ఆంధ్ర విశ్వవిద్యాలయంలో దిగజారుతున్న ప్రమాణాలు
సాక్షి, అమరావతి: శతాబ్ది ఉత్సవాల వేళ ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఖ్యాతి మసకబారుతోంది. ఏడాదిన్నరగా వర్సిటీ పాలకవర్గ నిర్ణయాలు రాజకీయాలకు, కార్పొరేట్లకు కొమ్ముకాసేలా ఉండడంతో ప్రాజెక్టులు చేజారే పరిస్థితి నెలకొంది. నిర్వహణ లోపం అక్కడితో ఆగకుండా లక్షలాది విద్యార్థులకు డిగ్రీలు అందిస్తున్న ‘దూర విద్య’ వ్యవస్థనూ కలుషితం చేస్తోంది. ఈ విధానంలో పీజీ, యూజీ పరీక్షల షెడ్యూల్ ప్రకటించి నెల కావొస్తోంది. రాష్ట్రంలోని 80 సెంటర్లలో వచ్చే మంగళవారం (25వ తేదీ) నుంచి పరీక్షలు జరగనున్నాయి. దాదాపు పది రోజుల ముందే ప్రశ్నపత్రాలు కేంద్రాలకు చేరాల్సి ఉన్నా ఇంకా తయారవుతూనే ఉన్నాయి. దీంతో రెండు, మూడు రోజుల్లో పేపర్లు సెట్ చేసి, ముద్రించి సీల్డ్ కవర్లలో పంపడం సాధ్యమేనా అని అనుమానాలు కలుగుతున్నాయి.
చేతులు మారిన నిర్వహణ
గతంలో ప్రశ్నపత్రాల రూపకల్పన నుంచి మూల్యాంకనం వరకు దూరవిద్య కేంద్రంలోనే ‘కాన్పిడెన్షియల్ సెక్షన్’ ద్వారా పరీక్షలు నిర్వహించేవారు. ఈసారి బాధ్యతను రెగ్యులర్ ఎగ్జామినేషన్ కేంద్రానికి అప్పగించారు. ఎన్నడూ లేనివిధంగా, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా సైన్స్ విద్యార్థుల హాజరును పట్టించుకోకుండా పరీక్షలకు అనుమతించారు. హాజరు లేదని ప్రాక్టికల్స్‌కు రానీయలేదు. థియరీ పరీక్షలకు మాత్రం అనుమతిస్తుండడం గమనార్హం. ఏయూ క్యాలెండర్ ఇయర్, అకడమిక్ ఇయర్‌లలో రెండుసార్లు దూరవిద్య ప్రవేశాలు కల్పిస్తోంది. 50–60 వేల ప్రవేశాలు నమోదవుతుంటాయి. ప్రస్తుతం యూజీ, పీజీ అన్ని సంవత్సరాల వారు కలిపి 90 వేల మంది పరీక్షలు రాయనున్నారు.
వీరిలో అధికులు పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే. చాలామంది వివిధ రంగాల్లో ఉపాధి పొందుతూ చదువుకుంటున్నారు. పరిస్థితుల రీత్యా ఒకేసారి పరీక్షలకు హాజరవలేరు. కానీ, వీరి నుంచి నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశ రుసుముతో పాటు పరీక్ష ఫీజు వసూలు చేస్తున్నారు. ఇది వారిపై ఆరి్థక భారాన్ని మోపుతోంది. దీనికితోడు ఇప్పుడు పరీక్షలు ఉంటాయో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ఏయూ క్యాంపస్‌లో 5 వేల మంది ఉంటే దూర విద్యలో లక్షలమంది చదువుతున్నారు. ఏటా ప్రవేశాలతో రూ.40కోట్ల నుంచి రూ.50 కోట్ల ఆదాయం వస్తోంది.
అలాంటి వ్యవస్థను దెబ్బతీసి కార్పొరేట్లకు మేలు చేసేలా కుట్రలు జరుగుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. కాగా, దూరవిద్యలో ప్రవేశాలను ఆయా సెక్షన్లు స్రూ్కటినీ చేయాలి. కానీ, విద్యార్థుల డేటాను బయటి వ్యక్తుల చేతుల్లో పెడుతూ స్రూ్కటినీని బయటి వ్యక్తులతో చేయించడం గమనార్హం. ఇదంతా చూస్తూ విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో నిబంధనలు పాటించలేదని రాష్ట్రంలోని ఓ వర్సిటీ దూరవిద్య సైన్స్ కోర్సులను యూజీసీ నిలిపివేసిందని, ఏయూపైనా అలాంటి చర్యలే తీసుకుంటే ప్రతిష్ఠ దెబ్బతింటుందని వాపోతున్నారు.
షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు
దూరవిద్యలో షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు ఉంటాయి. రాత్రింబవళ్లు పనిచేసైనా ప్రశ్నపత్రాలు తయారు చేసి పంపిస్తాం. తయారీ బాధ్యత మాకు లేనందునే మరింత వెసులుబాటుతో పని చేస్తున్నాం. నేను బాధ్యతలు తీసుకున్నాక జరుగుతున్న పరీక్షలివి. హాజరు లేని సైన్స్ విద్యార్థులు తక్కువమంది ఉన్నారు. అందుకే ప్రాక్టికల్స్‌కు అనుమతించకున్నా థియరీ పరీక్షలు రాసేందుకు అనుమతించాం. – ఆచార్య అప్పలనాయుడు, ఏయూ దూరవిద్య డైరెక్టర్


