
ఆ బొమ్మ మొహం చూస్తేనే ‘అమ్మో! బొమ్మ!’ అని భయపడిపోతాం. కాని, చూసే కొద్దీ ప్రేమలో పడిపోతూనే ఉంటాం. అదే లబుబు మ్యాజిక్! ఒక వైపు దెయ్యంలా మొహం, మరోవైపు క్యూట్‌నెస్! ఇది చిన్న పిల్లల బొమ్మలా కనిపిస్తుంది. కానీ, ఇప్పుడిది ప్రపంచం మొత్తాన్ని చుట్టబెట్టేస్తోంది.
హాంకాంగ్ కళాకారుడు కాసింగ్ లంగ్ 2015లో ఈ లబుబు బొమ్మను సృష్టించాడు. నార్డిక్ పురాణాల ప్రేరణతో రూపొందించిన ‘ది మాన్‌స్టర్స్’ అనే కామిక్ షో ఆధారంగా ఈ బొమ్మ పుట్టింది. పుట్టాక మూడేళ్లు ఇంట్లోనే ఉండిపోయింది.
కానీ, 2019లో చైనా టాయ్ కంపెనీ ‘పాప్ మార్ట్’ దీన్ని మొదటిసారిగా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఎలా అంటే బ్లైండ్ బాక్స్‌లుగా– ఏ బొమ్మ వస్తుందో తెలియని థ్రిల్‌తో పాపం పిల్లల జేబుల్ని ఖాళీ చేస్తూ మార్కెట్‌ను ముంచెత్తింది. దీనికి తోడు 2024లో కొరియన్ పాప్ సింగర్ లీసా దీన్ని సోషల్ మీడియాలో చూపించడంతో, థాయ్‌లండ్‌లోని పాప్ మార్ట్ స్టాల్స్ వద్ద లబుబు కోసం మానవ సముద్రమే కనిపించింది. దాని క్రేజ్ అక్కడితో ఆగలేదు, ఖండాలు దాటి, మార్కెట్‌లో వేలాకోట్ల డాలర్ల టర్నోవర్‌ను ఒక్క ఏడాదిలోనే దాటేసింది.
ఎందుకంటే, లబుబు అప్పటికే సెలబ్రిటీల చేతుల్లోకి కూడా చేరిపోయింది హాలీవుడ్ సెలబ్రిటీలు రిహానా, డువా లిపా, లిజ్జో లాంటి వాళ్లు దీన్ని చేతిలో పట్టుకుని ఫొటోలు తీసుకున్నారు. చాలామంది లబుబుని ఓ స్నేహితురాలు, మూడ్ బస్టర్ అంటూ వారి బ్యాగ్‌కి తగిలించుకుని తిరగడం ఫ్యాషన్‌గా మారింది. వీరిలో కొందరు లబుబుకి పేర్లు పెడతారు. డ్రస్సులు మార్చేస్తారు. ఫొటోషూట్లు కూడా చేస్తారు. దీనిని కేవలం బొమ్మగా కాదు, తమ చిన్న ప్రపంచంలో స్పెషల్ వీఐపీలా చూసుకుంటూ సంబరపడిపోతున్నారు.
ఇప్పుడిప్పుడే ఇండియాలో!
లబుబు ఫీవర్ ఇప్పుడు బాలీవుడ్‌కు కూడా వచ్చింది. నటి అనన్యా పాండే ఈ మధ్యనే తన పింక్ లబుబుతో జెన్‌జీ స్టయిల్‌ని సెట్ చేసింది. నటి శార్వరీ వాఘ్ క్యాజువల్‌గా కీచెయిన్‌లా వాడుతూ ట్రెండ్ సెట్టర్‌గా మారింది. సింగర్ నేహా కక్కర్– తన స్ట్రీట్ స్టయిల్ ఫ్రెండ్ అంటూ బ్లూ లబుబును చేతిలోనే తిప్పుకుంటూ తిరుగుతోంది.
ఇక నటి ఉర్వశి రౌతేలా అయితే, ఏకంగా ఒకేసారి నాలుగు లబుబులతో షాక్ ఇచ్చింది, ట్రెండ్‌కు ఏజ్‌తో సంబంధం లేదని నటి ట్వింకిల్ ఖన్నా తన లబులును చూపించింది. అలా ఇప్పుడిది సెలెబ్రిటీ హ్యాండ్‌బ్యాగ్‌లలో మెరిసే క్యూట్ లగ్జరీ స్టేటస్‌గా మారిపోయింది.
బొమ్మే కాదు, బిల్లు చూస్తే భయం!
పాప్ మార్ట్ స్టోర్ ధరల ప్రకారం, సాధారణ బాక్స్ లబుబు ధర రూ. 1,200 నుంచి రూ. 1,800. అదే స్పెషల్ ఎడిషన్లు అయితే రూ. 2,500 నుంచి రూ. 5,000. కానీ అదృష్టం ఉంటే రేర్ బొమ్మ దొరుకుతుంది. ఆ బొమ్మకు అయితే రూ. 40,000 కూడా తక్కువే!
ఇక హ్యూమన్ సైజ్ లబుబు కావాలంటే? ఏకంగా రూ. 1.25 కోట్లు! ఔను, కోట్లే! దీన్ని ఇంట్లో పెట్టుకోవాలంటే, ముందు మీ ఇంటిని అమ్ముకోవాలి! ఇక బ్లాక్ మార్కెట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లబుబు దొరక్కపోతే ధర పదిరెట్లు కూడా కడుతున్నారు. ఇది చూసి చాలామంది, ‘వీళ్లు బొమ్మలు అమ్ముతున్నారా లేక బంగారమా!’ అంటూ నోరెళ్లబెడుతున్నారు.
క్రేజ్‌తో క్యాష్ !
అసలు లబుబు దొరకక ఇబ్బంది పడుతున్నఫ్యాన్స్, ఇప్పుడు ప్రత్యామ్నాయ లబుబు బొమ్మలతో పండగ చేసుకుంటున్నారు. ఈ క్రేజ్‌నే చాలా వ్యాపారాలు క్యాష్ చేసుకుంటున్నాయి! మార్కెట్‌లోకి ఇప్పటికే వివిధ రకాల వస్తువులు లబుబు టచ్‌తో రిఫ్రెష్ అయ్యాయి. లబుబు డిజైన్స్‌తో ఉంటే డాల్స్, కీచెయిన్లు, బ్యాగ్స్, స్టికర్లు, స్టేషనరీ, బెడ్ షీట్లు, కుషన్లు వంటి వస్తువులన్నీ వచ్చేశాయి.
చిన్న బొమ్మగా మొదలైన లబుబు, ఇప్పుడు వాల్ నుంచి వాచ్ వరకు మారిపోయి, ఇంటినిండా సందడి చేస్తోంది. ఈ ఎక్స్‌ట్రీమ్ డిమాండ్‌కి తగ్గట్టు ధరలు కూడా అలాగే ఉన్నాయి. చిన్న స్టికర్‌కైనా సరే కేవలం ‘ఇది లబుబు బ్రాండ్’ అన్న ట్యాగ్ తో ధరల్లో కొండెక్కి కూర్చుటోంది. లబుబు బొమ్మ కాదు, ఒక కమర్షియల్ సంచలనం!