breaking news
vykunta ekadashi
-
TTD: కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ ప్రక్రియ
సాక్షి, తిరుపతి: వైకుంఠ ఏకాదశి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపటి నుంచి(డిసెంబర్ 23) పది రోజులపాటు వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతిస్తారు. వైకుంఠ ద్వార దర్శనం Vaikunta Dwara Darshan కోసం టోకెన్లను నేటి మధ్యాహ్నాం నుంచి కేటాయించాలని టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే భక్తులు భారీగా తరలి రావడంతో.. కాస్తంత ముందుగానే నిన్న అర్ధరాత్రి నుంచే మొదలుపెట్టింది. శుక్రవారం ఉదయం అలిపిరి వద్ద వైకుంఠ ఏకాదశి రద్దీ కనిపిస్తోంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సప్తగిరులను సర్వాంగ సుందరంగా అలంకరించారు. వైకుంఠ ద్వారా దర్శనం కోసం.. తిరుపతిలోని 90 కౌంటర్లలో 4 లక్షల వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు ఇవ్వనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. రాత్రంత టోకెన్ కేంద్రాల వద్ద జాగారం చేశారు. దీంతో అధికారులు టోకెన్ల జారీ ప్రక్రియ మొదలుపెట్టారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రెండురోజులకు సంభందించిన టోకన్లు కోటా త్వరగతినే పూర్తైంది. మొత్తం 4,23,500 వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు పూర్తి అయ్యేవరకు నిరంతరాయంగా జారీ చేయనుంది టీటీడీ. టికెట్లు ఇచ్చేది ఈ కేంద్రాల్లోనే.. 1. విష్ణునివాసం, 2. శ్రీనివాసం, 3. గోవిందరాజస్వామి సత్రాలు, 4. భూదేవి కాంప్లెక్స్, 5. రామచంద్ర పుష్కరిణి 6. ఇందిరా మైదానం, 7. జీవకోన హైస్కూల్, 8. బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, 9. ఎంఆర్ పల్లిలోని జెడ్పీ హైస్కూల్ టోకెన్ల కేటాయింపు కేంద్రాల వద్ద ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రతతో పాటు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసింది టీటీడీ. వైరస్ వ్యాప్తి కారణంగా మాస్క్ ధరించాలని టీటీడీ ఇప్పటికే భక్తులకు సూచిస్తోంది. భక్తులకు ఆహారం, నీటి సౌకర్యంతో ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసింది. భక్తులు సంయమనం పాటించాలి వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ పెరుగుతోంది. వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల జారీ కేంద్రాలకు సైతం భక్తులు ముందుగానే తరలి వచ్చారు. రద్దీ నేపథ్యంలో అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద జారీ చేసే టికెట్ కేంద్రాన్ని పరిశీలించారు అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి. భక్తులు సంయమనం పాటించాలని కోరుతున్నారు. రేపు వైకుంఠ ఏకాదశి రేపు వైకుంఠ ఏకాదశి. శనివారం వేకువజామున 1.45 గంటల నుంచి వైకుంఠ ద్వారదర్శనాన్ని ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. కాగా, ఎల్లుండి 24న ద్వాదశి. వైకుంఠ ఏకాదశి నాడు స్వర్ణ రథం, ద్వాదశి నాడు శ్రీవారి పుష్కరిణి లో చక్రస్నానం నిర్వహిస్తారు. రేపటి నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. జనవరి 1వ తేదీతో వైకుంఠ ద్వార దర్శనం ముగుస్తుంది. వీఐపీలకు సూచన వైకుంఠ ద్వారా దర్శనం కోసం.. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ ఉంటేనే దర్శనానికి అనుమతిస్తారు. లేకుంటే లేదు. అలాగే.. దర్శనం స్లాట్ సమయానికి 24 గంటల ముందు మాత్రమే తిరుమలకు అనుమతిస్తారు. దర్శనం టోకెన్, టిక్కెట్టు ఉన్నవారికి అద్దెగది కేటాయిస్తారు. ఇక స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే వీఐపీ దర్శనాలు ఉంటాయి. సిఫార్సు లేఖలు రద్దు చేశారు. అలాగే.. తిరుమలలో వసతి కొరత కారణంగా తిరుపతిలోనే వసతి ఏర్పాట్లు చేసుకోవాలని వీఐపీలకు టీటీడీ సూచిస్తోంది. కాకపోతే దర్శన టోకెన్ ఉన్నవాళ్లకు తిరుమలలో వసతి కేటాయింపు చేస్తోంది. కొనసాగుతున్న రద్దీ.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. గురువారం 59,868 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే.. 23,935 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.91 కోట్లుగా లెక్క తేలింది. వైకుంఠ ఏకాదశి దృష్ట్యా ఇవాళ్టి దర్శనానికి టోకెన్ల జారీ రద్దు చేసింది టీటీడీ. -
ఇల వైకుంఠానికి పోటెత్తిన భక్తజనం
సాక్షి, తిరుమల: ఇల వైకుంఠం తిరుమలక్షేత్రంలో ఆదివారం వైకుంఠ ఏకాదశి పర్వదినం వైభవంగా సాగింది. ముక్కోటి దర్శనం కోసం అంచనాలకు మించి భక్తులు పోటెత్తారు. క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. క్యూలైన్లలోకి భక్తులు వెళ్లే సమయంలో తోపులాటలు జరిగాయి. గతేడా ది 2,800 వీఐపీ టికెట్లు కేటాయించగా.. ఈ ఏడాది వాటిని 4,200లకు పెంచారు. అర్ధరాత్రి తర్వాత వీఐపీలకు శ్రీవారి దర్శనం కల్పించారు. తర్వాత 4.09 గంటకు సామాన్య భక్తులను అనుమతిం చారు. ముక్కోటి దర్శనానికి వచ్చే భక్తులను తొలుత 54 కంపార్ట్మెంట్లలోకి అనుమ తించారు. తర్వాత నారాయణగిరి ఉద్యావనంలో 16 తాత్కాలిక కంపార్ట్ మెంట్లలోకి, ఆలయ నాలుగుమాడ వీధుల్లోకి అనుమతించారు. వైకుంఠద్వార ప్రవేశంతో సామాన్య భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ వీధుల్లో.. గ్యాలరీల్లో తోపులాటలు ఆలయ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉండే భక్తుల మధ్య తోపులాటలు జరిగాయి. భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకురావటంతో రావడంతో భక్తులు కింద పడ్డారు. ముందస్తు ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు చవిచూసారు. సామాన్యులకే ప్రాధాన్యం: ఈవో సాంబశివరావు వైకుంఠ ఏకాదశిలో శ్రీవారి దర్శనాన్ని సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం ఇచ్చామని, అందుకు అనుగుణంగానే భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతించామని టీటీడీ ఈవో సాంబశివరావు చెప్పారు. అధిక సమయం సామాన్య భక్తులకు కేటాయించటం ఆనందంగా ఉందన్నారు. కంపార్ట్మెంట్లలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి తిరుమల శ్రీవారిని ఆదివారం తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్, చల్లా కోదండరామ్, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సభ్యుడు జస్టిస్ రవిబాబు, తమిళ నాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంతోష్కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మాల దర్శిం చుకున్నారు. వైకుంఠ ఏకాదశి శుభగడియల్లో స్వామివారిని దర్శించుకున్నారు.