బంగారం ధర ఇప్పటికే బాగా పెరిగింది. ఇంకా పెరుగుతుందా?
– శ్రావణి అద్దంకి
బంగారం ధరలు అదే పనిగా ర్యాలీ చేస్తుండం తప్పకుండా ఆకర్షిస్తుంది. అవును బంగారం ధరలు ఇటీవలి కాలంలో గణనీయమైన రాబడిని ఇచ్చాయి. కానీ, ఇంకెంత పెరుగుతుందన్నది సమాధానం లేని ప్రశ్నే అవుతుంది. ఏ అసెట్ క్లాస్‌కు అయినా ఇదే వర్తిస్తుంది. కనుక దీనికి బదులు మీ పెట్టుబడుల్లో బంగారాన్ని చేర్చుకోవడం వల్ల ఒనగూరే ప్రయోజనాలనే పరిగణనలోకి తీసుకోవాలి. అనిశ్చితుల్లో బంగారం మంచి పనితీరు చూపిస్తుంటుంది.
ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల సమయంలో లేదా ఈక్విటీ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొంటున్న తరుణంలో బంగారం ధరలు పెరుగుతుంటాయి. అలాంటి అనిశి్చతులన్నీ సర్దుకుని, ఆర్థిక వ్యవస్థలు మంచి పనితీరు చూపిస్తుంటే అప్పుడు బంగారం పనితీరు పరిమితం అవుతుంది. గత 15 ఏళ్లలో బంగారం ఏటా 10 శాతం రాబడిని అందించింది. వివిధ రంగాలు, పరిమాణంతో కూడిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఇదే కాలంలో ఏటా ఇచ్చిన రాబడి 12 శాతంగా ఉంది.
రాబడిలో వ్యత్యాసం స్వల్పమే అయినప్పటికీ దీర్ఘకాలంలో కాంపౌండింగ్ కారణంగా చెప్పుకోతగ్గంత అదనపు నిధి సమకూరుతుంది. ఈక్విటీలు అన్నవి వ్యాపారాల్లో వాటాలను అందిస్తాయి. అవి సంపదకు వీలు కల్పిస్తాయి. బంగారం కేవలం నిల్వ ఉంచుకునే సాధనమే. కనుక ఇన్వెస్టర్లు తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా మొత్తం పెట్టుబడుల్లో 10 శాతం వరకు బంగారానికి కేటాయించుకోవచ్చు.
నేను ప్రతి నెలా రూ.45,000 చొప్పున ఆరేళ్లపాటు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఈ మొత్తాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో వేటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి? – దీపక్
పెట్టుబడిలో తక్కువ రిస్క్ కోరుకునే వారు 50 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల పెట్టుబడికి రిస్క్ ఉండదు. మిగిలిన 50 శాతాన్ని వృద్ధి కోసం ఈక్విటీలకు కేటాయించుకోవాలి. డెట్ విషయంలో షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ లేదా టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీల్లో లార్జ్‌క్యాప్ ఫండ్స్ లేదా లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్ నుంచి ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ అధిక రిస్క్ తీసుకునేట్టు అయితే.. ఈక్విటీలకు 65 శాతం నుంచి 80 శాతం, మిగిలిన మొత్తాన్ని డెట్ సాధనాలకు కేటాయించుకోవాలి.
సమాధానాలు:: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్


