మంత్రి ఒం‘టెట్టు’ పోకడ | Confusion over implementation of in service TET cancellation guarantee | Sakshi
Sakshi News home page

మంత్రి ఒం‘టెట్టు’ పోకడ

Nov 23 2025 5:04 AM | Updated on Nov 23 2025 5:04 AM

Confusion over implementation of in service TET cancellation guarantee

మాటిచ్చి మం‘టెట్టే’!

ఇన్‌ సర్వీస్‌ టెట్‌ రద్దు హామీ అమలుపై గందరగోళం

ఇప్పటివరకు ‘సుప్రీం’లో అప్పీలుకు వెళ్లని బాబు సర్కారు 

చినబాబు హామీతో టెట్‌కు దరఖాస్తు చేయని ఉపాధ్యాయులు  

ఇన్‌సర్వీస్‌ అర్హులు 1.62 లక్షల మంది.. దరఖాస్తు చేసింది 25 వేల మందే 

రెగ్యులర్‌ దరఖాస్తులు 2.34 లక్షలు

నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

ఆర్టీఈ–2009 చట్టం సవరణ లేకుండా ఇన్‌సర్వీసు టెట్‌ రద్దు అసాధ్యమంటున్న నిపుణులు  

చట్ట సవరణ కోసం కేంద్రంపై ఒత్తిడి చేయని కూటమి సర్కారు

‘‘ఎమ్మెల్సీల విజ్ఞప్తి మేరకు ఇన్‌ సర్వీస్‌ టెట్‌ (టీచర్‌ఎలిజిబులిటీ టెస్ట్‌)పై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేస్తాం. రద్దుకు కృషి చేస్తామని హామీ ఇస్తున్నాను’’ గత నెల 28న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ చేసిన ప్రకటన ఇది. ఈ హామీ ఇచ్చి దాదాపు నెలవుతోంది. టెట్‌ దరఖాస్తు గడువు నేటితో ముగుస్తోంది. మంత్రి హామీతో పరీక్షకు అర్హులైన టీచర్లు దరఖాస్తు చేసుకోలేదు. ఇప్పుడు అప్పీల్‌ కాదుగదా.. కనీసం ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగించే నిర్ణయం కూడా తీసుకోలేదు. ఫలితంగా ఉపాధ్యాయులు  ఇరకాటంలో పడ్డారు. 

సాక్షి, అమరావతి: ఉపాధాయుల అర్హత పరీక్ష (టెట్‌)కు ఇన్‌సర్వీస్‌ టీచర్ల నుంచి స్పందన అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. గతనెల 23న విద్యాశాఖ టెట్‌ నిర్వహణకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆదివారం (నేటి)తో దరఖాస్తు గడువు ముగియనుంది. 

అయినా ఇన్‌ సర్వీస్‌ టీచర్ల టెట్‌ దరఖాస్తులు 26 వేలు దాటలేదు. వాస్తవానికి 2011కి ముందు టెట్‌ లేకుండా డీఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు 1.62 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు వీరిలో కేవలం 25 వేల మంది మాత్రమే అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. రెగ్యులర్‌ టెట్‌ దరఖాస్తులు 2.34 లక్షలు రాగా, ఇన్‌ సర్వీస్‌ దరఖాస్తులు మాత్రం 25 వేలు మాత్రమే వచ్చాయి. 

ఉపాధ్యాయుల్లో ఆందోళన
ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ తప్పనిసరి చేస్తూ సెప్టెంబర్‌ 1న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అప్పటి నుంచి ఇది సరైన విధానం కాదని, దీనిపై రివ్యూ పిటిషన్‌ వేయాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు. రెండు మూడు దశాబ్దాలుగా వృత్తిలో ఉన్నవారికి ఇప్పుడు పరీక్ష నిర్వహించడం సరికాదని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రికి ఉపాధ్యాయ సంఘాలు విన్నపాలు చేశాయి. 

అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలూ స్వయంగా మంత్రిని కలిసి టెట్‌ నిలిపివేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయితే, వాటిని పట్టించుకోని మంత్రి లోకేశ్‌ గతనెల 28న తమ పార్టీ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీలు కోరిక మేరకు ఇన్‌ సర్వీస్‌ టెట్‌పై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయ­నున్నట్టు ప్రకటించారు. దీంతో ఉపా«­ద్యాయులు తాజా టెట్‌కు దరఖాస్తు చేయ­లేదు. ఇప్పటికే పలు ఉపాధ్యాయ సంఘాలు ఇన్‌ సర్వీస్‌ టెట్‌పై ‘సుప్రీం’ను ఆశ్రయించాయి. 

అటు తమిళనాడు, కర్ణాటకతోపాటు పలు ఉత్తరాది రాష్ట్రాలు సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్లు వేయడంతోపాటు ఆర్టీఈ–2009 చట్ట సవరణ కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టుకు అప్పీల్‌ చేయలేదు. దీనిపై అనుమానాలు వ్యక్త­మవుతున్నాయి. దీంతో పరీక్షపై ఉపాధ్యా­యుల్లో ఆందోళన నెలకొంది.

1.30 లక్షల మంది టీచర్లపై తీవ్ర ప్రభావం
రాష్ట్రంలో అన్ని మేనే­జ్‌మెంట్‌ పాఠశాలల్లోనూ దాదా­పు 3 లక్షల మంది ఉపా­ధ్యాయులు సేవలు అందిస్తు­న్నారు. ప్రధానంగా ప్ర­భు­త్వ పాఠశాలల్లో 2.09 లక్షల మంది ఉ­న్నారు. రాష్ట్రంలో 2008 వరకు జరిగిన డీఎ­స్సీలకు టెట్‌ లేదు. అంతకు ముందు విధుల్లో చేరిన 1.62 లక్షల మంది ప్రభుత్వ టీచర్లకు టెట్‌ లేకుండానే సేవలందిస్తున్నారు. 

పిల్లల ఉచిత నిర్బంధ విద్యా హక్కు (ఆర్టీఈ)చట్టం–2009, నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ నిబంధనల ప్రకారం ఉపాధ్యా­యులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష తప్పనిసరి అని సెప్టెంబర్‌ 1న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రాష్ట్రంలోని అన్ని మేనేజ్‌మెంట్‌ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధిస్తున్న ఉపా­ధ్యాయులకు తప్పని­సరిగా టెట్‌ ఉండాలని ఆదేశించింది. నాటి నుంచి ఉపా­ధ్యాయులు దీనిపై రివ్యూ పిటిషన్‌ వే­యా­లని విజ్ఞప్తి చే­స్తున్నా ప్ర­భుత్వం పట్టించు­కోకుండా గత­నెలలో టెట్‌కు నోటి­ఫికేషన్‌ ఇచ్చింది. 

ఈమేరకు టీచర్‌ ఎలి­జిబులిటీ టెస్ట్‌ (ఏపీ టెట్‌) నిర్వహణకు విధివిధానాలు, సిలబస్, పరీక్ష తీరు తెన్నులతో కూడిన మార్గ­దర్శకాలను విడుదల చేసి నవంబర్‌ 23 చివరి తేదీగా నిర్దేశించింది. ఈ క్రమంలో మంత్రి లోకేశ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేస్తామని చెప్పడంతో ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు పరీక్ష ఉండదని అంతా భావించారు. 

కానీ సుప్రీంలో పిటిషన్‌ వేయకపోవడంతో ఇప్పుడు 1.62 లక్షల మందిలో ఐదేళ్లలో రిటైరయ్యే 32 వేల మంది ఉపాధ్యాయులు మినహా మిగిలిన 1.30 లక్షల మంది పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరుగాకుండా ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్న మరో 50 వేల మందీ పరీక్ష రాయాల్సి వస్తుందని అంచనా.  

చట్ట సవరణపై స్పందించని ప్రభుత్వం
దేశంలో 2011కి ముందు సర్వీసులో చేరిన ఉపాధ్యాయులు టెట్‌ పూర్తిచేయాలా వద్దా, మైనార్టీ స్కూళ్లలోని టీచర్లకు ఈ నిబంధన వర్తిస్తుందా లేదా అనే అంశంపై వివిధ రాష్ట్రాల హైకోర్టులు భిన్నమైన తీర్పు­నిచ్చినట్టు నిపుణులు చెబు­తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో వాట­న్నింటికీ తెరపడింది. అన్ని యాజమాన్య పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు టెట్‌ తప్పనిసరి చేయడంతోపాటు 2011కి ముందు సర్వీసులో చేరిన వారికీ ఈ నిబంధన వర్తిస్తుందని సుప్రీం పేర్కొంది. 

ఈ తీర్పును పదోన్నతులు, నియామకాలకు ముడిపెట్టింది. ఈ తీర్పుపై పలు రాష్ట్రాలు రివ్యూ పిటిషన్లు వేయడంతోపాటు ఆర్టీఈ–2009 చట్ట సవరణ కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. చట్ట సవరణతోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని, దీనిపై కేంద్రంపై ఒత్తిడి తేవాలని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 

కానీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ అంశాలను పూర్తిగా విస్మరించి టెట్‌ నిర్వహణకు సిద్ధమైంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. సుప్రీం తీర్పుపై కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఏంటో సమీక్షించకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వు ఇచ్చిన వెంటనే టెట్‌ నిర్వహణకు పూనుకోవడం ఏమిటని నిలదీస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement