
నోట్ల కట్టల వ్యవహారంతో వార్తల్లోకి ఎక్కిన జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసిన త్రిసభ్య కమిటీ నివేదికను సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌ను గురువారం సర్వోన్నత న్యాయస్థానం కొట్టిపారేసింది.
నోట్ల కట్టల వ్యవహారంలో తన అభిప్రాయాన్ని విచారణ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదని, తనను తొలగించాలన్న ఆ కమిటీ నివేదిక చెల్లదని జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. జస్టిస్ యశ్వంత్ వర్మ ప్రవర్తన విశ్వాసాన్ని మార్చలేదని తెలిపిన సుప్రీం కోర్టు.. అప్పటి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా రాష్ట్రపతి, ప్రధానికి లేఖలు రాయడం రాజ్యాంగ వ్యతిరేకమేమీ కాదని వ్యాఖ్యానించింది.
‘‘భారత ప్రధాన న్యాయమూర్తి, ఇన్‌హౌజ్ కమిటీ యధావిధిగా తమ ప్రక్రియను అనుసరించారు. అయితే ఈ కేసులో ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ చేయకపోవడం అవసరం లేనిదే. అయితే అప్పట్లోనే మీరు దీనిని సవాల్ చేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు చేసినా దాని ప్రభావం లేకుండా పోయింది. ఇన్ హౌజ్ విచారణ అనేది రాజ్యాంగానికి విరుద్ధమైనది ఏం కాదు. ఇది న్యాయ వ్యవస్థలో నైతికతను కాపాడేందుకు రూపొందించబడింది. భారత ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఒక పోస్ట్ ఆఫీస్ కాదు.. చర్యలకు తీసుకునే బాధ్యత సీజేఐకి ఉంటుంది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఇదిలా ఉంటే.. ఈ పిటిషన్‌లో జస్టిస్ యశ్వంత్ వర్మ.. పిటిషన్‌ను అజ్ఞాత పేరుతో దాఖలు చేశారు. అలాగే దర్యాప్తు కమిటీ తనను సరిగా విచారించలేదని, తన వాదనలకు అవకాశం ఇవ్వలేదని కోర్టు ఎదుట వాదనలు వినిపించారు. ఈ విషయంలో న్యాయ ప్రక్రియ ఉల్లంఘించబడిందని, తాను మీడియా ట్రయల్‌కు(మీడియా కథనాలపై) లోనయ్యాను అని పిటిషన్‌లో తెలిపారు. జస్టిస్ వర్మ తరఫున కపిల్ సిబాల్‌తో పాటు ముకుల్ రోహత్గి, రాకేష్ ద్వివేది, సిద్ధార్థ్ లూథ్రాలాంటి ప్రముఖ లాయర్లు వాదనలు వినిపించడం గమనార్హం. అదే సమయంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా(మాజీ సీజేఐ) నేతృత్వంలో జరిగిన విచారణలో భాగం కావడంతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఈ పిటిషన్ విచారణ నుంచి వైదొలిగి మరో బెంచ్‌కు బదిలీ చేశారు.
కేసు నేపథ్యం:
2025 మార్చి 14: ఢిల్లీలోని జస్టిస్ వర్మ అధికారిక బంగ్లాలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పే సమయంలో నోట్ల కట్టలు కాలిన స్థితిలో ఓ రూమ్‌లో బయటపడ్డాయి
సుప్రీం కోర్టు స్వయానా విడుదల చేసిన వీడియోలో నగదు ముద్దలు కాలిపోతున్న దృశ్యాలు కనిపించాయి.
న్యాయవ్యవస్థపై అవినీతి విమర్శలు రావడంతో తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు నాటి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా.. త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయించి విచారణ జరిపించారు.
ఈ కమిటీ మే 3న నివేదిక అందించగా.. మే 4న నివేదికను రాష్ట్రపతికి పంపించిన చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా.. వర్మ తొలగింపు సిఫార్సు చేశారు.
అభిశంసన ఇప్పట్లో కష్టమే!
అయితే ప్రస్తుతం పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడుతున్నాయి. ఆగష్టు 21వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ తరుణంలో విచారణ జరగడం ఆలస్యం అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ సెషన్‌లో ఆయన్ని తొలగించడం సాధ్యం కాకపోవచ్చని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.