ఆస్పత్రి ఆవరణలో ప్రాణాలు విడిచిన వృద్ధురాలు
చికిత్స కోసం వచ్చి మృత్యువాత
ఆరుబయట పడుకున్నా పట్టించుకోని ఆస్పత్రి సిబ్బంది
మదనపల్లె రూరల్ : ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చిన ఓ వృద్ధురాలు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆస్పత్రి ఆవరణలో ఆరుబయట పడుకుని చలికి తాళలేక మృత్యువాత పడిన ఘటన శనివారం జరిగింది. తంబళ్లపల్లె మండలం బలకవారిపల్లెకు చెందిన వెంకటప్ప భార్య మల్లమ్మ(75)కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో చికిత్స కోసం శుక్రవారం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి వచ్చింది. లోనికి వెళ్లి వైద్యం చేయించుకునేందుకు శరీరం సహకరించకపోవడంతో ఓపీ బ్లాక్ సమీపంలో ఆరుబయట పడుకుంది. గమనించిన కొందరు వృద్ధురాలిని అత్యవసర విభాగంలోకి తీసుకెళ్లి చికిత్స చేయించారు. చేతికి క్యాన్‌లా అమర్చి సూదిమందు వేశారు. చికిత్స అనంతరం ఆమె ఇంటికి వెళ్లకుండా ఆస్పత్రిలోనే ఉండిపోయింది.
రాత్రిపూట ఆస్పత్రిలో అడ్మిట్ రోగులను తప్ప మిగిలిన వారిని బయటకు పంపేయడంతో వృద్ధురాలు ఓపీ బ్లాక్ బయట స్లాబ్ కింద పడుకుంది. అయితే, రాత్రిపూట ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయి చలిగాలులు, మంచు అధికం కావడంతో అనారోగ్యంతో బాధపడుతున్న మల్లమ్మ, తట్టుకోలేక వణుకుతూ ప్రాణాలు విడిచింది. చికిత్స కోసం వచ్చిన వృద్ధురాలు ఓపీ బ్లాక్ ఎదుట ఆరుబయట అందరికీ కనిపించే విధంగా పడుకుంటే, రాత్రిపూట విధుల్లో ఉన్న ఆస్పత్రి సిబ్బంది గమనించకపోవడం దారుణం. శనివారం ఉదయం వృద్ధురాలిని గమనించిన ఆస్పత్రి సిబ్బంది హుటాహుటిన అత్యవసర విభాగంలోకి తీసుకువెళ్లి డాక్టర్లతో పరీక్షలు చేయించగా, చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
పట్టణంలోని బీకే.పల్లెలో నివాసం ఉంటున్న కుమార్తె మల్లీశ్వరి అంత్యక్రియల కోసం తల్లి మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తీసుకెళ్లింది. సెక్యూరిటీ, ఆస్పత్రి సిబ్బంది రాత్రిపూట ఓ వృద్ధురాలు ఆరుబయట పడుకున్నా గమనించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో వైద్యసేవలు అంతంతమాత్రంగానే ఉన్న తరుణంలో వచ్చిన ఒకటి అరా కేసులను నిర్లక్ష్యంగా వదిలేయడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓ పట్టించుకోవడం లేదంటూ ప్రజలు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. సిబ్బంది నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.


