తిరుపతి తుడా: నియోజకవర్గ ఎమ్మెల్యే, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తీరుపై జన సేన కార్య కర్తలు కన్నెర్ర చేశారు. సీనియర్లకు పార్టీ పదవుల్లో మొండి చేయి చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పదవుల్లో దశాబ్ద కాలం పాటు పనిచేసిన సీనియర్లను కాదని ఇతర పార్టీల నుంచి వలస వచ్చినవారికి పెద్దపీట వేస్తారా? అని మండిపడ్డారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ పనికట్టుకుని సర్వనాశనం చేస్తున్నారంటూ దుమ్మెత్తి పోశారు. జనసేన తిరుపతి డివిజన్‌లో క్లస్టర్ ఇన్‌చార్జ్‌ల నియామకం ఎమ్మెల్యే ఇంటి వద్ద మంగళవారం రహస్యంగా నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఆ పార్టీ సీనియర్లు ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకొని రచ్చరచ్చ చేశారు. విషయం పెద్దది కావడంతో ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు అక్కడి నుంచి జారుకున్నారు.
క్లస్టర్ ఇన్‌చార్జ్‌లుగా 20 మంది
తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లకు సంబంధించి క్లస్టర్ ఇన్‌చార్జ్‌ల నియామకాన్ని జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అత్యంత గోప్యంగా చేపట్టారు. పార్టీ సీనియర్లతో కనీసం చర్చించకుండా, సమాచారం కూడా ఇవ్వకుండా 20 మంది క్లస్టర్ ఇన్‌చార్జ్‌లను ఖరారు చేశారు. కొందరికి రెండు, కొందరికి మూడు డివిజన్ల చొప్పున క్లస్టర్ ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. వివిధ పారీ్టల నుంచి ఎన్నికల ముందు జనసేనలోకి ఫిరాయించిన వారికి, ఎమ్మెల్యేకు ఊడిగం చేస్తున్న వ్యక్తులకే పదవులు ఇచ్చారంటూ పార్టీ సీనియర్లు మండిపడుతున్నారు. 20 మంది క్లస్టర్ ఇన్‌చార్జ్‌ల్లో 15 మంది కొత్త ముఖాలకే పదవులు ఇచ్చారని వాపోయారు.
పార్టీని నాశనం చేస్తున్న ఎమ్మెల్యే
తిరుపతిలో జనసేన పార్టీని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సర్వనాశనం చేస్తున్నారని ఆయనకు జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ వత్తాసు పలుకుతున్నాడని పలువురు జనసేన నేతలు ఆరోపించారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఇంటి వద్ద సీనియర్లు తిట్ల దండకంతో రచ్చ రచ్చ చేశారు. ఎమ్మెల్యే పదవీకాలం ముగిస్తే చిత్తూరుకి పారిపోయే వ్యక్తి తిరుపతిలో పార్టీ ఉనికి లేకుండా చేసేందుకు కుట్ర పన్నుతున్నారని దుయ్యబడ్డారు. రాబోయే ఎన్నికల ముందు పార్టీలు మారబోయే వారికే జనసేనలో ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. పార్టీ బలోపేతానికి, తిరుపతి అభివృద్ధికి ఏనాడు ఎమ్మెల్యే కృషి చేయలేదని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే వ్యవహార శైలిపై పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేసేందుకు పలువురు సీనియర్లు సిద్ధమవుతున్నారు. ఆయనతోపాటు పార్టీ అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ వ్యవహార శైలిపై, పార్టీని నిర్వీర్యం చేస్తున్న ఉదంతంపై తాము త్వరలో పవన్ కళ్యాణ్‌ను కలిసి వివరిస్తామని చెప్పారు.


