మీరూ కావచ్చు... మిస్టర్‌ బాండ్‌! | Features and Benefits of Corporate Bond Funds | Sakshi
Sakshi News home page

మీరూ కావచ్చు... మిస్టర్‌ బాండ్‌!

Dec 8 2025 4:52 AM | Updated on Dec 8 2025 4:52 AM

Features and Benefits of Corporate Bond Funds

కాస్త ఎక్కువ వడ్డీ కావాలంటే కార్పొరేట్‌ బాండ్స్‌ చూడొచ్చు

వీటిక్కూడా ఎఫ్‌డీల మాదిరే కొంతవరకూ గ్యారంటీ ఉంది

కొన్ని బాండ్లలో ఎఫ్‌డీల కన్నా ఎక్కువ రిస్కు కూడా ఉంటుంది

రేటింగ్‌ను బట్టి ఇన్వెస్ట్‌ చేస్తే చాలావరకూ సొమ్ముకు భద్రత

ఈ బాదరబందీ వద్దనుకుంటే కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్లూ ఉన్నాయ్‌

వడ్డీలు తగ్గుతున్నాయి కనక... కాస్త ఎక్కువ రేటు కావాలంటే ఇదో మార్గం

రెండ్రోజుల కిందటే ఆర్‌బీఆఐ రెపోరేటు మరో 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. అంటే... వడ్డీ రేట్లు తగ్గుతాయన్న మాట. వాస్తవంగా చూస్తే అటు రుణాలపై చెల్లించాల్సిన వడ్డీరేటూ తగ్గాలి.. ఇటు మన డిపాజిట్లపై వచ్చే వడ్డీ రేటూ తగ్గుతుంది. కాకపోతే మన బ్యాంకులకు వాటి వ్యాపారమే తొలి ప్రాధాన్యం. కాబట్టి రుణాలపై వడ్డీ రేట్లకు సంబంధించి కాస్త లేటుగా  స్పందిస్తాయి. కానీ డిపాజిట్లపై వడ్డీ రేట్లు వెంటనే తగ్గించేస్తాయి. 

పాపం... డిపాజిట్లు చేసుకుని, వాటిపై వడ్డీతో బండి లాగించేవారికి ఇది ఇబ్బందికరమే. మరి డిపాజిట్లపై వడ్డీ తగ్గుతూ పోతున్న ఇలాంటప్పుడు ఏం చెయ్యాలి? ప్రత్యామ్నాయ మార్గాలేంటి?  చాలామంది స్టాక్‌ మార్కెట్లవైపు చూస్తారు. మార్కెట్లలో డబ్బులు సంపాదించాలంటే వాటి గురించి బాగా తెలిసి ఉండాలి. అందుకే మ్యూచువల్‌ ఫండ్లను ఆశ్రయిస్తారు. అవి కొంతవరకూ బెటరే అయినా... వీటిలో ఎక్కడా రాబడులపై గ్యారంటీ ఉండదు. మరి ఎలా? ఇదిగో... ఇలాంటి వారి కోసమే కార్పొరేట్‌ బాండ్లున్నాయి. అవేంటో చూద్దాం...

కంపెనీలు నేరుగా ప్రజల నుంచి డబ్బులు సమీకరించడానికి బాండ్లు (రుణపత్రాలు) జారీ చేస్తుంటాయి. వాటికి నిర్దిష్ట కాలపరిమితి ఉంటుంది. పైపెచ్చు వార్షికంగా చెల్లించేలా స్థిరమైన వడ్డీ రేటుంటుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై దాదాపు 7 శాతమే వడ్డీ వస్తున్న తరుణంలో బాండ్లపై మాత్రం 8 నుంచి 12% వరకూ వడ్డీ వచ్చే అవకాశం ఉంది. దీనికి గ్యారంటీ కూడా ఉంటుంది. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

అవసరాలకు అనుగుణంగా..
కంపెనీలు తమ వ్యాపార విస్తరణ కోసమో, వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసమో లేదా అధిక వడ్డీపై తీసుకున్న రుణాలను తీర్చేసేందుకో నిధుల సమీకరణ కోసం జారీ చేసే బాండ్లను కార్పొరేట్‌ బాండ్లుగా పిలుస్తారు. అంటే ఈ బాండును కొనుక్కున్న వాళ్లు, సదరు కంపెనీకి నిర్దిష్ట కాల వ్యవధికి అప్పు ఇచి్చనట్లు లెక్క. దీనికోసం ఆ కంపెనీ మధ్య మధ్యలో (అంటే నెల, మూడు నెలలు, వార్షికంగా..) వడ్డీ చెల్లిస్తుంది. మెచ్యూరిటీ తీరాక అసలును చెల్లిస్తుంది. ఈ వడ్డీ రేటును బాండ్ల పరిభాషలో కూపన్‌ రేటుగా వ్యవహరిస్తారు. కూపన్‌ కాకుండా సాధారణ మార్కెట్లో వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బాండు విలువ కూడా పెరగవచ్చు. ఆ విధంగా వడ్డీతో పాటు, పెట్టిన పెట్టుబడి పెరిగే అవకాశం కూడా ఉంటుంది.  

బాండ్‌ ఫండ్స్‌.. 
ప్రతి బాండును క్షుణ్నంగా అధ్యయనం చేసి, సరైన దాన్ని ఎంపిక చేసుకోవడం కష్టతరంగా అనిపించే వారి కోసం బాండ్‌ ఫండ్స్‌ కూడా ఉన్నాయి. ఇవి ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధుల్లో కనీసం 80 శాతం మొత్తాన్ని అత్యుత్తమ క్రెడిట్‌ రేటింగ్‌ ఉండి, ఆర్థికంగా పటిష్టంగా ఉన్న సంస్థల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. నిప్పన్‌ ఇండియా కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్, ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్, కోటక్‌ కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్, యాక్సిస్‌ కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్‌ మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఇవి వార్షికంగా సగటున ఏడు శాతానికి పైగా రాబడులు అందించాయి. ఇవి 2–5 ఏళ్ల కాలవ్యవధికి అనువుగా ఉంటాయి.  

ఇదీ.. బాండ్‌ పరిభాష.. 
కూపన్‌ రేటు: కంపెనీ చెల్లించే వడ్డీ 
ఈల్డ్‌: ధరల్లో మార్పుల వల్ల చేతికి అందే మొత్తం రాబడి 
క్రెడిట్‌ రేటింగ్‌: తిరిగి చెల్లించడంలో కంపెనీకి ఉండే సామర్థ్యం 
మెచ్యూరిటీ: అసలును తిరిగి చెల్లించే సమయం 
లిక్విడిటీ: బాండ్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించే వీలు  


కొన్ని రిస్క్ లుంటాయి .. 
అధిక రాబడులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లే ఈ బాండ్లలో రిస్క్ లు కూడా ఉంటాయి. సాధారణంగా బ్యాంకుల్లో రూ.5 లక్షలలోపు చేసే డిపాజిట్లకు డిపాజిట్‌ ఇన్సూరెన్స్, క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ (డీఐసీజీసీ) నుంచి బీమా రక్షణ ఉంటుంది. కానీ కార్పొరేట్‌ బాండ్లకు అలాంటిదేమీ ఉండదు. వాటి ధరలు కూడా వడ్డీ రేట్లను బట్టి ప్రభావితమవుతూ ఉంటాయి. పైపెచ్చు ఆ కంపెనీ తాలూకు క్రెడిట్‌ రేటింగ్‌ను బట్టి కూడా మారుతుంటాయి. ఇష్యూ చేసే కంపెనీ క్రెడిట్‌ రేటింగ్, వడ్డీ రేట్లను బట్టి మారిపోతుంటాయి.  

ఎక్కడ కొనొచ్చు.. 
జిరోధా, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్, ఏంజెల్‌ వన్, అప్‌స్టాక్స్‌ ెలాంటి బ్రోకరేజ్‌ ప్లాట్‌ఫాంలతో పాటు ఇండియా బాండ్స్, బాండ్‌ బజార్, గ్రిప్‌ ఇన్వెస్ట్‌లాంటి సెబీ రిజిస్టర్డ్‌ ప్లాట్‌ఫాంల ద్వారా రిటైల్‌ ఇన్వెస్టర్లు.. తమకు కావాల్సిన కార్పొరేట్‌ బాండ్లను ఎంచుకుని, కొనుగోలు చేయొచ్చు. కొనుగోలు, అమ్మకం లావాదేవీలను బట్టి స్వల్ప చార్జీలు ఉంటాయి. ప్లాట్‌ఫాంను బట్టి కనీస పెట్టుబడి రూ. 1,000 నుంచి ఉంటోంది. కొనుక్కున్న తర్వాత ఒకటి రెండు రోజుల్లో డీమ్యాట్‌ ఖాతాలోకి బాండ్లు క్రెడిట్‌ అవుతాయి.  

ఎంచుకోవడం ఇలా.. 
తీసుకున్న మొత్తాన్ని ఆ కంపెనీ తిరిగి సక్రమంగా చెల్లించగలదా లేదా అనేది ఇన్వెస్టర్లు తెలుసుకునేందుకు వీలుగా ఇక్రా, క్రిసిల్, కేర్‌ లాంటి రేటింగ్‌ ఏజెన్సీలు .. ఏ ప్లస్, ఏఏ, ట్రిపుల్‌ ఎ, బి ప్లస్‌ అంటూ బాండ్లకు రకరకాల రేటింగ్‌ ఇస్తాయి. దీన్ని బట్టి వాటిలో ఇన్వెస్ట్‌ చేయాలా వద్దా అనేది ఇన్వెస్టర్లు నిర్ణయించుకోవచ్చు. సాధారణంగా ట్రిపుల్‌ ఏ నుంచి ట్రిపుల్‌ బి మైనస్‌ వరకు రేటింగ్‌ ఉన్న వాటిని అత్యంత సురక్షితమైనవిగా, డబుల్‌ బీ ప్లస్‌ నుంచి బీ మైనస్‌ వరకు రేటింగ్‌ను ఒక మోస్తరు రిస్కు ఉన్నవాటిగా పరిగణిస్తారు. షేర్ల మాదిరిగానే ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ స్టాక్‌ ఎక్సే్చంజీల్లో ఇవి ట్రేడవుతూ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని విక్రయించుకోవచ్చు, కొనవచ్చు కూడా.

ఎవరికి అనువైనవంటే.. 
→ మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా అంటే ఏడాది నుంచి సుమారు పదేళ్ల వ్యవధికి గాను స్థిరంగా ఆదాయాన్ని అందించే సాధనాల కోసం చూస్తుంటే 
→ బ్యాంక్‌ డిపాజిట్లకే పరిమితం కాకుండా ఇతరత్రా ఫిక్స్‌డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాల్లో పెట్టుబడులను డైవర్సిఫై చేయదల్చుకుంటే 
→ ఎఫ్‌డీలకు మించి మెరుగైన రాబడులు ఆశిస్తున్నా... రిటైర్మెంట్‌ తరువాత స్థిరంగా నెలవారీ ఆదాయాన్ని కావాలనుకుంటున్నా 
→ పిల్లల చదువుల కోసం ప్లాన్‌ చేసుకుంటున్న తల్లిదండ్రులు... పెద్దగా రిస్క్ లను ఇష్టపడకుండా ఎఫ్‌డీలు కాకుండా ఇతర సాధనాలను చూస్తున్నవారికి

రేటింగ్‌ బట్టి రాబడి.. 
AAA:  తక్కువ రిస్కు     :     7–8 శాతం 
AA:  మధ్య స్థాయి రిస్కు    :     8–9.5 శాతం 
A: అధిక రిస్కు     :     10–12 శాతం   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement