సాక్షి, తాడేపల్లి: రాయలసీమ ప్రాజెక్టులపై చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాగు నీటి ప్రాజెక్టులన్నీ చంద్రబాబు మూలనపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చేసిన పనులకు బిల్లులు మంజూరు చేశారు. కమీషన్ల కోసమే రూ.8 వేల కోట్ల బిల్లులు ఇచ్చారు. అంతే తప్ప ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయలేదు’’ అని సతీష్‌రెడ్డి పేర్కొన్నారు.
‘‘2020లోనే రాయలసీమ లిఫ్టు ప్రాజెక్టు ఆగిపోయిందని మంత్రి రామానాయుడు అబద్దాలు చెప్తున్నారు. మీ ప్రభుత్వం దగ్గరే ఉన్న ఎంబుక్‌లూ చెక్ చేసుకుంటే మంత్రికి వాస్తవాలు తెలుస్తాయి. గతంలో జరిగిన పనులకు కమీషన్ల కోసం బిల్లులు మంజూరు చేశారే తప్ప ప్రాజెక్టుల నిర్మాణం కోసం కాదు. కమీషన్లు తీసుకుని రూ.8 వేల కోట్లు రిలీజ్ చేశారు. రూ.1100 కోట్లతో కుప్పం వరకు నీటిని తీసుకెళ్లే పని జగన్ ప్రారంభిస్తే దాన్ని కూడా చంద్రబాబు ఆపేశారు. మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందకుండా చేశారు. దీనివలన చంద్రబాబు నియోజకవర్గం కుప్పం కూడా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుంది’’ అని సతీష్‌రెడ్డి నిలదీశారు.
‘‘తెలంగాణ కృష్ణా జలాలను తరలించుకు పోతుంటే.. చంద్రబాబు ఎందుకు పట్టించుకోవటం లేదు?. 800 అడుగుల్లో ఉన్న నీటినే తెలంగాణ తీసుకెళ్తోంది. మరి రాయలసీమ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి?. చంద్రబాబుకు రాయలసీమ మీద ఏమాత్రం ప్రేమ లేదు. కొన్ని దశాబ్ధాలుగా దుర్భిక్షం అనుభవిస్తున్న రాయలసీమ మీద వైఎస్సార్, జగన్ ప్రేమ కనపరిచారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను 44 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచిన నేత వైఎస్సార్. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాటలతో చంద్రబాబు కుట్ర బయట పడింది’’ అని సతీష్‌రెడ్డి దుయ్యబట్టారు.
‘‘రేవంత్ చెప్పింది అబద్దమైతే చంద్రబాబు ఎందుకు ఖండించలేదు?. చంద్రబాబు అసమర్థత వలనే రాయలసీమ ప్రాజెక్టులు ఆగిపోయాయి. చంద్రబాబు వెంటనే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. ప్రజల అభీష్టం కూడా తెలుసుకోవాలి. హెచ్ఆర్‌ఎస్ఎస్ కాలువ లైనింగ్ పనులు తప్ప ఈ ప్రభుత్వంలో ఇంకేమీ జరగటం లేదు. ఆ లైనింగ్ పనులను ఆపాలని రైతులు కోరినా పట్టించుకోవటం లేదు. లైనింగ్ చేస్తే భూగర్భ జలాలు అందవని రైతులు వాపోతున్నారు’’ అని సతీష్‌రెడ్డి చెప్పారు.


