
స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో అధిక పెట్టుబడులు ఉన్నప్పుడు తక్కువ అస్థిరతలు ఉన్న సాధనాల్లోకి ఎలా మళ్లించాలి? లేదంటే స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో ఉన్న పెట్టుబడులకు సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ)ను ఎంపిక చేసుకోవచ్చా? – హరిహరన్ అనంతనారాయణన్
స్మాల్‌క్యాప్ పెట్టుబడుల్లో రిస్క్ అధికంగా ఉంటుంది. మీరు చెప్పిన విధంగా చేస్తే ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం. ఉదాహరణకు 2006 నుంచి రూ.కోటి మొత్తాన్ని స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి, ఏటా 10 శాతం చొప్పున క్రమానుగతంగా ఉపసంహరించుకుంటూ (ఎస్‌డబ్ల్యూపీ) వచ్చినప్పటికీ.. ఆ పెట్టుబడి రూ.6.3 కోట్లకు వృద్ధి చెంది ఉండేది. స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో రాబడులు ఏ స్థాయిలో ఉంటాయన్నది ఇది తెలియజేస్తుంది. అయినప్పటికీ ఏటా 10 శాతం ఉపసంహరించుకోవాలని నేను సూచించను. దీనికి బదులు 2 శాతం చొప్పున ఉపసంహరించుకుంటే.. రూ.కోటి పెట్టుబడి రూ.18.7 కోట్లు అయి ఉండేది. నా సూచన ఏమిటంటే.. స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఉంటే, ఏటా ఉపసంహరించుకునే రేటు 3 శాతం మించకుండా ఉండేట్టు అయితే, మీ పెట్టుబడులను అలాగే కొనసాగించుకోవచ్చు. దీనివల్ల మార్కెట్ల పతనాల్లో ఆందోళన చెందకుండా నిశ్చింతగా ఉండొచ్చు. వచ్చే 20–30 ఏళ్లలో ఈక్విటీ మార్కెట్లు 2008 తరహా అతిపెద్ద పతనాలను రెండు లేదా మూడు పర్యాయాలు చూసే అవకాశం ఉంటుంది. అలాంటి సమయాల్లో స్మాల్ క్యాప్ పెట్టుబడుల విలువ మరింత పడిపోతుంది. అందుకే మీ ఉపసంహరణను 2%కి పరిమితం చేసినట్టయితే ఈ పతనాలను మీరు తట్టుకోగలరు.
మార్కెట్ల పట్ల నమ్మకం, ఈ తరహా మార్కెట్ సైకిల్స్‌ను గతంలో చూసిన అనుభవం అన్నవి మీ పెట్టుబడుల విధానాన్ని కొనసాగించుకునేందుకు ఎంతో అవసరం. అప్పుడు దీర్ఘకాలంలో విజయం సాధించగలరు. మరో ఉదాహరణ చూద్దాం. ఒకవేళ మీరు ఈక్విటీ సేవింగ్స్ ఫండ్‌లో రూ.కోటి ఇన్వెస్ట్ చేసి.. ఏటా 4 శాతాన్ని ఉపసంహరించుకుంటే (2005లో మొదలైందని భావించినప్పుడు) అప్పుడు మీ పెట్టుబడి రూ.1.73 కోట్లుగా మారేది. అదే స్మాల్‌క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి ఏటా 4% ఉప సంహరించుకున్నప్పుడు పెట్టుబడి రూ.15.6 కోట్లు అయ్యేది. అధిక రాబడి కోరుకుంటే అస్థిరతలకు అలవాటు పడాలి. అస్థిరతలను సమర్థవంతంగా ఎదుర్కొంటే మెరుగైన రాబడులు పొందొచ్చు. ఆ తరహా అధిక అస్థిరతలను భరించలేకపోతే మరింత రక్షణాత్మక పెట్టుబడి సాధనాలను పరిశీలించొచ్చు.
అధిక రేటింగ్ కలిగిన అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలన్నది నా ఆలోచన. దీర్ఘకాలం కోసం ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయొచ్చా? – రమేశ్
దీర్ఘకాలం కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన నిర్ణయం అవుతుంది. కాకపోతే పెద్ద మొత్తంలో పెట్టుబడిని ఒకే విడత పెట్టేయడం అనకూలం కాకపోవచ్చు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత మార్కెట్లు పడిపోతే ఇన్వెస్టర్లు ఆందోళనకు గురవుతారు. ఉదాహరణకు మీరు రూ.50 లక్షలను ఈక్విటీ ఫండ్ లేదా అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. మార్కెట్లు పడితే పోర్ట్‌ఫోలియో విలువ సైతం క్షీణిస్తుంది. కాకపోతే అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ అచ్చమైన ఈక్విటీ పథకాలతో పోల్చి చూస్తే మార్కెట్ పతనాల్లో స్థిరత్వాన్ని ప్రదర్శిస్తాయి. ఎందుకంటే అవి డెట్ సాధనాల్లోనూ కొంత ఇన్వెస్ట్ చేస్తాయి. మీరు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్న మొత్తాన్ని ఒకే విడత కాకుండా.. పలు విడతలుగా ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ల ఉద్దాన, పతనాల తాలూకూ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. కనుక పెట్టుబడిని ఒకే విడత కాకుండా, సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ రూపంలో కొంతకాలం పాటు ఇన్వెస్ట్ చేసుకునేలా ప్రణాళిక వేసుకోండి.
