ఇన్వెంటరీ ఆధారిత ఈ–కామర్స్ ఎగుమతుల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించే ప్రతిపాదనను కేంద్ర వాణిజ్య శాఖ తీసుకొచ్చింది. దీనిపై పలు కేంద్ర ప్రభుత్వ విభాగాలను అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. దీనివల్ల ఈ–కామర్స్ ఎగుమతులను గణనీయంగా పెంచుకోవచ్చని, అదే సమయంలో దేశీయంగా చిన్న వర్తకుల ప్రయోజనాలను కాపాడుకోవచ్చన్నది కేంద్రం ఉద్దేశ్యంగా ఉంది. దేశంలో తయారైన వాటికి సంబంధించి దీన్ని అమలు చేయాలనుకుంటోంది.
ప్రస్తుతం ఇన్వెంటరీ ఆధారిత ఈ–కామర్స్ రంగంలో ఎఫ్‌డీఐలకు అనుమతి లేదు. ఇన్వెంటరీ నమూనా అంటే.. విక్రేతల (సెల్లర్స్) స్థానంలో ఈ–కామర్స్ సంస్థలు ఉత్పత్తులను తమ రెవెన్యూ పుస్తకాల్లో కలిగి ఉంటాయి. దీంతో ఈ–కామర్స్ సంస్థలు కేవలం ప్లాట్‌ఫామ్ మాదిరిగా కాకుండా విక్రతలుగానూ వ్యవహరించొచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు మార్కెట్‌ప్లేస్ (కొనుగోలుదారులు, విక్రయదారులకు మధ్యవర్తిత్వ వేదిక)గానే వ్యవహరిస్తున్నాయి. ఈ తరహా సంస్థల్లోకి 100 శాతం ఎఫ్‌డీఐకి ఆటోమేటిక్ మార్గంలో (అనుమతులు అవసరం లేని) అనుమతి ఉంది.
ఈ–కామర్స్ సంస్థలు కేవలం ఎగుమతులకు సంబంధించిన ఇన్వెంటరీ కలిగి ఉంటే తమకు అభ్యంతరం లేదని కేంద్ర వాణిజ్య మంత్రి గోయల్ గత నెలలో ప్రకటించడం గమనార్హం. ఈ–కామర్స్ ఎగుమతులు ప్రస్తుతం 2 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. అదే చైనా నుంచి ఈ–కామర్స్ ఎగుమతులు 350 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. దీంతో కేంద్ర ప్రభుత్వం.. తాజా ప్రతిపాదన తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి: పెట్టుబడి వెనక్కి తీసుకుంటే పెనాల్టీ కట్టాలా?


