ప్రభుత్వ ఆదేశాలతో ఉన్నత విద్యామండలి కసరత్తు
వర్సిటీలు వెనుకబడటంపై దృష్టి
ఎన్‌ఐఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు విధానంలో లోపాలున్నట్టు గుర్తింపు
వర్సిటీకి ఇద్దరు చొప్పున అవగాహన కల్పించాలని నిర్ణయం
ప్రత్యేక కన్సల్టెన్సీ ఏర్పాటు.. 21న అవగాహన సదస్సు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు జాతీయ ర్యాంకుల సాధనలో ముందుండేలా చేయడంపై ఉన్నత విద్యా మండలి దృష్టి పెట్టింది. ఇతర అంశాలు పక్కన పెడితే అసలు దరఖాస్తు విధానంలోనే లోపం ఉందని గుర్తించి, వాటిని సరి చేసేందుకు నడుం బిగించింది. ప్రభుత్వ ఆదేశాలతో వాస్తవానికి దీనిపై గత కొంతకాలంగా ఉన్నత విద్యామండలి కసరత్తు చేసింది.
నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) ర్యాంకుల్లో వర్సిటీలు ఎందుకు వెనుకబడ్డాయో గుర్తించింది. దరఖాస్తు విధానంలో లోపాలను అధిగమించేందుకు ప్రతి యూనివర్సిటీ నుంచి ఇద్దరికి దీనిపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకు ప్రక్రియలో కీలక భూమిక పోషించే నోడల్ అధికారితో పాటు మరో వ్యక్తిని అవగాహన కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలని భావిస్తోంది. దీనికోసం ఓ కన్సల్టెన్సీని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఈ నెల 21వ తేదీన మండలి కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ తెలిపారు.
ర్యాంకుల్లో వర్సిటీల వెనుకబాటు
రాష్ట్రంలో వ్యవసాయ యూనివర్సిటీ సహా మొత్తం 13 విశ్వవిద్యాలయాలున్నాయి. ప్రతి సంవత్సరం ప్రకటించే జాతీయ ర్యాంకుల్లో ఇవి వెనుకబడుతున్నాయి. వందేళ్ళ చరిత్ర ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాయానికి ఎన్‌ఐఆర్‌ఎఫ్ ఓవరాల్ విభాగంలో 2022లో 46వ ర్యాంకు వస్తే, 2023లో ఇది 64కు 2024కు 70కి పడిపోయింది. అయితే 2025లో 53వ ర్యాంకు సాధించడం కాస్త ఊరట కల్గించే అంశం. టాప్–100 యూనివర్సిటీల ర్యాంకులో 2022లో 22వ ర్యాంకు దక్కించుకున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం 2025లో 30కి పడిపోయింది.
సాంకేతిక విద్యకు కీలకమైన జేఎన్‌టీయూహెచ్ ఓవరాల్ ర్యాంకుల్లో అసలు పోటీలోనే లేకపోవడం గమనార్హం. కాగా టాప్–100లో గత ఏడాది వందో ర్యాంకు దక్కించుకుంది. మిగతా వర్సిటీల్లో చాలావరకూ ఏమాత్రం పోటీ పడలేకపోతున్నాయి. అదే సమయంలో ప్రైవేటు విద్యా సంస్థలు జాతీయ ర్యాంకుల సాధనలో దూసుకుపోతున్నాయి. ఈ ర్యాంకులకు విస్తృతంగా ప్రచారం కల్పించి, సీట్లకు డిమాండ్ పెంచుకుంటున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది.
దరఖాస్తులోనే లోపం
అన్ని యూనివర్సిటీల్లోనూ బోధకుల కొరత ఉంది. 70 శాతం వరకు కాంట్రాక్టు అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్నాయి. దీంతో నాణ్యత ప్రమాణాలు దెబ్బతింటున్నాయనేది వీసీల వాదన. ఓయూకు గత కొన్నేళ్ళుగా కేంద్ర సంస్థల నుంచి రావాల్సిన ప్రాజెక్టులు 50 శాతం మేర పడిపోయాయి. ప్రొఫెసర్ల కొరత కారణగా పీహెచ్‌డీలూ తగ్గుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకుకు దరఖాస్తు చేసే విషయంలో యూనివర్సిటీలు సరైన అవగాహనతో వ్యవహరించడం లేదు.
విశ్వవిద్యాలయంలో మూడేళ్ళుగా విద్యార్థుల చేరిక, ఇతర దేశాల విద్యార్థుల సంఖ్య, ఫ్యాకల్టీ, విద్యార్థుల మార్కులు, ఉపాధి అవకాశాలు, అక్కడ జరుగుతున్న పరిశోధనలు ఇలా అనేక అంశాలను ర్యాంకులకు కొలమానంగా తీసుకుంటారు. వీటిని సరైన ఫార్మాట్‌లో, సరైన డేటాతో పంపడంలో వర్సిటీలు దృష్టి పెట్టడం లేదు. ప్రధానంగా ఈ కారణంతోనే ర్యాంకుల్లో వెనుకబడిపోతున్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వర్సిటీలకు అవగాహన పెంపొందించాలని నిర్ణయించారు.
ప్రమాణాలకు ర్యాంకులే గీటురాయి
రాష్ట్ర వర్సిటీల ప్రమాణాలకు జాతీయ ర్యాంకులే గీటురాయి. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లో ముందుకు వెళ్ళాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనికి అనుగుణంగానే మరింత అవగాహన కల్పించేందుకు కన్సల్టెన్సీ సంస్థను ఏర్పాటు చేశాం. ఫిబ్రవరిలోగా వర్సిటీలు ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకు కోసం సరైన పద్ధతిలో దరఖాస్తు చేయాలి. ఈ మేరకు అవసరమైన డేటాను పొందుపర్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి (ఉన్నత విద్యా మండలి చైర్మన్)
రీసెర్చ్ డెవలప్‌మెంట్‌పై ఎన్‌ఐఆర్‌ఎఫ్ దృష్టి
ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకుల సాధనంలో రీసెర్చ్ డెవలప్‌మెంట్ అనేది ముఖ్యం. విశ్వవిద్యాలయాల్లో జరిగే పరిశోధనలు, పబ్లిషింగ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి విద్యార్థులు ఎంత మంది చదువు కోసం ఆయా వర్సిటీలకు వస్తున్నారనేది కూడా చూస్తారు. టీచింగ్, లెరి్నంగ్ విధానాలపైనా దృష్టి పెడతారు. ప్రస్తుతం ప్రభుత్వం భారీగా నిధులు ఇవ్వడానికి సిద్ధమవ్వడం, ఫ్యాకల్టీ కొరత తీరుస్తామని హామీ ఇస్తుండటంతో భవిష్యత్‌లో ఓయూ ర్యాంక్ పెరుగుతుందని ఆశిస్తున్నాం.
– ప్రొఫెసర్ కుమార్ మొలుగరం (వీసీ, ఓయూ)


