈటిఎఫ్‌లలో పెట్టుబడి
●సావరిన్ గోల్డ్ బాండ్లు: వడ్డీతో పాటు, పెరిగిన ధరలను అందుకోవచ్చు
●భౌతిక బంగారం: ఆభరణాలు, నాణేలు, కడ్డీలు
బంగారం ధరలు గత కొన్ని రోజులుగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ డిమాండ్, కరెన్సీ కదలికలు, భౌగోళిక రాజకీయ సంఘటనలు వంటివన్నీ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి బంగారంపై సురక్షితమైనదని నిపుణులు చెబుతారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. పెట్టుబడి విషయంలో పెట్టుబడిదారుడే నిర్ణయం తీసుకోవాలి.