2023–24 రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచికలపై నీతి ఆయోగ్ నివేదిక
వైఎస్సార్‌సీపీ హయాంలో అభివృద్ధిపై ఖర్చు 65 శాతం పెరుగుదల
సామాజిక సేవల వ్యయం ఏకంగా 52.4 శాతం
విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, సాగునీరు, ఇంధన రంగాలకు పెద్దపీట
రాష్ట్ర సొంత ఆదాయంలో ఆరోగ్యకరమైన పెరుగుదల
ఐదేళ్లలో దాదాపు 48 శాతం వృద్ధి నమోదు
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన అభివృద్ధి, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యతతో కొనసాగిందని నీతి ఆయోగ్ కితాబు ఇచ్చింది. రాష్ట్ర వ్యయం నమూనా సంక్షేమ, మౌలిక సదుపాయాలపై బలమైన ప్రాధాన్యతకు నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో సొంత ఆదాయంలో ఆరోగ్యకరమైన పెరుగుదల ధోరణిని సూచించిందని నివేదిక తెలిపింది. 2023–24 రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచికలపై నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది.
రాష్ట్ర వ్యయం నమూనాను పరిశీలిస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చిందని.. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, సాగునీరు, ఇంధన రంగాలకు పెద్దపీట వేసిందని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఖర్చులలో ఎక్కువ భాగం జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు లాంటి తప్పనిసరి బాధ్యతలను నిర్వర్తిస్తూనే గత ప్రభుత్వం కీలక రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆదాయాలు ఆరోగ్యకరమైన పెరుగుదలను సూచించాయని, జీఎస్‌టీతోపాటు వస్తువుల పన్నులు పెరిగాయని నివేదిక పేర్కొంది.
» రెవెన్యూ, మూలధనం.. రెండూ కలిపి మొత్తం అభివృద్ధి వ్యయం వైఎస్ జగన్ పాలనలో గణనీయంగా పెరిగిందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. 2019ృ20లో మొత్తం అభివృద్ధి వ్యయం రూ.1.10 లక్షల కోట్లుగా ఉండగా 2023ృ24లో రూ.1.67 లక్షల కోట్లకు గణనీయంగా పెరిగినట్లు నివేదిక ప్రస్తావించింది. గత ప్రభుత్వంలో ఐదేళ్లలో మొత్తం దాదాపు 65 శాతం పెరుగుదల నమోదైందని నివేదిక స్పష్టం చేసింది. స్థిరమైన వృద్ధి ఆధారంగా సంక్షేమ రంగాలను బలోపేతం చేయడంపై గత ప్రభుత్వ ప్రాధాన్యతకు ఇది నిదర్శనంగా నిలుస్తోందని తెలిపింది.
» గత ప్రభుత్వంలో మూలధన వ్యయం జీఎస్‌డీపీలో 4 నుంచి 9 శాతం పరిధిలో ఉండటం ఆస్తుల సృష్టి, మౌలిక సదుపాయాల అభివృద్ధి వైపు స్థిరమైన పురోగతిని సూచిస్తోందని నివేదిక స్పష్టం చేసింది. 2023ృ24లో మొత్తం వ్యయంలో సామాజిక సేవల వ్యయం 52.4 శాతంతో అతి పెద్ద వాటాను కలిగి ఉందని పేర్కొంది. ఇది విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణ రంగాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోందని తెలిపింది. ఇక ఆర్థిక సేవలు 44.6 శాతం వాటాను కలిగి ఉండగా ప్రధానంగా రవాణా, నీటి పారుదల, ఇంధన రంగాలు పెట్టుబడుల ద్వారా పురోగమించాయని నివేదిక పేర్కొంది.
» 2023ృ24లో మొత్తం రెవెన్యూ వ్యయంలో దాదాపు 48.59 శాతం జీతాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్లు లాంటి తప్పనిసరి ఖర్చులకు కేటాయించినట్లు నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది.
» గత ప్రభుత్వంలో రాష్ట్ర సొంత ఆదాయంలో ఆరోగ్యకరమైన పెరుగుదల నమోదైంది. 2023ృ24లో మొత్తం ఆదాయ వసూళ్లలో దాదాపు 52 శాతం సొంత పన్నుల ద్వారానే సమకూరినట్లు వెల్లడించింది. ఇందులో వస్తు సేవల పన్నులు అత్యధికంగా 35.5 శాతం వాటా కలిగి ఉండగా తరువాత జీఎస్‌టీ 34.1 శాతం వాటాగా నమోదైంది.
» రాష్ట్ర సొంత ఆదాయం వైఎస్సార్‌సీపీ హయాంలో దాదాపు 48 శాతం వృద్ధిని నమోదు చేసిందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది.


