తరగతి గదిలో అల్లరి చేస్తున్నాడని, తోటి విద్యార్థులను కొడుతున్నాడంటూ.. కిండర్ గార్టెన్ (కేజీ) చదువుతున్న ఐదేళ్ల చిన్నారికి ఒక ఉపాధ్యాయిని విధించిన అత్యంత క్రూరమైన శిక్ష నివ్వెరపరిచింది. చిన్నారి టీ–షర్ట్‌కు తాడు కట్టి, పాఠశాల ఆవరణలోని ఒక చెట్టు కొమ్మకు వేలాడదీసింది. ఎవరో ఈ దృశ్యాన్ని రహస్యంగా వీడియో తీయడంతో, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అభం శుభం తెలియని ఆ పసివాడు గాలిలో వేలాడుతూ భయంతో వణికిపోతుండగా, పక్కనే ఉన్న మరో మహిళ ఆ ఉపాధ్యాయినికి మద్దతుగా మాట్లాడటం వీడియోలో కనిపించింది. చత్తీస్‌గఢ్ రాష్ట్రం సూరజ్‌పూర్ జిల్లా రామానుజ్ నగర్ బ్లాక్, నారాయణ్‌పూర్ గ్రామంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఈ దారుణం జరిగింది.
In a disturbing incident, a five-year-old boy in #Chhattisgarh's #Surajpur district was allegedly subjected to a brutal punishment by his school teachers. pic.twitter.com/7cLw5XFQuw
— Hate Detector 🔍 (@HateDetectors) November 25, 2025
సోమవారం ఈ వీడియో క్లిప్ వెలుగులోకి రావడంతో, విద్యాశాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. పాఠశాల యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి అజయ్ మిశ్రా ఆదేశించారు. వివరణ అందిన తర్వాత నియమ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రాథమిక నివేదిక ఆధారంగా, సదరు ఉపాధ్యాయినిని తక్షణమే విధుల నుంచి తొలగించారు. అయితే, పాఠశాల డైరెక్టర్ సుభాష్ శివహారే మాత్రం ఈ చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ‘ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ లేను. కానీ ఉపాధ్యాయిని.. బాలుడిని బెదిరించడానికి మాత్రమే టీ–షర్ట్‌తో చెట్టుకు వేలాడదీయడానికి ప్రయత్నించింది.
తరగతి గదిలో పిల్లలు ఇతరులను కొడుతున్నందున, వారిని క్రమశిక్షణలో పెట్టడానికి మాత్రమే ఈ ప్రయత్నం జరిగింది’.. అని విలేకరులకు వివరణ ఇచ్చారు. ఈ సంఘటనపై మానవ హక్కుల సంఘాలు, బాలల హక్కుల పరిరక్షణ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.


