రాష్ట్రంలో వంటగ్యాస్ సరఫరాలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం
బ్లాక్ మార్కెట్‌లో యధేచ్ఛగా అధిక రేట్లకు విక్రయం .. రూ.2వేల వాణిజ్య సిలిండర్ రూ.3–4వేలు
గృహ వినియోగదారులకు వారం రోజులు దాటినా అందని గ్యాస్
గృహ వినియోగదారులకు వారం రోజులు దాటినా అందని గ్యాస్
ఏపీలో మూడు, నాలుగు రోజులకు మాత్రమే సరిపడా నిల్వలు
ప్రభుత్వ నియంత్రణ కొరవడటంతో ఏజెన్సీల అడ్డగోలు దందా
అత్యవసరానికి ప్రభుత్వ ఆస్పత్రులు, హాస్టళ్లలోకూ గ్యాస్ అందించలేని దుస్థితిలో ప్రభుత్వం
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరాలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైంది. గృహ, వాణిజ్య సిలిండర్ల మధ్య తేడా లేకుండా బ్లాక్ మార్కెట్ దందా నడుస్తుంటే కళ్లప్పగించి చోద్యం చూస్తోంది. అత్యవసర వినియోగానికి ప్రభుత్వ ఆస్పత్రులు, హాస్టళ్లకు సైతం గ్యాస్‌ను అందించలేని దుస్థితిలో ఉంది. పైకి మాత్రం చంద్రబాబు యంత్రాంగం బూటకపు ప్రకటనలు చేస్తూ కాలం గడిపేస్తోంది. ముఖ్యంగా టీడీపీ నాయకులు, సానుభూతిపరుల చేతుల్లోని గ్యాస్ ఏజెన్సీల ద్వారా బ్లాక్ దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా నడుస్తోంది.
ఫలితంగా సంక్షోభ పరిస్థితులను అనుకూలంగా మలుచుకునే చంద్రబాబు నైజం మరోసారి బట్టబయలైంది. ముఖ్యంగా హోటళ్లు, కాఫీ షాపులు, రెస్టారెంట్లకు గ్యాస్ సరఫరా చేయట్లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. బ్లాక్ మార్కెట్‌లో రూ.3వేల నుంచి రూ.4వేలు చెల్లిస్తే సిలిండర్లు దొరకడం అధికార పార్టీ దందాను బట్టబయలు చేస్తోంది. మరోవైపు గృహ వినియోగ గ్యాస్ పంపిణీకి ఎటువంటి అవరోధం లేకపోయినా వినియోగదారులు గ్యాస్‌బుక్ చేసుకుని వారం రోజులు దాటుతున్నా సరఫరా జరగట్లేదు.
నిత్యం గ్యాస్ ఏజెన్సీలకు ఫోన్లు చేస్తే రేపు, ఎల్లుండి.. అంటూ సమాధానం వస్తోంది మినహా గ్యాస్ అందట్లేదు. సహజ వాయువులు, ఎల్పీజీ ఉత్పత్తులను ‘నిత్యావసర వస్తువుల చట్టం’లోకి మార్చినప్పటికీ యథేచ్ఛగా పక్కదారి పట్టిస్తుండటం గమనార్హం.
నాలుగు రోజులకే నిల్వ!
ఏపీలో 1.61 కోట్ల గృహ వినియోగ, 10లక్షల వరకు వాణిజ్య వినియోగ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో గృహ వినియోగానికి రోజుకు 4వేల టన్నుల గ్యాస్ అవసరం. రాష్ట్రంలో 17 వేల టన్నుల నిల్వలు ఉన్నాయి. ఇది నాలుగు రోజులకు మాత్రమే సరిపోతాయి. గడిచిన కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి. గతంలో నిత్యం 2.50 లక్షలకు పైగా గ్యాస్ సిలిండర్లు సరఫరా ఉంటే తాజా ఆందోళనకర పరిస్థితుల్లో రోజువారీ బుకింగ్‌లు 3లక్షలకుపైగా పెరిగాయి.
గ్యాస్ బుకింగ్ గడువు పట్టణాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజులకు పెంచిన తర్వాత కూడా బుకింగ్‌లు తగ్గట్లేదు. అంటే, ఇంటిలో గ్యాస్ నిండుకుంటున్న తరుణంలో బుక్ చేసుకున్న వినియోగదారులు వారానికిపైగా సిలిండర్ కోసం ఎదురు చూడకతప్పని పరిస్థితి. మరోవైపు క్లిష్ట పరిస్థితుల్లో వెసులుబాటు ఇవ్వాల్సిన చోట ప్రభుత్వం ఈ–కేవైసీని తప్పని సరి చేయడంతో సమస్య జటిలమైంది. గ్యాస్ బుక్ అవ్వట్లేదంటూ వేలాదిమంది వినియోగదారులు ఏజెన్సీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
మూసివేతకు దగ్గరగా హోటళ్లు
గ్యాస్ కొరత హోటళ్లు, ఆతిథ్య రంగాన్ని తీవ్రంగా వేధిస్తోంది. రాష్ట్రంలో 2వేలకు పైగా స్టార్ హోటళ్లు, 3 వేలకుపైగా రెస్టారెంట్లతో పాటు చిరువ్యాపారులు కలుపుకొంటే 25వేలకుపై వ్యాపార సంస్థలు దినదిన గండంగా నడుస్తున్నాయి. నిత్యం హోటళ్ల రంగంలో 50 వేలకుపైగా సిలిండర్లు అవసరం. అలాంటిది ఒక్కసారిగా గ్యాస్ సరఫరా నిలిపివేడయంతో ఎప్పుడు పొయ్యి ఆరిపోతుందో తెలియని పరిస్థితుల్లో పని చేస్తున్నాయి.
ప్రభుత్వం వాణిజ్య సిలిండర్లకు ఆంక్షలు పెడితే.. బ్లాక్ మార్కెట్‌లో రూ.3 వేలు నుంచి రూ.4వేలు వెచ్చించి కొనుగోలు చేస్తూ వ్యాపారాలు సాగిస్తున్నాయి. ఈ బ్లాక్ మార్కెట్ దందా గృహ వినియోగ సిలిండర్ల కొరతకు ఆజ్యం పోస్తోంది. ఇప్పటికే చాలా హోటళ్లు, క్యాటరింగ్ సర్వీసు వ్యాపారులు కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు.
మార్కెట్‌లోని పరిస్థితిలో మార్పు రాకపోతే హోటళ్ల మూసివేతకు వారం కంటే ఎక్కువ సమయం పట్టదని అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హోటళ్ల సమయాన్ని అధికారికంగా రాత్రి 10 గంటల్లోపు కుదించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా స్పందన లేకపోవడం గమనార్హం.


