
విడదీత, వివిదీకరణ, రుణాల తగ్గింపు
100 బిలియన్ డాలర్ల బిజినెస్‌పై దృష్టి
న్యూఢిల్లీ: మైనింగ్ రంగ దిగ్గజం వేదాంతా బిజినెస్‌ను రెట్టింపునకు పెంచుకునేందుకు వీలుగా 3డీ వ్యూహానికి తెరతీయనుంది. దీనిలో భాగంగా విడదీత, వివిధీకరణ(డైవర్సిఫికేషన్), రుణ భారాన్ని తగ్గించుకోవడంపై దృష్టి పెట్టనుంది. కంపెనీ 60వ సాధారణ వార్షిక సమావేశంలో కంపెనీ చైర్మన్ అనిల్ అగర్వాల్ సెపె్టంబర్‌లోగా వివిధ బిజినెస్‌ల విడదీతను పూర్తిచేగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాటాదారులనుద్దేశించి ప్రసంగిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు. ప్రత్యేక కంపెనీగా విడదీసే ప్రతీ బిజినెస్ 100 బిలియన్ డాలర్ల విలువైన సంస్థగా ఆవిర్భవించేందుకు వీలున్నట్లు పేర్కొన్నారు.
3డీ వ్యూహం కంపెనీ పరిమాణాన్ని రెట్టింపు చేయనున్నట్లు తెలియజేశారు. తద్వారా వాటాదారులకు గరిష్ట ప్రయోజనం చేకూరనున్నట్లు తెలియజేశారు. వ్యాపార పునర్వ్యవస్థీకరణ చివరి దశలో ఉన్నట్లు వెల్లడించారు. ఇందుకు 99.5 శాతం వాటాదారులు, రుణదాతల అనుమతి పొందినట్లు తెలియజేశారు. విడదీత పూర్తయితే వేదాంతా వాటాదారులకు తమ వద్దగల ప్రతీ షేరుకీ విడదీసిన 4 బిజినెస్‌ల నుంచి ఒక్కో షేరు చొప్పున కేటాయించనున్నట్లు వివరించారు. కాగా.. యూఎస్ షార్ట్‌సెల్లర్ సంస్థ వైస్రాయ్ రీసెర్చ్.. ఒక రోజు ముందు వేదాంతా రిసోర్సెస్ ఒక పారసైట్ వంటిదని, దేశీ యూనిట్(వేదాంతా లిమిటెడ్)ను వ్యవస్థాగతంగా బలహీనపరుస్తున్నదంటూ వ్యాఖ్యానించిన నేపథ్యంలో అనిల్ అగర్వాల్ ప్రసంగానికి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే వైస్రాయ్ రీసెర్చ్ ఆరోపణలకు ఎలాంటి ప్రాతిపదికలేదని వేదాంతా కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.