
సాక్షి, హైదరాబాద్: సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల వ్యవహారంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి భారీ ఊరట లభించింది. షేర్ల బదిలీ ప్రక్రియను నిలుపుదల చేస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT) హైదరాబాద్ ధర్మాసనం మంగళవారం తీర్పు ఇచ్చింది.
సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ నుంచి తన కుటుంబ సభ్యులు అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్నారని, ఈ ప్రక్రియ నిలిపివేయాలంటూ కిందటి ఏడాది సెప్టెంబర్‌లో వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. రిజిస్టర్‌లో వాటాదారుల పేర్లను సవరించి, తమ వాటాలను పునరుద్ధరించాలంటూ కోరారాయన.
జగన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘గిఫ్ట్’ పూర్తికాకుండానే మోసపూరితంగా వాటాల బదలాయింపు జరిగిందని తెలిపారు. వాటాల పత్రాలు, వాటాల బదలాయింపు ఫారాలు సమర్పిస్తేనే కంపెనీ వాటాలను బదలాయించాల్సి ఉందన్నారు. దీనికి విరుద్ధంగా కంపెనీ వాటాలను బదలాయించిందన్నారు. పిటిషన్‌లపై తుది తీర్పు వెలువడేవరకు బదలాయింపు ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని జగన్ తదితరులు కోరారు.
వైఎస్ జగన్ పిటిషన్‌పై పది నెలలపాటు విచారణ జరిగింది. ఎన్‌సీఎల్‌టీ జ్యుడిషియల్ సభ్యులు రాజీవ్ భరద్వాజ్, సాంకేతిక సభ్యుడు సంజయ్ పురీ విచారణ జరిపి రెండు వారాల కిందట తీర్పు రిజర్వ్ చేశారు. చివరకు.. జగన్ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన ట్రిబ్యునల్.. సీబీఐ, ఈడీ కేసులు విచారణలో ఉండగా బదిలీలు సాధ్యం కాదంటూ ఇవాళ తీర్పు వెల్లడించారు.