ఈ-కామర్స్ అనైతిక పద్ధతులకు కేంద్రం కళ్లెం | CCPA taken proactive stance against dark patterns ecommerce platforms | Sakshi
Sakshi News home page

ఈ-కామర్స్ అనైతిక పద్ధతులకు కేంద్రం కళ్లెం

Nov 20 2025 5:19 PM | Updated on Nov 20 2025 7:32 PM

CCPA taken proactive stance against dark patterns ecommerce platforms

ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో వస్తువులు బుక్‌ చేసేప్పుడు ‘మరో 10 నిమిషాల్లో ఈ ఆఫర్ ముగుస్తుంది’, ‘మీకు మాత్రమే ప్రత్యేకం’, ‘ఈ వస్తువులు ఇంకో 5 మాత్రమే మిగిలాయి’ అంటూ మీపై ఒత్తిడి పెంచే ప్రకటనలు రావడం గమనించారా.. అయితే ఇకపై ఇలాంటి ప్రకటనలకు చెక్‌ పెట్టేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు వినియోగదారులను మోసగించేందుకు అనుసరిస్తున్న ‘డార్క్ ప్యాటర్న్స్’ (అనైతిక పద్ధతులు)కు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ అనైతిక పద్ధతులను తొలగించడానికి వీలుగా సెల్ఫ్ ఆడిట్ (స్వీయ తనిఖీ) చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధించింది.

తొలగింపునకు సిద్ధమైన 26 కంపెనీలు

కేంద్ర ప్రభుత్వం విధించిన ఈ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడానికి దేశంలోని 26 ప్రధాన ఈ-కామర్స్ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఫ్లిప్‌కార్ట్, మేక్ మై ట్రిప్ వంటి అగ్రశ్రేణి కంపెనీలతో సహా పలు సంస్థలు ఇప్పటికే తమ ప్లాట్‌ఫామ్స్‌పై డార్క్ ప్యాటర్న్స్ ఉన్నాయా లేవా అని ఆడిట్ నిర్వహించినట్లు వెల్లడించాయి. ఆన్‌లైన్ వ్యాపారం చేసే అన్ని కంపెనీలు ఈ పద్ధతులను విధిగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

డార్క్ ప్యాటర్న్స్ అంటే ఏంటి?

కస్టమర్‌ల మనస్తత్వాలను వాడుకుని వారి ఇష్టానికి వ్యతిరేకంగా లేదా బలవంతంగా కొనుగోళ్లు, సబ్‌స్క్రిప్షన్‌లు లేదా డేటా షేరింగ్‌ను చేయించేలా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు ఉపయోగించే మోసపూరితమైన డిజైన్ పద్ధతులనే డార్క్ ప్యాటర్న్స్ అంటారు.

  • వినియోగదారులకు తెలియకుండానే లేదా వారు సులభంగా క్యాన్సిల్‌ చేయలేని విధంగా సబ్‌స్క్రిప్షన్ ప్యాకేజీల్లో ఇరికిస్తారు.

  • ‘మరో 10 నిమిషాల్లో ఈ ఆఫర్ ముగుస్తుంది’, ‘మీకు మాత్రమే ప్రత్యేకం’, ‘ఈ వస్తువులు ఇంకో 5 మాత్రమే మిగిలాయి’ అంటూ ఒత్తిడి పెంచి తప్పుడు ప్రకటనలతో కొనుగోలుకు ప్రేరేపిస్తారు.

  • కస్టమర్‌లు సులభంగా అర్థం చేసుకోలేని సాంకేతిక పదజాలం లేదా నిబంధనలను ఉపయోగించి వారికి తెలియకుండానే కొన్ని అంశాలకు అంగీకరించేలా చేస్తారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు ఈ అనైతిక పద్ధతులకు పాల్పడినట్లు తేలితే లేదా వినియోగదారులను మోసగించే చర్యలకు పాల్పడినట్లు రుజువైతే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) గట్టిగా హెచ్చరించింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారుల హక్కుల రక్షణలో కీలకమైన ముందడుగుగా చెప్పవచ్చు. ఆన్‌లైన్ షాపింగ్ పెరిగిన నేపథ్యంలో కమీషన్ల కోసం, ఎక్కువ లాభాల కోసం ఈ-కామర్స్ కంపెనీలు అనుసరించే డార్క్ ప్యాటర్న్స్ కారణంగా మధ్యతరగతి వినియోగదారులు చాలా వరకు నష్టపోతున్నారు. ఈ కొత్త నిబంధనల అమలు, సెల్ఫ్ ఆడిట్ ద్వారా ప్లాట్‌ఫామ్‌ల్లో పారదర్శకత పెరుగుతుంది. ఫ్లిప్‌కార్ట్, మేక్ మై ట్రిప్ వంటి పెద్ద కంపెనీలు స్వచ్ఛందంగా ముందుకు రావడం ఈ నిబంధనల విజయానికి సానుకూల సంకేతంగా ఉంది. భవిష్యత్తులో సీసీపీఏ ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని యూజర్లు కోరుతున్నారు.

ఇదీ చదవండి: రైల్వేకు ఐఆర్‌సీటీసీ కాసుల వర్షం.. ఎలాగంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement