ఫుడ్ ప్రాసెసింగ్ రంగం వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శి ఎ.పి. దాస్ జోషి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాసెసింగ్ స్థాయిని, ఎగుమతులను పెంచే దిశగా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయాలంటూ కార్పొరేట్లకు ఆయన సూచించారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు.
‘మనం భారీగా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నప్పటికీ సుమారు 12 శాతం మాత్రమే ప్రాసెస్ అవుతోంది. ఈ విషయంలో అమెరికా, యూరోపియన్ యూనియన్‌లను అటుంచితే కనీసం ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌కి కూడా దగ్గర్లో లేము. దేశవ్యాప్తంగా 24 లక్షల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉండగా, వాటిలో రెండు శాతమే సంఘటిత రంగంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు, దేశీయంగా ప్రైవేట్ పెట్టుబడులు పెట్టేందుకు గణనీయంగా ఆస్కారం ఉంది. దీని వల్ల గ్రామీణ రైతాంగానికి కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది‘ అని జోషి చెప్పారు.
2014–15లో మొత్తం వ్యవసాయ ఎగుమతుల్లో 11 శాతంగా ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్ వాటా ప్రస్తుతం 22 శాతానికి పెరిగిందని తెలిపారు. 2030 నాటికి ఇది 30–32 శాతానికి చేరవచ్చని, పరిశ్రమకు అపరిమిత వృద్ధి అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన లేబర్ కోడ్‌లు, కార్మిక శక్తి ఎక్కువగా ఉండే ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాలకు ప్రయోజనకరంగా ఉంటాయని వివరించారు.


