సాక్షి, తిరుపతి: తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో మూడు రోజుల పాటు సామాన్య భక్తులు వెళ్లే సర్వదర్శనం నిలిపివేస్తున్నట్టు తాజాగా టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. గోవింద మాల ధరించిన భక్తులకు సైతం సర్వదర్శనం అనుమతి లేదని చెప్పుకొచ్చింది. దీంతో, టీటీడీ ఒంటెద్దు పోకడలపై భక్తులు మండిపడుతున్నారు. ఎన్నడూలేని విధంగా ఇలాంటి నిర్ణయాలు ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

వివరాల ప్రకారం.. వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30, ద్వాదశి డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో సామాన్య భక్తులు వెళ్ళే సర్వ దర్శనం నిలిపి వేస్తున్నట్టు టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆ మూడు రోజుల్లో కేవలం ఆన్‌లైన్‌లో లక్కీడిప్ ద్వారా టికెట్లు ఎంపికైన వారిని మాత్రమే సర్వదర్శనానికి దర్శనం అనుమతి ఉన్నట్టు తెలిపింది. లక్కీ డిప్ టికెట్ లేని భక్తులు ఈ మూడు రోజులు తిరుమల దర్శనానికి రావద్దని ప్రచారం చేస్తోంది. టికెట్ ఉన్న భక్తులు మాత్రమే దర్శనానికి రావాలని టీటీడీ విస్తృత ప్రచారం మొదలుపెట్టింది. జనవరి 2 నుంచి 8 వరకు ఆఫ్ లైన్‌లో సర్వదర్శనం కోసం అనుమతిస్తామని ప్రకటనలో వెల్లడించింది.

శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను, నడిచి వచ్చే భక్తులను ఉద్దేశించి సోషల్ మీడియా, దిన పత్రికల్లో టీటీడీ ప్రకటనలు సైతం ఇచ్చింది. అలాగే, గోవింద మాల ధరించిన భక్తులకు కూడా సర్వదర్శనం అనుమతిలేదని తెలిపింది. ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో భక్తులకు తెలిసేలా విస్తృత ప్రచారం చేస్తున్నామని టీటీడీ ఈవో తెలిపారు. కాగా, గత ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆఫ్ లైన్‌లో టికెట్లు కేటాయింపు ద్వారా తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆరుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.

అయితే, వైకుంఠ ఏకాదశి రోజున తమకు స్వామి వారి దర్శనాన్ని దూరం చేస్తున్నారని ఆన్‌లైన్‌పై అవగాహన లేని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని ఇలా ఆంక్షలు, టికెట్లు ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. టీటీడీ చర్యలపై భక్తులు మండిపడుతున్నారు.



