శతశాతం కోసం.. వేకప్ కాల్స్
‘హలో.. నేను మీ అబ్బాయి చదివే కళాశాల లెక్చరర్‌ని మాట్లాడుతున్నా మేడమ్... అబ్బాయి నిద్రలేచారా’ అంటూ ఉదయం 4 గంటలకే వేకప్ కాల్స్ ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు వస్తున్నాయి. పరీక్షల సమయం ఆసన్నం కావడంతో జిల్లాలోని పేరొందిన ప్రైవేట్, కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు ఎలాగైనా ఇంటర్‌లో శతశాతం ఫలితాలు సాధించాలనే తపనతో సరికొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టారు. వేకప్ కాల్స్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి విద్యార్థిని నిద్రలేపండి.. ఫలానా సబ్జెక్ట్‌ను రివిజన్ చేయమని చెప్పండి. కాసేపు విద్యార్థి వద్ద కూర్చొని సాధన చేయించండి అంటూ కాల్స్ చేస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను నిద్రలేపి అధ్యాపకుల సూచనలు పాటిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. ప్రైవేటు యాజమాన్యాలు ఇలా 20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకునికి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సమాచారం.
– తిరుపతి సిటీ


