
అగ్ని–ప్రైమ్ క్షిపణి పరీక్ష విజయవంతం
డీఆర్‌డీఓ అరుదైన ఘనత
మిస్సైల్ పరిధి 2,000 కిలోమీటర్లు
న్యూఢిల్లీ: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) ఆరుదైన ఘనత సాధించింది. ఇంటర్మిడియెట్ రేంజ్ అగ్ని–ప్రైమ్ క్షిపణిని రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి విజయవంతంగా పరీక్షించింది. బుధవారం జరిగిన ఈ పరీక్షలో స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్(ఎస్‌ఎఫ్‌సీ) సైతం పాలుపంచుకుంది. అయితే, ఈ పరీక్ష ఎక్కడ చేపట్టారన్నది రక్షణ శాఖ బహిర్గతం చేయలేదు. స్థిరమైన ప్రదేశం నుంచి కాకుండా పట్టాలపై పరుగులు తీస్తున్న రైలు నుంచి మిస్సైల్‌ను పరీక్షించడం భారత క్షిపణి తయారీ రంగంలో ఒక కీలకమైన మైలురాయిగా భావిస్తున్నారు.
క్షిపణులను దేశంలో ఎక్కడికైనా రైలులో సులభంగా తరలించే సామర్థ్యాన్ని భారత్ సాధించడం గమనార్హం. తదుపరి తరం అగ్ని–ప్రైమ్ మిస్సైల్ పరిధి 2,000 కిలోమీటర్లు. ఈ పరీక్ష విజయవంతం కావడం పట్ల రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తంచేశారు. రైలు నెట్‌వర్క్ నుంచి ఆయుధ వ్యవస్థను ప్రయోగించే సామర్థ్యం కలిగిన అతికొద్ది దేశాల జాబితాలో భారత్ సైతం సగర్వంగా చేరిందని పేర్కొన్నారు.
ప్రత్యేకంగా డిజైన్ చేసిన రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి అగ్ని–ప్రైమ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పరీక్షించినట్లు స్పష్టంచేశారు. అతి తక్కువ సమయంలోనే మిస్సైల్‌ను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించి, ప్రయోగించే సత్తా మన సొంతమని ఉద్ఘాటించారు. ఈ మేరకు రాజ్‌నాథ్ సింగ్ గురువారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు.
అత్యాధునిక క్షిపణి
అగ్ని–ప్రైమ్ క్షిపణి అత్యాధునికమైనదని రక్షణ శాఖ వెల్లడించింది. అగ్ని బాలిస్టిక్ క్షిపణుల శ్రేణిలో దీన్ని అభివృద్ధి చేశారు. ఇందులో నూతన తరం కమ్యూనికేషన్ వ్యవస్థలు, రక్షణ యంత్రాంగం ఉన్నట్లు పేర్కొంది. గ్రౌండ్ స్టేషన్ నుంచి క్షిపణిని నియంత్రించవచ్చని స్పష్టంచేసింది. భవిష్యత్తులో రక్షణ దళాల్లో రైలు ఆధారిత ఆయుధ వ్యవస్థలు, క్షిపణులను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలియజేసింది. అగ్ని–ప్రైమ్ క్షిపణి పరీక్ష కార్యక్రమంలో డీఆర్‌డీఓ, ఎస్‌ఎఫ్‌సీ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ‘రోడ్ మొబైల్ వేరియెంట్’ అగ్ని–ప్రైమ్ క్షిపణులను ఇప్పటికే రక్షణ దళాల్లో ప్రవేశపెట్టారు. పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్–పాకిస్తాన్ మధ్య ఘర్షణ జరిగిన తర్వాత నాలుగున్నర నెలల్లోగా రైలు ఆధారిత మొబైల్ లాంచర్‌తో మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
గేమ్ చేంజర్
అగ్ని–ప్రైమ్ పరీక్ష కోసం రైలును ప్రత్యేకంగా రూపొందించారు. సాధారణ రైళ్లు ప్రయాణించే పట్టాలపైనే ఇది పరుగులు తీస్తుంది. శత్రు దేశాల రాడార్లు గుర్తించకుండా క్షిపణిని రైలు లోపల దాచిపెట్టి తరలించవచ్చు. వర్షం, ఎండ, చలి వంటి వాతావరణ పరిస్థితుల్లోనూ తరలించే అవకాశం ఉండడం మరో ప్రత్యేకత. దేశవ్యాప్తంగా రైలు నెట్‌వర్క్ ఉండడం సైన్యానికి కలిసొచ్చే అంశం. క్షిపణులను రైలు ద్వారా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఇదొక ‘గేమ్ చేంజర్’ అని డీఆర్‌డీఓ వర్గాలు స్పష్టంచేశాయి. రష్యా, చైనా తదితర దేశాలు రైలు ఆధారిత మొబైల్ మిస్సైల్ వ్యవస్థలను అభివృద్ధి చేసుకున్నాయి. అణుశక్తి సంపన్న దేశమైన భారత్ బహుళ రీతుల్లో క్షిపణులను ప్రయోగించే సామర్థ్యాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.