మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్
సాక్షి,రాజమహేంద్రవరం: రాష్ట్రానికి ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సొంత వ్యాపారాలు ఏపీకి ఎందుకు తీసుకురావడంలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రశ్నించారు. బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన రోజు సందర్భంగా రాజమహేంద్రవరం ధర్మంచర కమ్యూనిటీ హాల్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రపంచ పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని చెప్పుకుంటున్న బాబు తన సొంత పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి తాను వ్యతిరేకంకాదని.. అయితే రాజధాని నిర్మాణానికి అన్ని వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న పవన్‌కళ్యాణ్ కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందని వ్యాఖ్యానించడం తగదన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు.


