ఆరోగ్యం అత్యంత విలువైన ఆస్తి. అందుకే, అనుకోని ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఆర్థిక భారం నుంచి ఉపశమనం పొందడానికి ఆరోగ్య బీమా (Health Insurance) పాలసీలు తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే, పాలసీ తీసుకునే క్రమంలో బీమా ఏజెంట్లు లేదా మధ్యవర్తులు పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను, ముఖ్యంగా పాలసీదారునికి ప్రతికూలంగా ఉండే అంశాలను చెప్పడం లేదనే ఆరోపణలున్నాయి. పాలసీ తాలూకు నిజమైన నిబంధనలు, పరిమితులు కప్పిపుచ్చడం వల్ల క్లెయిమ్ సమయంలో పాలసీదారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఏజెంట్లు కావాలనే దాచే లేదా ఎక్కువగా చెప్పని అంశాలేమిటో చూద్దాం.
కో-పేమెంట్ నిబంధన
చాలా పాలసీల్లో కో-పేమెంట్ నిబంధన ఉంటుంది. దీని ప్రకారం ఆసుపత్రి బిల్లులో నిర్ణీత శాతాన్ని (ఉదాహరణకు, 10% లేదా 20%) పాలసీదారుడే భరించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని మాత్రమే బీమా కంపెనీ చెల్లిస్తుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల ప్లాన్లలో ఇది సర్వసాధారణం. ఏజెంట్లు ఈ ముఖ్యమైన ఆర్థిక భారాన్ని విస్మరిస్తారు.
వెయిటింగ్ పీరియడ్స్
బీమా పాలసీని కొన్ని రకాల వెయిటింగ్ పీరియడ్స్ ప్రభావితం చేస్తాయి. పాలసీ తీసుకున్న మొదటి 30 రోజులు (కొన్ని ప్రత్యేక ప్రమాదాలు మినహా) వరకు ఎలాంటి అనారోగ్యానికి క్లెయిమ్ చేయలేరు. కీళ్ల నొప్పులు, క్యాటరాక్ట్, హెర్నియా వంటి కొన్ని నిర్దిష్ట వ్యాధులకు 1 లేదా 2 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. పాలసీ తీసుకునే ముందు నుంచే ఉన్న మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులకు సాధారణంగా 2 నుంచి 4 సంవత్సరాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. పాలసీ తీసుకున్న వెంటనే ఈ వ్యాధులకు క్లెయిమ్ రాదని ఏజెంట్లు స్పష్టంగా చెప్పరు.
రూమ్ రెంట్ క్యాపింగ్
చాలా ప్లాన్లలో బీమా మొత్తం ఆధారంగా రోజువారీ గది అద్దెపై పరిమితి ఉంటుంది. ఉదాహరణకు, ఒక పాలసీలో బీమా మొత్తంలో 1% మాత్రమే రూమ్ అద్దెగా నిర్ణయించవచ్చు. దీని అర్థం రూ.5 లక్షల పాలసీకి రోజుకు గరిష్టంగా రూ.5,000 మాత్రమే గది అద్దె కింద చెల్లిస్తారు. మీరు అంతకంటే ఖరీదైన గదిని ఎంచుకుంటే అధిక అద్దెతో పాటు గది అద్దెతో సంబంధం ఉన్న ఇతర ఖర్చులలో కొంత భాగాన్ని (ఉదాహరణకు, డాక్టర్ ఫీజు, నర్సింగ్ ఛార్జీలు) పాలసీదారుడే భరించాల్సి వస్తుంది.
క్లెయిమ్ తిరస్కరణ
దరఖాస్తు ఫామ్‌లో పాలసీదారుని మునుపటి ఆరోగ్య చరిత్ర, శస్త్రచికిత్సలు, తీసుకుంటున్న మందుల గురించి తప్పుడు లేదా అసంపూర్తి సమాచారం ఇవ్వడం వల్ల క్లెయిమ్ సమయంలో బీమా కంపెనీ పాలసీని రద్దు చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఏజెంట్లు పాలసీ త్వరగా ఆమోదం పొందాలనే ఉద్దేశంతో దాచమని సలహా ఇస్తారు. ఇది క్లెయిమ్ తిరస్కరణకు ప్రధాన కారణం అవుతుంది.
సబ్ లిమిట్స్
కొన్ని చికిత్సలు లేదా సర్వీసులపై బీమా కంపెనీ నిర్దిష్ట పరిమితులు విధిస్తుంది. ఉదాహరణకు, క్యాటరాక్ట్ శస్త్రచికిత్సకు రూ.40,000 మించి చెల్లించరు. అంబులెన్స్ ఛార్జీలకు రూ.2,000 మించి చెల్లించరు. మీరు ఆ చికిత్సకు అంతకంటే ఎక్కువ ఖర్చు చేసినా పరిమితి మేరకు మాత్రమే క్లెయిమ్ లభిస్తుంది.
కవర్ కాని అంశాలు
సౌందర్య చికిత్సలు (Cosmetic Treatment), అడ్వెంచర్ స్పోర్ట్స్ వల్ల కలిగే గాయాలు, అప్పుడే పుట్టిన శిశువుల చికిత్స ఖర్చులు (కొన్ని వారాల వరకు), నాన్-మెడికల్ వస్తువులు (గ్లోవ్స్, మాస్కులు, టూత్ బ్రష్, పౌడర్ మొదలైనవి) వంటి అనేక అంశాలను పాలసీ కవర్ చేయదు. ఈ మినహాయింపుల జాబితాను ఏజెంట్లు చాలా అరుదుగా వివరిస్తారు.
పాలసీదారులు ఏం చేయాలి?
బీమా పాలసీ గురించి ఏజెంట్ మాటలు విన్న తర్వాత తప్పనిసరిగా డాక్యుమెంట్‌ను పూర్తిగా చదవాలి.
నిబంధనలు, షరతులు, మినహాయింపులు, కో-పేమెంట్ సెక్షన్లను పరిశీలించాలి.
పాలసీ పత్రాలు అందిన తర్వాత 15 రోజుల ఫ్రీ-లుక్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో మీకు పాలసీ నచ్చకపోతే పూర్తి డబ్బు వెనక్కి తీసుకొని రద్దు చేసుకోవచ్చు.
వెయిటింగ్ పీరియడ్స్, కో-పేమెంట్, రూమ్ రెంట్ క్యాపింగ్ గురించి ఏజెంట్‌ను స్పష్టంగా అడిగి ఈమెయిల్ రూపంలో సమాచారం పొందాలి.
ఇదీ చదవండి: ఈ-కామర్స్ అనైతిక పద్ధతులకు కేంద్రం కళ్లెం


