ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ నికర లాభం రూ. 654 కోట్లకు చేరింది. గత క్యూ2లో నమోదైన రూ. 553 కోట్లతో పోలిస్తే 18 శాతం పెరిగింది. ఇక లోన్‌బుక్ 6.4 శాతం వృద్ధి చెందడంతో కీలకమైన నికర వడ్డీ ఆదాయం 0.10 శాతం మెరుగుపడి 4.6 శాతానికి చేరింది. ఇతర ఆదాయం 16.9 శాతం పెరిగి రూ. 1,644 కోట్లుగా నమోదైంది.
తాజా స్లిప్పేజీలు అంతక్రితం త్రైమాసికంలో ఉన్న రూ. 1,458 కోట్ల నుంచి రూ. 1,248 కోట్లకు దిగివచ్చాయి. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి పెద్దగా మార్పు లేకుండా 1.6 శాతం స్థాయిలో కొనసాగుతోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 శాతం స్థాయి రుణ వృద్ధి సాధించాలని నిర్దేశించుకున్నట్లు బ్యాంక్ ఎండీ ప్రశాంత్ కుమార్ చెప్పారు. ఇకనుంచి నికర వడ్డీ మార్జిన్లు మరింత మెరుగుపడగలవని ఆయన పేర్కొన్నారు. జపాన్ దిగ్గజం ఎస్‌ఎంబీసీ 24 శాతం పైగా వాటాను కొనుగోలు చేసినప్పటికీ, తక్షణమే వ్యాపార ప్రణాళికల్లో మార్పులేమీ ఉండబోవని కుమార్ వివరించారు. భవిష్యత్ ప్రణాళికలను నిర్దేశించే వార్షిక సర్వసభ్య సమావేశం యథా ప్రకారంగానే జరుగుతుందని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 80 శాఖలను ప్రారంభించే ప్రణాళికలు ఉన్నట్లు వివరించారు.


