సాధారణంగా మనం ఊహించని పనులను చేసే కొన్ని వాహనాలు మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటి ఒక వినూత్న వాహనాన్ని జపాన్‌లో ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ మోడ్ వెహికల్ (DMV)గా రికార్డు సృష్టించింది. ఇది బస్సు మాదిరిగా సాధారణ రోడ్లపై, రైలులాగా రైల్వే ట్రాక్‌పై పరుగులు పెడుతుంది.
చిన్న బస్సు రూపంలో కనిపించే ఈ డ్యూయల్ మోడ్ వాహనం దాని డిజైన్, ప్రత్యేకతలతో వాహనదారులను ఆకర్షిస్తోంది. దీనికి ప్రత్యేకమైన పేరు లేనప్పటికీ దీని పనితీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వాహనం జపాన్‌లోని షికోకు ద్వీపంలోని కొచ్చిని టోకుషిమా మధ్య నడుస్తోంది. ఈ డ్యూయల్ మోడ్ వాహనాన్ని ఆసా కోస్ట్ రైల్వే అనే ఒక ప్రైవేట్ పబ్లిక్ రైల్వే సంస్థ నిర్వహిస్తోంది.
15 సెకన్లలో మోడ్ ఛేంజ్..
ఈ వాహనం రోడ్డు మోడ్ (బస్సు) నుంచి రైలు మోడ్‌కు లేదా రైలు మోడ్ నుంచి రోడ్డు మోడ్‌కు చాలా త్వరగా మారగలదు. మోడ్‌ల మధ్య సెటప్‌ను మార్చుకోవడానికి డీఎంవీకి కేవలం 15 సెకన్లు మాత్రమే పడుతుంది.
ఈ వాహనం 21 మందిని మోసుకెళ్లగలదు.
రోడ్డుపై వేగం గంటకు 100 కిలోమీటర్ల వరకు చేరుకోగలదు.
రైలు పట్టాలపై గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
ఈ డీఎంవీ జపాన్‌లో అవాకైనాన్, కైఫు, షిషికుయి, కన్నోరా, ఉమినోకి టోయో టౌన్, మిచినోకి షిషికుయి ఒన్సెన్‌ను కలుపుతూ నడుస్తుంది. ఈ మార్గంలో ప్రయాణించే దూరాన్ని బట్టి ఛార్జీలు 200 యెన్ల నుంచి 800 యెన్ల వరకు (సుమారు రూ.100 నుంచి రూ.450) ఉంటాయి.
ఇదీ చదవండి: ఇండియాలో ‘గూగుల్ మీట్’ డౌన్


