విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
17 నెలలుగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశాలు లేవు
ఈసీ సమావేశాల నిర్వహణకు వీసీలకు అనుమతి ఇవ్వని ఉన్నతవిద్య కీలక అధికారి
తాను చెప్పినప్పుడు, తనకు నచ్చిన అజెండా ప్రకారమే నిర్వహించాలంటూ హుకుం
2025–26 బడ్జెట్‌కు ఈసీ అప్రూవల్ లేకుండానే ఆర్థిక వ్యవçహారాల నిర్వహణ
ఇప్పటికీ అరడజను వర్సిటీల్లో ఒక్కసారి కూడా ఈసీ సమావేశం పెట్టలేని దుస్థితి
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తోంది. స్వతంత్ర సంస్థలుగా విద్యాసేవలను అందించాల్సిన విశ్వవిద్యాలయాలను అనధికారిక నిబంధనల పేరుతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాజ్యాంగం, చట్టాలు కల్పించిన హక్కులను కాలరాస్తూ కనీసం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) సమావేశాలు నిర్వహించకుండా వర్సిటీల పాలన కుంటుపడేలా చేస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఏడునెలలు గడిచినా వర్సిటీల్లో ఇంతవరకు వార్షిక బడ్జెట్‌కు ఈసీ అప్రూవల్స్ లేవంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది.
మరోవైపు వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రపోజల్స్ సైతం సిద్ధమవుతున్న తరుణంలో ప్రస్తుత బడ్జెట్‌కే అప్రూవల్స్ లేకపోవడం వర్సిటీల ఆర్థిక వ్యవహరాల నిర్వహణపై తీవ్రప్రభావం చూపనుంది. బడ్జెట్ ఆమోదం లేకుండా ఖర్చు చేసేసిన తర్వాత వాటిని రాటిఫై చేసుకోవడం అనేది ఇంతవరకు జరగలేదని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. వర్సిటీల చట్టం ప్రకారం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కి అధిపతిగా వైస్ చాన్సలర్ (వీసీ) వ్యవహరిస్తారు.
ప్రభుత్వం నుంచి ఉన్నత విద్యామండలి చైర్మన్, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, ఆర్థికశాఖ కార్యదర్శి, కళాశాల విద్యా శాఖ కమిషనర్/డైరెక్టర్లతో పాటు వర్సిటీలోని ఆచార్యులు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛందసంస్థల వారు, విద్యావేత్తలు సభ్యులుగా నామినేట్ అవుతారు. మూడునెలలకు ఒకసారి ఈసీ సమావేశం నిర్వహించాలనేది ప్రాథమిక నిబంధన. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టాలను కాలగర్భంలో కలిపేసింది.
17 నెలలుగా వర్సిటీల్లో పూర్తిస్థాయి ఈసీ సమావేశాలు నిర్వహించకుండానే కాలం గడిపేస్తోంది. దీంతో వర్సిటీల్లో పాలన, ఆర్థిక వ్యవహరాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాస్తవానికి అత్యవసరంగా తీసుకున్న నిర్ణయాలను రాటిఫై పేరుతో తర్వాత ఈసీ సమావేశాల్లో ఆమోదిస్తారు. కానీ కూటమి పాలనలో సాధారణ నిర్ణయాలను కూడా ఈసీ సమావేశాల్లేక రాటిఫై చేసుకోవడానికి వీలుకలగడంలేదు. వర్సిటీల్లో కీలకంగా వ్యవహరించే రిజిస్ట్రార్ల నియామకం విషయంలోను ఈసీ ఆమోదం తప్పనిసరి.
ఉత్తరాంధ్రలోని ప్రముఖ వర్సిటీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజిస్ట్రార్‌గా నియమితులైన వ్యక్తికి ఈసీ ఆమోదం పొందడానికి ఏడాది పట్టింది. ఇంతలో ఆ వ్యక్తి మారిపోయారు. వీసీ మరొకరిని రిజిస్ట్రార్‌గా నియమించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈసీ సమావేశమే జరగలేదు. అసలు ఈసీ ఆమోదం లేని వ్యక్తి వర్సిటీలో కీలక ఆర్థిక వ్యవహరాలు నడిపిస్తూ వాటిని రాటిఫై చేసుకునే ఆలోచన మొత్తం వర్సిటీ పారదర్శకతనే ప్రశ్నిస్తోంది. ఇప్పటికీ అరడజనుకుపైగా వర్సిటీల్లో ఒక్కసారి కూడా ఈసీ సమావేశం నిర్వహించలేదంటే విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం తెలుస్తోంది.
అంతా తానే అంటున్న అధికారి
వైస్ చాన్సలర్ ముందుస్తు సమాచారంతో ఈసీ సమావేశం ఏర్పాటుచేసి కోరం ఉంటే అజెండా ప్రకారం నిర్ణయాలు ఆమోదింపజేసుకోవచ్చు. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖలోని ఓ కీలక అధికారి వర్సిటీలపై పట్టుకోసం వీసీలు, రిజిస్ట్రార్ల అధికారాలకు కత్తెర వేస్తూ ఈసీ సమావేశాలు జరగనివ్వకుండా చూడటం వర్సిటీ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈసీలో మెంబర్ మాత్రమే అయిన ఆ అధికారి.. గవర్నర్ ఆమోదంతో నియమితులైన వీసీలను, ఉన్నత విద్యామండలి చైర్మన్ అధికారాలను బైపాస్ చేస్తూ ఈసీల నిర్వహణకు అడ్డుకట్టు వేస్తుండటం గమనార్హం.
తనకు వీలైనప్పుడు, తనకు నచ్చిన అజెండా ప్రకారమే ఈసీ సమావేశం నిర్వహించాలని నిర్దేశిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఉన్నప్పుడే ఈసీ సమావేశం నిర్వహణకు ఓకే చెబుతున్నారు. ఆ అధికారికి సమయం లేకపోతే ఎంతకాలమైనా వీసీలు అనుమతి కోసం వేచిచూడాల్సిన దుస్థితి నెలకొంది. మరో విచిత్రం.. ఆ అధికారి మాత్రం ఈసీ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరవుతారు. మిగిలిన సభ్యులు నేరుగా హాజరుకావాలని హుకుం జారీచేస్తుంటారు.
కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు సైతం వీసీలను తీవ్రంగా అవమానిస్తున్నట్లు విమర్శలున్నాయి. తన పరిధిలోకి రాని ఉన్నతవిద్య అంశంలో రాయలసీమ జిల్లాల్లోని ఓ కలెక్టర్ జోక్యం చేసుకోవడమేగాక, గౌరవంగా కలిసి సమస్యను వివరించేందుకు వెళ్లిన వీసీని బయట కూర్చోబెట్టి అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా పంపించటం విమర్శలకు దారి తీసింది.
షాడోల రాజ్యం
ఉన్నత విద్యాశాఖలో షాడోల పాలన నడుస్తోంది. విద్యాశాఖ మంత్రి ఓఎస్‌డీ షాడో మంత్రిగా వ్యవహరిస్తుంటే.. ఉన్నత విద్యాశాఖలోని కీలక అధికారికి ఎన్నడూ పాఠాలు చెప్పని ఓ సీనియర్ లెక్చరర్ అనుమతి లేని ఓఎస్‌డీ పోస్టు సృష్టించుకుని షాడో పాత్ర పోషిస్తున్నారు. ఈ ఇద్దరు షాడోల దెబ్బకి ఉన్నత విద్యావ్యవస్థ, వర్సిటీలు కుప్పకూలిపోతున్నాయి. మంత్రి షాడోగా ఉన్న వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా ఆర్డర్లు ఇస్తుంటే.. ఉన్నతాధికారి షాడో అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా సమాచారం పేరుతో ఫోన్లు చేయడమేగాక అజెండాలు కూడా నిర్దేశిస్తున్నారని పలువురు వీసీలు ఆవేదన చెందుతున్నారు.
వాస్తవానికి మంత్రికి, కీలక ఉన్నతాధికారికి విద్యాసంబంధిత అంశాలను పట్టించుకునే తీరకలేదని, తమకు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వటంలేదని వర్సిటీల అధికారులు పేర్కొంటున్నారు. బాబు పాలనలో విశ్వవిద్యాలయాలు నిర్వీర్యమవుతున్నాయని విద్యావేత్తలు ఆవేదన చెందుతున్నారు.


