డిగ్రీ లెవల్‌ ప్లానింగ్‌ భేష్‌ | Financial planning for higher education | Sakshi
Sakshi News home page

డిగ్రీ లెవల్‌ ప్లానింగ్‌ భేష్‌

Dec 8 2025 6:25 AM | Updated on Dec 8 2025 6:25 AM

Financial planning for higher education

కేజీ నుంచే పీజీ కోసం ఆలోచించాలి మరి

ఉన్నత విద్య కోసం రుణాలపై ఆధారపడితే కష్టం

ఏటా 10 శాతం వరకూ పెరుగుతున్న విద్యా రంగ ద్రవ్యోల్బణం

ఈ లెక్కన వచ్చే పదేళ్లలో ఫీజులు రెండుమూడు రెట్లు పెరిగే చాన్స్‌

దానికి సిద్ధం కావాలంటే దీర్ఘకాలం పొదుపు తప్పనిసరి

ఎంత త్వరగా పొదుపు మొదలుపెడితే అంత మంచిది  

మన విద్యావ్యవస్థ అమెరికా కన్నా పూర్తి భిన్నం. అక్కడ ప్రాథమిక విద్య మొత్తం ప్రభుత్వ రంగంలోనే ఉంటుంది. అతితక్కువ ఖర్చుతో పూర్తయిపోతుంది. కానీ ఉన్నత విద్యకు మెజారిటీ జనం అప్పులు చేయాల్సిందే. అంత భారీగా ఖర్చవుతుంది మరి. ఇక మన దగ్గర పరిస్థితి పూర్తిగా వేరు. ప్రాథమిక విద్య నుంచే అప్పులు చేయాల్సిన పరిస్థితి. 

ఉన్నత విద్యకొచ్చేసరికి టాప్‌గ్రేడ్‌ సంస్థలన్నీ ప్రభుత్వ రంగంలోనే ఉన్నా... వాటిలో సీట్లు దక్కేది అతితక్కువ మందికి. సో... మంచి సంస్థలో ఉన్నతవిద్య పూర్తి చేయాలంటే మామూలుగా ఖర్చవదు. మరి పిల్లలకోసం తప్పదు కదా? అందుకే... వాళ్లు ప్రాథమిక స్థాయిలో ఉన్నపుడే... ఉన్నత విద్య కోసం ఆర్థికంగా ప్రణాళిక వేసుకుంటే ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పూర్తి చేయగలుగుతారు. అదెలాగో తెలుసుకుందాం. 

ఉన్నత విద్య కోసం ప్లాన్‌ చేసుకునేటపుడు ముందుగా గుర్తుంచుకోవాల్సింది భవిష్యత్‌ ద్రవ్యోల్బణం. ఇంజినీరింగ్, మెడిసిన్, విదేశీ విద్య... ఇలా ఏది చూసుకున్నా ఫీజులు ఏటా పెరుగుతున్నాయి. ప్రస్తుతం సగటున విద్యా ద్రవ్యోల్బణం 8 నుంచి 10 శాతం ఉంటోంది. ఫీజులు ఈ స్థాయిలో పెరుగుతుంటే... పదేళ్ల తరవాత డిగ్రీకయ్యే ఖర్చు ప్రస్తుతానికన్నా రెండు మూడు రెట్లు ఎక్కువ ఉండవచ్చనేది ఆర్థిక నిపుణుల మాట. వారి అంచనాల ప్రకారం... మరి ఈ స్థాయిలో పెరిగే విద్యా వ్యయం కోసం ఇప్పటి నుంచే ప్రణాళిక వేసుకోవాలి కదా? ఈ లెక్కన నెలకు ఎంత పొదుపు చెయ్యాలి? 
→ వచ్చే 12 సంవత్సరాల్లో రూ.30 లక్షలు కావాలనుకుంటే కనక నెలకు రూ.10వేల చొప్పున ఇప్పటి నుంచే సిప్‌ చెయ్యాలి. ఏటా 12 శాతం వార్షిక రాబడిని ఆశించవచ్చు.  
→ వచ్చే 15 ఏళ్లలో రూ.50 లక్షల మొత్తాన్ని ఆశిస్తే కనక నెలకు రూ.8,500 నుంచి రూ.9000 మొత్తాన్ని సిప్‌ చేస్తే సరిపోతుంది.  

ఈ జాగ్రత్తలు తప్పనిసరి...
→ పొదుపు చేయటంలో ఆలస్యం వద్దు 
→ కేవలం ఎఫ్‌డీలపైనే ఆధారపడొద్దు (తక్కువ రాబడి) 
→ హాస్టల్, ఇతర ఖర్చులనూ పరిగణనలోకి తీసుకోవాలి 
→ అనవసరంగా విద్యా రుణాల జోలికి వెళ్లొద్దు

2035లో డిగ్రీకయ్యే వ్యయం... 
ఇంజినీరింగ్‌ – రూ.25–35 లక్షలు 
ఎంబీబీఎస్‌  – రూ.1.8 – 2.5 కోట్లు 
ఎంబీఏ – రూ.45–70 లక్షలు 
విదేశీ విద్య (మాస్టర్స్‌) – రూ.60 లక్షలు– 1.2 కోట్లు 

మరి ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలి?
→ సిప్‌ కోసం మ్యూచువల్‌ ఫండ్లను ఆశ్రయించవచ్చు. ఎందుకంటే వాటికి మాత్రమే ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది. లార్జ్‌ క్యాప్‌ లేదా ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్లను దీర్ఘ కాలానికి ఎంచుకుంటే సరిపోతుంది.  
→ ఆడ పిల్లల కోసమైతే కనక సుకన్య సమృద్ధి యోజనను ఎంచుకోవచ్చు. దీనిపై 8 శాతం వడ్డీతో పాటు పన్ను ప్రయోజనాలూ ఉంటాయి. 
→ తల్లిదండ్రులు గనక ఒకవైపు బీమా భద్రత మరోవైపు ఇన్వెస్ట్‌మెంట్‌... ఈ రెండింటి ప్రయోజనాలూ ఆశిస్తే గనక ఛైల్డ్‌ యూలిప్స్‌ను ఆశ్రయించవచ్చు.  
→ ఒకవేళ పిల్లలు గనక ఇప్పటికే 15–17 ఏళ్లకు వస్తే.. డెట్‌ ఫండ్లను, విడగొట్టే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను పరిశీలించవచ్చు. అంటే ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల చొప్పున ఎఫ్‌డీలను విడగొట్టడమన్న మాట. దీనివల్ల ప్రతి ఏడూ కొంత మొత్తం చేతికొస్తుంది. 
→ ఇక్కడ గమనించాల్సిందేంటంటే పిల్లల చదువు గురించి మనకు ముందే తెలుసు. మరి ముందే ప్రణాళిక వేసుకోవాలి కదా? లేకపోతే చివరిక్షణంలో అప్పులపైనే ఆధారపడాల్సి వస్తుంది. ఆ ఒత్తిడి తట్టుకోవటం అంత ఈజీ కాదు. 
→ ఇంకో ముఖ్య విషయమేంటంటే దీర్ఘకాలం సిప్‌ చేస్తే కనక నెలవారీ మొత్తం చాలా తక్కువే సరిపోతుంది. అందుకని ఎంత త్వరగా సిప్‌ మొదలుపెడితే అంత మంచిదన్న మాట. కేజీ నుంచే మొదలుపెడితే ఇంకా బెటర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement