దేశవ్యాప్తంగా విమానాల జాప్యాలు, రద్దులతో విమానయాన సంస్థ ఇండిగో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ తరుణంలో ఇండిగో విమానంలో చోటు చేసుకున్న అనూహ్య సంఘటన ప్రయాణికులను వణికించింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బెంగళూరు–వడోదర మార్గంలో ఉన్న ఇండిగో విమానం టేకాఫ్‌కి సిద్ధమవుతున్న సమయంలో ఒక పావురం అకస్మాత్తుగా క్యాబిన్‌లోకి ప్రవేశించింది. దీంతో ప్రయాణికులు, సిబ్బంది కొద్దిసేపు గందరగోళానికి గురయ్యారు.
వైరల్ వీడియోలో, పావురం విమానం నుండి బయటపడటానికి ప్రయత్నిస్తూనే ప్రయాణికుల తలల మీదుగా ఎగురుతూ కనిపిస్తుంది. సిబ్బంది, కొంతమంది ప్రయాణికులు దానిని బయటకు పంపించేందుకు ప్రయత్నించినా పావురం విమానం లోపలే తిరుగుతూనే ఉంది. ఈ దృశ్యాన్ని ఒక డిజిటల్ క్రియేటర్ రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, ఆ వీడియో వెంటనే వైరల్ అయింది. “విమానంలో ఆశ్చర్యకర అతిథి… నవ్వుల నడుమ సరదా క్షణం. పూర్తిగా ఆనందించాను” అని తన పోస్టులో పేర్కొన్నారు.
వైరల్ అయిన ఈ ఘటన సోషల్ మీడియా యూజర్లను ఆకట్టుకుంది. పలువరు తమ కామెంట్లతో స్పందించారు. “అది బర్డింగ్ పాస్ తీసుకుందేమో!” అని ఒకరు హాస్యభరితంగా వ్యాఖ్యానించగా “ప్రయాణంలో అదనపు తోడు” అని కామెంట్ చేశారు. “ఇండిగో టైమ్ ఇటీవల అస్సలు బాలేదు” అని మరొకరు ప్రతిస్పందించారు.
ఇండిగో ఈ ఘటనపై అధికారికంగా స్పందించకపోయినా, వీడియో మాత్రం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.


