సోమవారం 562 విమానాలు రద్దు
ఇబ్బంది పడుతున్న జనం
ప్రయాణికులకు రూ.827 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
న్యూఢిల్లీ/ముంబై: ఇండిగో విమానాల రద్దు సంక్షోభం కొనసాగుతోంది. సోమవారం సైతం 562 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లోని ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానాల రద్దు పర్వం ఏడోరోజూ కొనసాగింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 250కిపైగా విమానాలు, బెంగళూరులో 150 ఇండిగో విమానసర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్‌లో 112, ముంబైలో దాదాపు 100, చెన్నైలో 56 విమానాలు రద్దయ్యాయి.
వందల విమానాల రద్దుతో కీలక నగరాల్లోని ఎయిర్‌పోర్టుల్లో అప్పటికే చేరుకున్న ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. కీలకమైన శస్త్ర చికిత్సలు, పెళ్లిళ్లు, బిజినెస్ మీటింగ్‌లు, విహార యాత్రల కోసం టికెట్ బుక్‌చేసుకుని పిల్లాపాపలతో వచ్చిన వందలాది మంది ప్రయా ణికులు సోమవారం సైతం విమానాశ్రయాల్లో చేదు అనుభవాలను చవిచూడాల్సి వచ్చింది. దీంతో హడావుడిగా వేరే కంపెనీల విమానాల కోసం రెట్టింపు ధరలకు టికెట్లు కొనాల్సిన దురవస్థను ఏడో రోజూ విమానప్రయాణికులు ఎదుర్కొన్నారు.
అస్పష్ట వివరణ ఇచ్చిన ఇండిగో
వందల విమానాల రద్దుకు కారణాలను సోమవారం సాయంత్రంకల్లా చెప్పాలంటూ ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీటర్ ఎల్బర్స్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సీఓఓ ఇసిడర్ పోర్వెరస్‌లకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ షోకాజ్ నోటీస్ జారీచేసింది. దీనికి స్పందనగా పీటర్, ఇసిడర్‌లు సోమవారం ఒక వివరణను ఇచ్చారు. అస్పష్టంగా చేతులు దులిపేసుకునే ధోరణిలోనే ఆ వివరణ ఉండటం గమనార్హం.
‘‘ చిన్న చిన్న సాంకేతిక సమస్యల కారణంగా ఈ సమస్యకు అంకురార్పణ జరిగింది. శీతాకాలపు ప్రయాణికుల రద్దీతో మేం మార్చేసిన షెడ్యూల్, విపత్కర వాతావరణ పరిస్థితులు, రెండో దశవిమాన విధుల కాల పరిమితి(ఎఫ్‌డీటీఎల్) నిబంధనల అమలుతో పైలట్ల రోస్టర్ విధానం సమగ్ర అమలులో వైఫల్యాలు.. ఇవన్నీ జత కలిసి డిసెంబర్ తొలి వారంలో మా విమానరాకపోకల రేటింగ్‌ను కిందకు దిగజార్చాయి.
మొత్తం ఉదంతానికి సంబంధించిన అసలు కారణాలను ఇప్పుడే చెప్పలేం. అయినా డీజీసీఏ సూచించిన ఎఫ్‌డీటీఎల్ నిబంధనలు మాకు పెద్ద సవాల్‌గా నిలిచాయి. దీంతో గతిలేక డిసెంబర్ ఐదో తేదీన అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నాం. మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు రీబూట్ చేశాం. దీంతో వందలాది విమానాలను రద్దుచేయాల్సి వచ్చింది. ఈ విషయంలో మాత్రం ప్రయాణికులకు క్షమాపణలు చెబుతున్నాం.
మా కంపెనీ కార్యకలాపాలు ఎంతో సంక్లిష్టమైన, విస్తృతమైన స్థాయిలో ఉంటాయి. అందుకే సమగ్ర స్థాయిలో మూల కారణాల విశ్లేషణ(రూట్ కాజ్ అనాలసిస్) చేయడానికి మాకు మరికొంత సమయం కావాలి. డీజీసీఏ జారీచేసిన షోకాజ్ నోటీస్ ప్రకారం చూసినా మేం ప్రతిస్పందన తెలియజేసేందుకు 15 రోజుల గడువు ఇంకా ఉంది.’’ అని పీటర్, ఇసిడర్ వివరణ ఇచ్చారు. ఈ పొడిపొడి వివరణతో డీజీసీఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.
తగు చర్యలు తీసుకుంటాం: డీజీసీఏ
‘‘షోకాజ్ నోటీస్‌కు స్పందనగా ఇండిగో ఇచ్చిన వివరణను పరిశీలిస్తున్నాం. తలబిరుసుతనంతో చేయాల్సిందంతా చేసేసి మొసలి కన్నీరు కార్చినట్లుగా ఈ వివరణ ఉంది. సమగ్ర దర్యాప్తు తర్వాత అసలు కారణాలు తెలిశాక కారకులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇండిగో వివరణను కూలంకషంగా పరిశీలిస్తున్నామని డీజీసీఏ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. వివరణతో అసంతృప్తిగా ఉన్న డీజీసీఏ నలుగురు సభ్యుల ప్యానెల్.. ఇండిగో సీఈఓ, సీఓఓలను బుధవారం నేరుగా తమ ఎదుట హాజరై సంజాయిషీ ఇవ్వాలని కోరాలని భావిస్తోంది.
సగం బ్యాగులు వెనక్కి
చెకిన్ సందర్భంగా ప్రయాణికుల నుంచి అందుకున్న వేలాది బ్యాగులను తిరిగి అప్పగించే పనిని యుద్ధప్రాతిపదికన పూర్తిచేసున్నట్లు ఇండిగో ప్రకటించింది. 9,000 బ్యాగులను తీసుకున్నాం. వీటిలో ఇప్పటికే 4,500 లగేజీ బ్యాగులను తిరిగి ఇచ్చేశాం. వచ్చే 36 గంటల్లోపు మిగతా బ్యాగులనూ ముట్టచెప్తాం. ఇప్పటిదాకా టికెట్‌ల బుకింగ్‌కు సంబంధించి రూ.827 కోట్ల నగదును రీఫండ్ చేశాం. నవంబర్ 21–డిసెంబర్ 7 తేదీల మధ్య 9,55,591 టికెట్లను రద్దుచేశాం ’’అని ఇండిగో సోమవారం
పేర్కొంది.


