మృత్యుపాశంలో.. మూగజీవం | Wildlife survival in question | Sakshi
Sakshi News home page

మృత్యుపాశంలో.. మూగజీవం

Mar 17 2026 5:28 AM | Updated on Mar 17 2026 5:28 AM

Wildlife survival in question

ఒడిశా వేటగాళ్ల తూటాలకు బలవుతున్న వన్యప్రాణులు 

నాటు తుపాకులతో వేట 

అంతరించిపోతున్న అడవి గేదెలు 

 కానరాని పులుల జాడ 

 ప్రశ్నార్థకంగా వన్యప్రాణుల మనుగడ 

 అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు 

 మల్కన్‌గిరి అధికారుల సమన్వయంతో నిఘా

అటవీ చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా, నిఘా నీడన వేటగాళ్ల తుపాకులు గర్జిస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు వన్యప్రాణులతో కళకళలాడిన అడవులు ఇప్పుడు మూగబోతున్నాయి. వేసవి వేడికి తోడు, సరిహద్దు దాటి వస్తున్న వేటగాళ్ల ముఠాల కారణంగా అరుదైన జంతుజాలం అంతరించిపోతోంది. ముఖ్యంగా అల్లూరి జిల్లా కొయ్యూరు, మర్రిపాకలు అటవీ ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.  

కొయ్యూరు: అటవీ చట్టాలు అత్యంత కఠినంగా ఉన్నప్పటికీ, జంతువుల వేట మాత్రం ఆగడం లేదు. వన్యప్రాణులను వేటాడినట్లు నిర్థారణ అయితే నిందితులకు బెయిల్‌ రావడం కూడా కష్టమే.. అయినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో వేటగాళ్లు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. 

వేసవి ముప్పు.. 
వేసవి కాలం వచ్చిందంటే అడవిలోని చెట్లు ఆకులు రాల్చడం వల్ల జంతువులు దూరం నుంచే వేటగాళ్ల కంట పడుతున్నాయి.వేటనే వృత్తిగా చేసుకున్న ఒడిశా వేటగాళ్లు పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం వల్ల వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. గత ఏడాది కొంతమంది వేటగాళ్లను పట్టుకుని కేసులు నమోదు చేసినా, పరిస్థితిలో మార్పు రాలేదు. 

నాటు తుపాకుల వినియోగం 
వేటగాళ్లు నాటు తుపాకులను ఉపయోగిస్తూ అడవి గేదెలు (బైసన్లు), కణుజులు, దుప్పులు వంటి అరుదైన జంతువులను వేటాడుతున్నారు. దీనివల్ల ఈ జాతులు క్రమంగా అంతరించిపోతున్నాయి. అటవీ శాఖలో పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడం వల్ల నిఘా, పర్యవేక్షణ లోపిస్తోంది. 

పులుల ఆచూకీ మృగ్యం 
2010లో నిర్వహించిన పులుల గణనలో మర్రిపాకల రేంజ్‌లో రెండు పులులు, రెండు పులిపిల్లలు ఉన్నట్లు అటవీ శాఖ గుర్తించింది. కానీ, ఆ తర్వాత జరిగిన గణనలో వాటి జాడ లభించలేదు. పులులకు ఆహారంగా ఉండే అడవి గేదెలు, ఇతర జంతువుల సంఖ్య తగ్గిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. సాధారణంగా ఆహారం లభించని పక్షంలో పులులు వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోతాయి. 

వేటగాళ్ల వ్యూహం 
ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా నుంచి సుమారు 20 మంది చొప్పున నాలుగు, ఐదు బృందాలు నాటు తుపాకులతో బైక్‌లపై వస్తుంటారు. వీరు ముఖ్యంగా యూ.చీడిపాలెం, ఎం.భీమవరం పంచాయతీల పరిధిలోని నీటి కాలువల వద్ద మాటు వేస్తారు. దాహంతో నీరు తాగడానికి వచ్చే జంతువులను కాల్చి చంపుతారు. అనంతరం ఆ మాంసాన్ని ఎండబెట్టి, సంచుల్లో నింపుకుని తరలిస్తుంటారు. 

2015లో ఎన్‌కౌంటర్‌తో.. 
పుట్టకోట సమీపంలో కాలువ వద్ద మాటు వేసిన ఒడిశా వేటగాళ్లను చూసి, కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులు మావోయిస్టులుగా భావించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వేటగాళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత కొంతకాలం వేట తగ్గినా, మళ్లీ పాత పరిస్థితే పునరావృతమైంది. దీంతో సీలేరు, మర్రిపాకల, పెదవలస రేంజ్‌లలో జంతువుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. స్థానికుల వద్ద ఉన్న రహస్య నాటు తుపాకుల వల్ల కూడా వేట కొనసాగుతోంది. ప్రస్తుతం మన అటవీ శాఖ అధికారులు మల్కన్‌గిరి అధికారులతో సమన్వయం చేసుకుంటూ వేటగాళ్ల కదలికలపై నిఘా ఉంచారు. కొంతమందిని ఇప్పటికే గుర్తించడంతో వేటగాళ్లలో భయం మొదలైంది. 

కఠిన చర్యలు తప్పవు 
జంతువులను వేటాడితే కఠిన చర్యలు తప్పవు. ఒడిశా వేటగాళ్ల రాకను చాలా వరకు కట్టడి చేశాం. వారిలో కొందరిని  గుర్తించి కదలికలపై నిఘా ఉంచాం. మల్కన్‌గిరి అటవీ అధికారులతో సమన్వయం చేస్తున్నాం. చింతపల్లి డివిజన్‌ పరిధిలోకి ప్రస్తుతం వేటగాళ్లు రాలేదు. వేటకు వస్తే అరెస్ట్‌ చేసి కేసులు పెడతామని హెచ్చరించాం.     – వైవీ నర్సింగరావు, డీఎఫ్‌వో, చింతపల్లి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement